మండే'గాంధీ'లా | on july 18th International Mandela Day | Sakshi
Sakshi News home page

మండే'గాంధీ'లా

Published Sun, Jul 17 2016 1:24 AM | Last Updated on Mon, Sep 4 2017 5:01 AM

మండే'గాంధీ'లా

మండే'గాంధీ'లా

కవర్ స్టోరీ : జూలై 18 ఇంటర్నేషనల్ మండేలా డే
‘నల్లసూర్యుడు’ నెల్సన్ మండేలా దక్షిణాఫ్రికా ప్రజల సామూహిక స్వాతంత్య్ర ఆకాంక్షకు ప్రతీక. తర తరాల జాతి వివక్ష నుంచి దక్షిణాఫ్రికా నల్లజాతి ప్రజలను విముక్తం చేసిన విజయ పతాక. తొంభయ్యేళ్లకు పైబడిన నిండు జీవితం గడిపిన మండేలా జాత్యహంకారానికి వ్యతిరేకంగా సాగించిన పోరాటం చిరస్మరణీయమైనది. జీవితంలో దాదాపు మూడోవంతు జైలు గోడల వెనుక మగ్గిపోయినా, ఏనాడూ తన ఆశయ సాధన మార్గాన్ని విడిచిపెట్టలేదాయన.

దక్షిణాఫ్రికా నుంచి జాతి వివక్ష పోరాటాన్ని ప్రారంభించిన మహాత్మాగాంధీ చూపిన అహింసా మార్గమే తనకు స్ఫూర్తిదాయకమని చెప్పుకున్న మండేలాను జనం ‘దక్షిణాఫ్రికా గాంధీ’గా ప్రస్తుతిస్తారు. ఇద్దరికీ నడుమ కొన్ని వ్యత్యాసాలు ఉన్నా, పోరాట పథంలో ఇద్దరికీ చాలా సారూప్యాలూ ఉన్నాయి. అందుకే ‘మండే’గాంధీలా తెల్లవాళ్ల దురాగతాలపై ఉద్యమం సాగించారు.
 
అసలు పేరు ‘గడుగ్గాయి’
నెల్సన్ మండేలాకు తల్లిదండ్రులు పెట్టిన అసలు పేరు హోలిషాషా. ఖోసా భాషలో హోలిషాషా అంటే గడుగ్గాయి అని అర్థం. బడిలో చేరినప్పుడు మింగానే అనే టీచర్ ‘నీ పేరేమిటి?’ అని అడిగింది. ‘హోలిషాషా’ అని అమాయకంగా చెప్పారు మండేలా. ‘ఈ పేరేమీ బాగాలేదు. ఇక నుంచి నీ పేరు నెల్సన్’ అని ఖరారు చేసింది ఆ టీచర్. అప్పటి నుంచి నెల్సన్ మండేలాగా స్థిరపడ్డ ఆ పేరు తర్వాతి కాలంలో ప్రపంచ ప్రఖ్యాతి పొందింది. స్వేచ్ఛా పిపాసకు పర్యాయపదంగా మారింది. దక్షిణాఫ్రికా కేప్ ప్రావిన్స్‌లోని వెజో గ్రామంలో ఖోషా భాష మాట్లాడే థెంబు తెగకు చెందిన రాచ కుటుంబంలో 1918 జూలై 18న పుట్టారు మండేలా.

తండ్రి గాడ్లా హెన్రీ ఫాకన్యిస్వా థెంబు తెగకు నాయకుడు. అయితే, మండేలాకు తొమ్మిదేళ్ల వయసులోనే ఆయన చనిపోయారు. దాంతో జోంగింతాబా డాలింద్యెబో అనే రాచప్రతినిధి మండేలాను దత్తత తీసుకున్నాడు. తెగ నాయకుడిగా మండేలాను తీర్చిదిద్దేందుకు ఆయన అహరహం శ్రద్ధ తీసుకున్నాడు. ఆయన శ్రద్ధ ఫలితంగానే మండేలా బడిలో అడుగుపెట్టారు. థెంబు తెగలో నియత విద్య అభ్యసించిన తొలి వ్యక్తి మండేలానే. బడిలో చదువులోను, ఆటల్లోను చురుగ్గా ఉండేవారు. చదువుకునే రోజుల్లో బాక్సింగ్‌పై విపరీతమైన ఆసక్తి చూపేవారు. చిన్నప్పటి బాక్సింగ్ సాధనే కాబోలు, తర్వాతి కాలంలో అన్యాయాలపై పిడికిలెత్తేలా చేసింది.
 
మహాత్ముడే రాజకీయ గురువు
 విద్యార్థి దశలో మహాత్మాగాంధీ, మార్టిన్ లూథర్‌కింగ్, అబ్రహాం లింకన్‌ల సిద్ధాంతాలు, వారి ఉద్యమ కార్యాచరణ మండేలాను విపరీతంగా ప్రభావితం చేశాయి. అయితే, మహాత్ముడే తన రాజకీయ గురువు అని, తాను పుట్టిన నేలలోనే మహాత్మాగాంధీ అహింసా ఉద్యమాన్ని ప్రారంభించడం తనకు ఎంతగానో స్ఫూర్తినిచ్చిందని మండేలా స్వయంగా చెప్పుకున్నారు. మహాత్ముడి సిద్ధాంతాలతో తాను స్ఫూర్తి పొందినా, జీవితంలో తాను ఆయన నైతిక స్థాయిని, నిరాడంబరతను అందుకోలేకపోయానని కూడా వినమ్రంగా ఒప్పుకున్నారు.

‘గాంధీజీ ఎలాంటి బలహీనతలు లేని ఉదాత్త మానవుడైతే, నేను చాలా బలహీనతలు గల మామూలు మనిషిని’ అని మండేలా చెప్పిన మాటలు ఆయన నిజాయతీకి నిదర్శనంగా నిలుస్తాయి. మహాత్ముడిని అమితంగా ఆరాధించే మండేలా భారత్‌ను పవిత్రస్థలంగా భావించేవారు. అందుకే, ఇరవై ఏడేళ్ల జైలు శిక్ష నుంచి విడుదలయ్యాక తన తొలి విదేశీ పర్యటన కోసం ఆయన భారత్‌ను ఎంచుకున్నారు. అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టాక భారత్-దక్షిణాఫ్రికాల బంధం బలోపేతానికి కృషి చేశారు. దక్షిణాఫ్రికా మిత్రదేశాలలో భారత్‌ది అగ్రస్థానమని ప్రకటించారు.

మహాత్ముడి అడుగుజాడలలో నడిచిన మండేలాను భారత్ కూడా అక్కున చేర్చుకుని, 1990లో దేశంలోని అత్యున్నత పురస్కారమైన ‘భారతరత్న’తో సత్కరించింది. ‘భారతరత్న’ అందుకున్న తొలి విదేశీయుడు మండేలానే కావడం విశేషం. ‘భారతరత్న’ అందుకున్న మూడేళ్ల తర్వాత మండేలాకు ప్రపంచంలోనే అత్యున్నతమైన నోబెల్ శాంతి బహుమతి దక్కింది. ఆ తర్వాత భారత ప్రభుత్వం 2000 సంవత్సరంలో మండేలాను అంతర్జాతీయ గాంధీ శాంతి బహుమతితో సత్కరించింది.
 
విద్యార్థి దశలోనే ఉద్యమమార్గం
మండేలా పుట్టే నాటికే దక్షిణాఫ్రికా బ్రిటిష్ వలస రాజ్యంగా ఉండేది. స్థానిక నల్లజాతి వారిపై వలస వచ్చిన తెల్ల పాలకవర్గాలు అడుగడుగునా వివక్ష చూపేవారు. సహజంగానే పోరాట స్ఫూర్తిగల మండేలాకు ఇది నచ్చేది కాదు. ఎవరి ఆధిక్యతా లేని సమ సమాజం రావాలని ఆయన ఆకాంక్షించారు. హైస్కూలు చదువు పూర్తయ్యాక మండేలాకు పెళ్లి చేయాలని పెద్దలు నిశ్చయించుకున్నారు. పెళ్లి తర్వాత ఆయనకు తెగ నాయకత్వ బాధ్యతలను అప్పగించాలనేది వారి కోరిక.

పెద్దల ఆలోచన పసిగట్టిన మండేలా ఇంటి నుంచి పారిపోయి జోహాన్నెస్‌బర్గ్ చేరుకున్నారు. అక్కడ నైట్ వాచ్‌మన్‌గా, లా ఫర్మ్‌లో గుమస్తాగా రకరకాల పనులు చేస్తూ, కరస్పాండెన్స్ కోర్సు ద్వారా డిగ్రీ పూర్తి చేశారు. ఆ తర్వాత విట్‌వాటర్స్‌రాండ్ వర్సిటీలో చేరి లా చదువుకున్నారు. లా కోర్సు చదువుకుంటున్న కాలంలోనే మండేలా ఉద్యమబాట పట్టారు. తన సహాధ్యాయి ఆలివర్ టాంబోతో కలసి 1944లో ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్‌లో చేరి, పార్టీలో యువజన విభాగాన్ని ప్రారంభించారు. మండేలా నాయకత్వంలో పెద్దసంఖ్యలో యువకులు పార్టీ వైపు ఆకర్షితులయ్యారు.

ఆఫ్రికాలో జాతివివక్ష కొనసాగిస్తున్న నేషనల్ పార్టీ 1948 ఎన్నికల్లో గెలుపొందడంతో ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్ ఉద్యమాన్ని తీవ్రతరం చేసింది. దక్షిణాఫ్రికా ప్రజలందరికీ సంపూర్ణ పౌరసత్వం డిమాండ్‌తో అహింసామార్గంలో శాసనోల్లంఘన ఉద్యమాన్ని ప్రారంభించింది. దేశంలోని ప్రజలందరికీ సమాన హక్కులు కల్పించాలంటూ ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్ రూపొందించిన ‘ఫ్రీడమ్ చార్టర్’ను కాంగ్రెస్ ఆఫ్ పీపుల్ 1955లో ఆమోదించింది. ఈ పరిణామాలు మింగుడుపడని వలస ప్రభుత్వం అదే ఏడాది మండేలాతో పాటు 155 మందిని ‘దేశద్రోహం’ కింద అరెస్టు చేసింది. ఆరేళ్ల తర్వాత వారంతా 1961లో నిర్దోషులుగా విడుదలయ్యారు. అయితే, ఈలోగానే ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్ నేతల్లో పొరపొచ్చాలు తలెత్తాయి.

ఉద్యమంలో అహింసా పద్ధతులు నచ్చని వారంతా మిలిటెంట్ పద్ధతులపై మొగ్గుతూ పార్టీ నుంచి చీలిపోయి, 1959లో పాన్ ఆఫ్రికనిస్ట్ కాంగ్రెస్ పేరిట వేరు కుంపటి పెట్టుకున్నారు. ఆ మరుసటి ఏడాదే షార్ప్‌విల్‌లో శాంతియుతంగా నిరసన కొనసాగిస్తున్న ఆఫ్రికన్ ఉద్యమకారులపై పోలీసులు కాల్పులు జరిపారు. కాల్పుల్లో 69 మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఈ మారణహోమం తర్వాత దక్షిణాఫ్రికా అల్లర్లు, ఆందోళనలతో అట్టుడికింది. అరెస్టుల పరంపర మొదలు కావడంతో మండేలాతో పాటు ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్, పాన్ ఆఫ్రికనిస్ట్ కాంగ్రెస్ నేతల్లో చాలామంది అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఇక అహింసామార్గంలో కొనసాగడం వల్ల ఉపయోగం లేదని, పంథా మార్చుకోవాలని మండేలా అప్పుడే నిశ్చయించుకున్నారు.
 
సాయుధ పోరాటబాట
షార్ప్‌విల్ కాల్పుల దరిమిలా తలెత్తిన పరిణామాలతో సాయుధ పోరాటం వైపు మళ్లిన మండేలా, వలస ప్రభుత్వాన్ని గద్దె దించడమే లక్ష్యంగా ఉద్యమాన్ని ఉధృతం చేశారు. ఆఫ్రికన్ జాతీయవాదుల సమావేశంలో పాల్గొనేందుకు 1962 జనవరిలో రహస్యంగా దక్షిణాఫ్రికాను వీడి ఇథియోపియా వెళ్లారు. అక్కడి నుంచి లండన్ వెళ్లి, ప్రవాసంలో ఉన్న ఉద్యమ సహచరుడు ఆలివర్ టాంబోను కలుసుకున్నారు. అల్జీరియా వెళ్లి గెరిల్లా పోరాట శిక్షణ పొందారు.

అక్కడి నుంచి 1962 ఆగస్టులో స్వదేశానికి చేరుకుని, అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. అయితే, మండేలా తలదాచుకున్న స్థావరం ఆచూకీపై అమెరికన్ గూఢచర్య సంస్థ సీఐఏ దక్షిణాఫ్రికా వలస ప్రభుత్వానికి ఉప్పందించడంతో కొద్ది రోజుల్లోనే పోలీసులు ఆయనను అరెస్టు చేశారు.  కోర్టులో హాజరుపరిస్తే, కార్మికుల సమ్మెను రెచ్చగొట్టి, అక్రమంగా దేశాన్ని వీడి వెళ్లినందుకు ఐదేళ్ల జైలుశిక్ష పడింది.
 
ఖైదీ నంబర్ 46664
కొద్దినెలల్లోనే జోహాన్నెస్‌బర్గ్‌లోని ఉద్యమకారుల స్థావరంపై దాడులు జరిపిన పోలీసులకు సాయుధ పోరాటానికి సంబంధించిన ఆధారాలు లభించాయి. ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్‌పై నిషేధం విధించిన దక్షిణాఫ్రికా వలస ప్రభుత్వం మండేలా తదితర ఏడుగురు నేతలపై దేశద్రోహం, కుట్ర తదితర అభియోగాలు మోపింది. కోర్టు మండేలాతో పాటు ఏడుగురికీ 1964లో యావజ్జీవ శిక్ష విధించింది.

ఆ శిక్ష ఫలితంగా మండేలా 27 ఏళ్లు జైలులోనే మగ్గిపోయారు. శిక్షా కాలంలోని మొదటి పద్దెనిమిదేళ్లు రాబెన్ ఐలాండ్ జైలులోని చీకటి గదిలో ఒంటరిగా కాలం వెళ్లదీశారు. జైలులో మండేలాకు ఇచ్చిన నంబర్ 46664. అంటే, 1964 సంవత్సరంలో అక్కడకు చేరుకున్న 466వ ఖైదీ. అక్కడ ఉన్నంత కాలం ఆయన భార్య విన్నీని మాత్రమే ఆరునెలలకోసారి వచ్చి చూసేందుకు అనుమతించేవారు. నరకానికి నకలులాంటి ఆ జైలులో అన్ని సంవత్సరాలు ఉన్నా, మండేలా ఏనాడూ తన ఆత్మస్థైర్యాన్ని కోల్పోలేదు.

మండేలా విడుదల కోరుతూ ఒత్తిడి అంతకంతకూ పెరుగుతూ రావడంతో దక్షిణాఫ్రికా వలస ప్రభుత్వం కాస్త తగ్గక తప్పలేదు. మండేలాను రాబెన్ ఐలాండ్ జైలు నుంచి 1982లో ప్రధాన భూభాగంలో ఉన్న పోల్స్‌మూర్ జైలుకు తరలించారు. జైలులో భద్రత తక్కువగా ఉందనే సాకుతో 1988 నుంచి గృహ నిర్బంధంలో ఉంచారు. ఆ తర్వాతి సంవత్సరమే జరిగిన ఎన్నికల్లో ఉదారవాద నాయకుడు ఫ్రెడెరిక్ డబ్ల్యూ డీ క్లార్క్ దక్షిణాఫ్రికా అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. బాధ్యతలు స్వీకరించిన వెంటనే ఆయన ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్‌పై నిషేధాన్ని ఎత్తివేశారు. పార్టీలోని సంప్రదాయవాదులు వ్యతిరేకించినా లెక్క చేయకుండా 1990 ఫిబ్రవరి 11న మండేలా విడుదలకు ఆదేశాలు జారీ చేశారు.
 
నల్లసూర్యుడి ఉదయం
విడుదలైన తర్వాత మండేలా ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్ నాయకత్వ బాధ్యతలను స్వీకరించారు. జాతి వివక్షను అంతం చేసి, అన్ని జాతులతో కూడిన ప్రభుత్వం ఏర్పాటు చేయాలనే డిమాండ్‌తో డీ క్లార్క్ నేతృత్వంలోని నేషనలిస్ట్ పార్టీ ప్రభుత్వంతో చర్చలు జరిపారు. ఇదివరకటి ప్రభుత్వాల్లా అణచివేత చర్యలకు దిగకుండా, డీ క్లార్క్ సానుకూలంగా స్పందించారు. జాతి వివక్ష సమస్య సామరస్యంగా పరిష్కారం కావడంతో 1993 డిసెంబర్‌లో మండేలా, డీ క్లార్క్ ఇద్దరూ నోబెల్ శాంతి బహుమతిని అందుకున్నారు. తర్వాత 1994 ఏప్రిల్‌లో జరిగిన ఎన్నికల్లో ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్ మండేలా నేతృత్వంలో పోటీ చేసి, ఘన విజయం సాధించింది.
 
అదే ఏడాది మే 10న మండేలా దక్షిణాఫ్రికా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. దక్షిణాఫ్రికా అధ్యక్షుడిగా ఎన్నికైన తొలి నల్లజాతీయుడిగా అరుదైన రికార్డు సొంతం చేసుకున్నారు. బాధ్యతలు స్వీకరించిన రెండేళ్లలోనే జాతివివక్షకు తావులేని కొత్త రాజ్యాంగాన్ని అమలులోకి తెచ్చారు. ఐదేళ్లు అధ్యక్షుడిగా కొనసాగి, పదవి నుంచి తప్పుకున్న తర్వాత పలు స్వచ్ఛంద సంస్థలు స్థాపించి, సేవా కార్యక్రమాలను కొనసాగించారు. దక్షిణాఫ్రికాలో ప్రజాస్వామ్యం కోసం అలుపెరగని కృషి సాగించిన మండేలా వార్ధక్యంతో అనారోగ్యం బారినపడి, 2013 డిసెంబర్ 5న తుదిశ్వాస విడిచారు. అయితే, మండేలా జీవించి ఉండగానే, ఆయన గౌరవార్థం ఐక్యరాజ్య సమితి 2009లో ఆయన పుట్టినరోజు జూలై 18వ తేదీని ‘అంతర్జాతీయ మండేలా దినోత్సవం’గా ప్రకటించింది. ఇది మండేలాకు మాత్రమే దక్కిన అత్యంత అరుదైన గౌరవం.
 
స్ఫూర్తినిచ్చిన కవిత
జైలులో మగ్గిపోయిన కాలంలో మండేలా నిరాశను దరిచేరనివ్వకుండా ఉండటానికి విలియమ్ ఎర్నెస్ట్ హేన్లీ రాసిన ‘ఇన్‌విక్టస్’ కవితను పదేపదే వల్లె వేసేవారు. తోటి ఖైదీలకు తరచు ఈ కవితను వినిపించేవారు. ‘ఐయామ్ ది మాస్టర్ ఆఫ్ మై ఫేట్... ఐయామ్ ది కెప్టెన్ ఆఫ్ మై సోల్’ అంటూ ఈ కవితను నిరంతరం మననం చేసుకుంటూ స్ఫూర్తి పొందేవారు.
 
సంసారంలో మండేలా
మండేలా మూడు పెళ్లిళ్లు చేసుకున్నారు. నర్సుగా పనిచేసే ఎవెలిన్ మేస్‌ను 1944లో పెళ్లాడారు. మండేలా ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్ కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొంటూ ఉండటంతో ఇద్దరికీ విభేదాలు తలెత్తాయి. మత నియమాల ప్రకారం రాజకీయంగా తటస్థంగా ఉండాలన్న ఎవెలిన్ మాటలను పట్టించుకోకుండా, మండేలా ఉద్యమాల్లో కొనసాగారు. దీంతో 1958లో ఇద్దరూ విడిపోయారు. తర్వాత మండేలా విన్నీని పెళ్లాడారు.

విన్నీనే ఎక్కువకాలం మండేలాకు బాసటగా ఉన్నారు. మండేలా అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత దక్షిణాఫ్రికా ప్రథమ మహిళ హోదాలో కూడా కొనసాగారు. అయితే, జీవిత చరమాంకంలో ఇద్దరికీ మధ్య తలెత్తిన విభేదాలు పరిష్కారం కాకపోవడంతో 1996లో విడాకులు తీసుకున్నారు. విన్నీ నుంచి విడిపోయిన తర్వాత మండేలా మానసికంగా ఒంటరైపోయారు. తర్వాత రెండేళ్లకు 1998లో మొజాంబిక్ అధ్యక్షుడి మాజీ భార్య గ్రాసా మాషెల్‌ను పెళ్లాడారు. పెద్ద కొడుకు మగతో ఎయిడ్స్ వ్యాధితో బాధపడుతూ 2005లో మరణించడం మండేలాను బాగా కుంగదీసింది.
 
చదువుకునే రోజుల్లో బాక్సింగ్‌పై విపరీతమైన ఆసక్తి చూపేవారు. చిన్నప్పటి బాక్సింగ్ సాధనే కాబోలు, తర్వాతి కాలంలో అన్యాయాలపై పిడికిలెత్తేలా చేసింది.
 
వెండితెరపై మండేలా
జైలు నుంచి విడుదలైన తర్వాత మండేలా వెండితెరపై కూడా మెరిశారు. అమెరికాలో ఆఫ్రికన్ సంతతికి చెందిన హక్కుల ఉద్యమకారుడు మాల్కమ్ ఎక్స్ జీవితం ఆధారంగా అదేపేరుతో స్పైక్ లీ 1992లో రూపొందించిన చిత్రంలో మండేలా ఒక టీచర్ పాత్రలో కనిపిస్తారు. సినిమా చివర్లో కొద్దిసేపే కనిపించే ఈ పాత్రలో మండేలా తరగతి గదిలో విద్యార్థులను ఉద్దేశించి మాల్కమ్ ఎక్స్ ప్రసంగాన్ని ఉటంకిస్తారు.
 
అరుదైన గౌరవాలు
మండేలాకు లభించిన బిరుదులు, పురస్కా రాల సంగతి సరేసరి! అంతకు మించిన అరుదైన గౌరవాలు కూడా ఆయనకు దక్కాయి. కేప్‌టౌన్ నుంచి కాలిఫోర్నియా వరకు చాలా దేశాల్లోని చాలా నగరాల్లో మండేలా పేరిట నామకరణం చేసిన వీధులు కనిపిస్తాయి. మండేలా జైలులో ఉండగానే, 1973లో లీడ్స్ వర్సిటీ భౌతిక శాస్త్రవేత్తలు కనుగొన్న న్యూక్లియర్ పార్టికల్‌కు ‘మండేలా పార్టికల్’ అనే పేరు పెట్టారు. మండేలా మరణానికి ఏడాది ముందు పురాతత్వ శాస్త్రవేత్తలు చరిత్ర పూర్వయుగం నాటి వడ్రంగి పిట్ట జాతి పక్షి శిలాజాలను కనుగొన్నారు. ఆ పక్షికి ఆయన గౌరవార్థం ‘ఆస్ట్రాలోపికస్ నెల్సన్ మండేలాయ్’ అనే పేరు పెట్టారు.
 
ప్రపంచంలో మండేలా
తృతీయ ప్రపంచ దేశాలకు మండేలా ఒక ఆరాధ్యదైవం. భారత్ వంటి అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఆయన విశ్వసనీయమైన మిత్రుడు. అగ్రరాజ్యాల దురహంకారాన్ని ధిక్కరించి మరీ తమ తమ దేశాలను ప్రగతిమార్గం పట్టించిన ఫిడెల్ క్యాస్ట్రో (క్యూబా), గడాఫీ (లిబియా) వంటి దేశాధినేతలకు ఆయన అనుంగు చెలికాడు. మొదట్లో మండేలాపై నిస్సిగ్గుగా వివక్ష ప్రదర్శించిన పాశ్చాత్యదేశాలు ఆయన దక్షిణాఫ్రికా అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టిన తర్వాత ద్వంద్వప్రవృత్తిని ప్రదర్శించాయి.

మండేలా అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన సందర్భంలో ‘మన కాలంలో స్వేచ్ఛా సమానత్వాల కోసం పాటుపడిన గొప్ప శక్తుల్లో మండేలా ఒకరు’ అంటూ అప్పటి అమెరికా అధ్యక్షుడు జార్జి బుష్ గొప్ప సానుకూల వ్యాఖ్యలు చేశారు. అయితే, మండేలా పట్ల అమెరికా తన ధోరణిని మార్చుకుందనుకుంటే పొరపాటే. మండేలాను, ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్‌ను అమెరికా 2008 వరకు ‘టై వాచ్‌లిస్ట్’లో ఉంచింది. అంటే, మండేలాకు నోబెల్ బహుమతి దక్కిన ఐదేళ్లకుగాని అమెరికా ఆయన పట్ల తన వైఖరిని మార్చుకోలేదు.
 
ఆత్మకథకు సీక్వెల్!
మండేలా జైలు నుంచి విడుదలయ్యాక తన జీవితానుభవాలన్నింటినీ గుదిగుచ్చి రాసిన ఆత్మకథ ‘లాంగ్ వాక్ టు ఫ్రీడమ్’ 1994లో విడుదలై, ప్రపంచవ్యాప్తంగా పాఠకాదరణ పొందింది. ఆఫ్రికన్ భాషలు సహా ప్రపంచంలోని పలు భాషల్లోకి ఇది అనువాదం పొందింది. అధ్యక్ష బాధ్యతల్లో కొనసాగిన కాలంలోను, ఆ తర్వాతి కాలంలోను తన అనుభవాలను కూడా మండేలా వివరంగా రాసుకున్నారు. అవి ఇంతవరకు ప్రచురణకు నోచుకోలేదు. ఆత్మకథ విడుదల తర్వాత మండేలా రాసుకున్న ఈ రాతల ఆధారంగా ‘లాంగ్ వాక్ టు ఫ్రీడమ్’ సీక్వెల్‌ను ప్రచురించేందుకు అంతర్జాతీయ ప్రచురణ సంస్థ ‘పాన్ మ్యాక్‌మిలన్’ గత ఏడాది సన్నాహాలు ప్రారంభించింది. త్వరలోనే దీనిని విడుదల చేయనున్నట్లు ప్రకటించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement