సిలువ యాగం
యేసుప్రభువు మరణించిన ‘గుడ్ ఫ్రైడే’ని లోకం చివరి అధ్యాయం అనుకుంది. కాని రెండు రోజులకేఆదివారం నాటి ‘ఈస్టర్ పునరుత్థానం’తో మానవ చరిత్రలో ఒక నవ కృపాశకంఆరంభమయింది.
అత్యంత ఆహ్లాదకరమైన, శాంతిభరితమైన వాతావరణానికి ‘క్షమాపణ’ మన జీవితంలో ద్వారం తెరుస్తుంది. యేసుప్రభువు ప్రబోధాల నిండా ఆయన ప్రేమ, క్షమాపణే నిండి ఉన్నా, సిలువ వేయబడేందుకు ముందు రాత్రి జరిగిన పస్కా విందులోనే ప్రభువు క్షమాపణా ఉద్యమం ఆచరణలో ఆరంభమైంది. ఆయన తన ద్రాక్షారసం గిన్నెలో రొట్టె ముక్కలు ముంచి తనకు ద్రోహం చేసిన ఇస్కరియోతు యూదాతో సహా శిష్యులందరికీ ఇచ్చాడు. ఇది యూదుల సామాజిక ఆచారం. ఒక వ్యక్తిని క్షమించినపుడు ఆ వ్యక్తి, అవతలి వ్యక్తిని తాను క్షమించానని తెలియ జేస్తూ ద్రాక్షారసంలో ముంచిన రొట్టెముక్కను అందరి సమక్షంలో అతనికిస్తాడు. ఆ క్షణం నుండి వారి మధ్య వైరానికి తెర పడుతుంది. మేడగదిలో జరిగిన పస్కా విందులో అదే జరిగింది అదే.
లోకానికంతటికీ క్షమాపణను ప్రసాదించిన సిలువ యాగానికి ముందు యేసుప్రభువు ఆ ఉద్యమాన్ని తన శిష్యులతో ఆరంభించాడు. ఎందుకంటే కొద్దిగంటల్లోనే వాళ్లంతా తనను వదిలేసి పిరికిపందల్లాగా పారిపోనున్నారు. ఇక ఇస్కరియోతు యూదా అనే శిష్యుడైతే ముప్పై వెండినాణేలకు అమ్మేసి ప్రభువుకు ద్రోహం చేసేందుకు అప్పటికే యూదు మతాధికారులతో ఒప్పందం చేసుకున్నాడు. ఎంతైనా ఇస్కరియోతు యూదా యెరికోలోని ఒక వ్యాపారస్థుని కొడుకు కదా, తన వ్యాపార లక్షణం పోనిచ్చుకోలేదు. వస్తువులమ్ముకొని లాభం గడించినట్టే యేసుప్రభువును కూడా అమ్మేస్తే తప్పేమిటి? అన్నది అతని
‘లాజిక్’!!
యూదా కుట్రమేరకు అర్ధరాత్రిపూట గెత్సేమేనే తోటలో యేసుప్రభువును నిర్బంధించిన రోమా సైనికులు ఆయన్ను మొదట ప్రధాన యాజకుడైన కయప ఇంటికి, ఆ తర్వాత తెల్లవారిన తర్వాత తీర్పు కోసం పిలాతు మందిరానికి తీసుకెళ్తున్నప్పుడు ఒకరిద్దరు మినహా శిష్యులంతా పారిపోయారు. అయితే యేసుప్రభువు మాత్రం ఒంటరివాడు కాలేదు. అంతటి శ్రమల్లోనూ ఆయన తన పరలోకపు తండ్రితో నిరంతర సహవాసంలోనే ఉన్నాడు. అందుకే తనను హింసిస్తున్న వారినందరినీ క్షమించమంటూ సిలువలో వేలాడుతూ కూడా పరలోకపు తండ్రికి ప్రార్థన చేశాడు. తనతోపాటు సిలువ వేసిన గజదొంగల్లో ఒకతను తనను క్షమించమని కోరగా అతనికి పరలోక భాగ్యాన్ని కూడా ప్రభువు ప్రసాదించాడు. యేసుప్రభువును అమ్ముకొని కూడా డబ్బు సంపాదించాలనుకున్న యూదా ఇస్కరియోతు మాత్రం ఆ రోజే ఉరివేసుకొని చనిపోయి నరకానికెళ్లాడు అందువల్ల ఆనాటి గుడ్ ఫ్రైడే ఇస్కరియోతుకు ఒక ‘బ్యాడ్ ఫ్రైడే’..
కాని చివరి నిముషంలో మారుమనస్సు పొంది ప్రభువును ఆశ్రయించి ఆయన కృపతో పరలోకానికెళ్లిన ఆ గజదొంగకు మాత్రం అది నిజంగా గుడ్ ఫ్రైడే, ప్రభువు శిష్యుడు, గొప్ప మేధావి అయి ఉండి కూడా యూదా నరకానికెళ్లడమే నాటి గుడ్ ఫ్రైడే లో నిజమైన ట్రాజెడీ,ఆనాటి యూదు మతాధికారులు, రోమా పాలకులు కసికొద్దీ యేసుప్రభువును శారీరకంగా, మానసికంగా హింసించినా, అంతటి శ్రమలో కూడా శరీరం, మనసు ఆయన ఆధీనంలోనే ఉన్నాయి. ఆయన్ను చంపానని లోకం విర్రవీగింది. కానీ వాస్తవానికి ఆయనే తన ఆత్మను తండ్రికి అప్పగించడం ద్వారా స్వచ్ఛందంగా ప్రాణత్యాగం చేశాడు, యేసుప్రభువు జీవితానికి లోకం ‘గుడ్ ఫ్రైడే’ చివరి అధ్యాయం అనుకుంది.. కాని రెండు రోజులకే ఆదివారం నాటి ‘ఈస్టర్ పునరుత్థానం’ తో ఒక మానవ చరిత్రలో ఒక సరికొత్త అధ్యాయం, నవ కృపాశకం ఆరంభమయింది. ఒక చెంపను కొట్టిన వ్యక్తి దవడ పళ్ళన్నీ రాలగొట్టాలనే ఈ లోకపు ప్రతీకార సిద్ధాంతం ఎంత బలహీనమైనదో సాత్వికత్వం, సరళత్వం, శాంతిపథం ఎంతటి శక్తివంతమైన ఆయుధాలో యేసుప్రభువు తన బోధలు, జీవితం, సిలువత్యాగం, పునరుత్థానం ద్వారా రుజువు చేశాడు.
నెల్సన్ మండేలా దక్షిణాఫ్రికా అధ్యక్షుడైన తర్వాత తన సిబ్బందితో కలిసి ఒక రెస్టారెంట్ కు వెళ్ళాడు. అక్కడ ఒక మూలన కూర్చున్న ఒక అనామక వ్యక్తిని తీసుకొచ్చి తనతోపాటు కూర్చోబెట్టమని సిబ్బందికి చెప్పాడాయన. ఆ వ్యక్తి ఎంతో భయం తో వచ్చి నెల్సన్ మండేలా కూర్చున్న టేబుల్ వద్దే కూర్చున్నాడు. తెప్పించిన ఆహారపదార్థాలన్నీ భయంతో వణికిపోతూనే మౌనంగా తిన్నాడు. ఆ తర్వాత అలా భయపడుతూనే వెళ్ళిపోయాడు.
దేశాధ్యక్షుడితో కలిసి కూర్చుంటే భయపడక తప్పదు కదా అనుకున్నారంతా. కాని తాను సుదీర్ఘకాలం పాటు జైలులో ఉన్నపుడు తనను అత్యంత క్రూరంగా హింసించిన జైలు గార్డు అతనని, తనను యథేచ్ఛగా హింసించిన తర్వాత కూడా కసి తీరక కొన్నిసార్లు అతను తన మొహం మీద మూత్రం కూడా పోసేవాడని మండేలా తన సిబ్బందికి తెలియజేశాడు. తాను తనను గుర్తించానని అతనికి తెలిసింది కాబట్టి ప్రతీకారం తీర్చుకుంటానని అతను భయపడుతున్నాడని, అయితే అతనెక్కడుంటాడో, అతని కష్టాలేంటో తెలుసుకొని అతనికి తగిన సాయం చెయ్యమని, అదే తన ప్రతీకార విధానమని మండేలా ఆదేశించాడు.
– రెవ.డా.టి.ఎ.ప్రభుకిరణ్
Comments
Please login to add a commentAdd a comment