మండేలా కోలుకుంటున్నారు: విన్నీ మండేలా
దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు, నల్ల సూరీడు నెల్సన్ మండేలా కోలుకున్నారు. దాదాపు రెండు నెలల పాటు ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్తో బాధపడుతూ చికిత్స పొందిన ఆయన ఇప్పుడు మామూలుగా ఊపిరి తీసుకోగలుగుతున్నారని ఆయన మాజీ భార్య విన్నీ మాడికిజెలా మండేలా తెలిపారు. ఆయన ఆరోగ్యం పూర్తిగా క్షీణించిందని, దాదాపు అంత్యదశలో ఉన్నారంటూ వచ్చిన వార్తలను ఆమె ఖండించారు. వాస్తవాలను దాచాల్సిన అవసరం తమకు లేదన్నారు. పిల్లలు ఆయన్ను చూడటానికి వెళ్లినప్పుడు ఆయన కళ్లలో మెరుపు కనిపించిందని బ్రిటిష్ స్కై న్యూస్ చానల్ వర్గాలకు ఆమె చెప్పారు. ప్రస్తుతానికి ఆయనింకా మాట్లాడటం లేదని, సైగల ద్వారానే అన్నీ చెబుతున్నారని అన్నారు.
ప్రిటోరియా ఆస్పత్రి వైద్యులు అద్భుతంగా చికిత్సలు అందించారని, వారి సేవల వల్లే ఆయన కోలుకున్నారని అన్నారు. మండేలా ఆరోగ్యం గురించి ఒక వర్గం మీడియాలో వచ్చిన వార్తలు మాత్రం తమ కుటుంబ సభ్యులను తీవ్రంగా బాధించాయని విన్నీ తెలిపారు. ఇది చాలా క్రూరమైన విషయమని, మండేలా అంత్యక్రియలకు కూడా కొంతమంది ఏర్పాట్లు చేసేశారని.. తమ మనోభావాలను కనీసం అర్థం చేసుకునే ప్రయత్నం కూడా చేయరా అని ఆమె ఆక్రోశించారు.