వీరుడు, సూరీడు..!
(నేడు నెల్సన్ మండేలా జయంతి)
‘‘ప్రత్యర్థిని అగౌరవపరచకుండానే నేనతడిని ఓడించగలనని అర్థమైంది’’ అని తన ఆటోబయోగ్రఫీ ‘లాంగ్ వాక్ టు ఫ్రీడమ్’ లో ఒకచోట రాసుకున్నారు నెల్సన్ మండేలా. విధానాలకు వ్యక్తులు ఎలాగైతే బాధ్యులు కారో, జాతి విచక్షణకు తెల్లజాతి అధికారులు అలా బాధ్యులు కారని ఆయన విశ్వాసం. మండేలా ఏనాడూ తెల్ల అధికారులతో నేరుగా తలపడలేదు. జాతి వివక్ష వ్యవస్థతోనే ఆయన పోరాటం.
నల్లవాళ్లందరూ తక్షణం జోహాన్నెస్‌బర్గ్‌ను వదిలి తమ సొంత ఊళ్లకు వెళ్లిపోవాలని హుకూం జారీ అయినప్పుడు ఒక వ్యక్తి మండేలా దగ్గరికి వచ్చాడు. ‘‘మమ్మల్ని కాపాడండి. నేను, నా భార్యాపిల్లలు ఏళ్లుగా ఇక్కడ ఉంటున్నాం. నా పిల్లలు ఇక్కడే చదువుకుంటున్నారు. కానీ ఇప్పుడు మమ్మల్ని వెళ్లిపొమ్మంటున్నారు. నా ఉద్యోగం తీసేశారు. చావడం తప్ప వేరే దారిలేదు. ఏదో ఒకటి చెయ్యండి.
నా కుటుంబం కూలిపోకుండా చేతులు అడ్డుపెట్టండి’’ అని మండేలాను వేడుకున్నాడు. వెంటనే అధికారి దగ్గరికి వెళ్లాడు మండేలా. ‘‘చూడండి, కార్యకర్తగా కాదు... ఒక మనిషిగా నేను మీ దగ్గరకు వచ్చాను. నేను మీ ముందుకు తేబోతున్న సమస్య తాలూకు పరిష్కారానికి పూర్తిగా మీ మీదే ఆధారపడి వచ్చాను’’ అన్నాడు. మండేలా మాటతీరులో తనపై కనిపించిన గౌరవభావం ఆ అధికారిని కదిలించింది. ‘‘ఏదైనా ఉద్యోగం చూసుకుని ఇక్కడే ఉండిపొమ్మని చెప్పండి’’ అని నిరభ్యంతర పత్రం రాసిచ్చాడు!
లోకంలో ఎక్కడైనా మనుషులు మాత్రమే ఉంటారు. చెడ్డ మనుషులు ఉండరు. వ్యవస్థలు, విధానాలు మనుషుల్ని చెడ్డవాళ్లుగా, శత్రువులుగా చిత్రీకరిస్తాయి. జాతి వివక్ష అమాయక ప్రజల్ని బలి తీసుకుంటుందనీ, వివక్షను పాటించేవారు కూడా తమ సొంత మనుషులను కోల్పోవలసి వస్తుందని తెల్ల అధికారులకు అర్థమయ్యేలా చెప్పగలిగారు మండేలా.
మండేలాను విడుదల చెయ్యాలని దక్షిణాఫ్రికా ప్రభుత్వంపై ప్రపంచవ్యాప్తంగా ఒత్తిడి పెరుగుతున్నప్పుడు ఆ దేశ అధ్యక్షుడు పి.డబ్ల్యూ.బోతా ఆయనకొక రాయబారం పంపారు. దేశం వదిలి వెళ్తానంటే వెంటనే విడుదల చేస్తామన్నది సారాంశం! మండేలా అంగీకరించలేదు. ‘‘పోనీ, మీ మనుషుల్ని హింస మానేయమని చెప్పండి. మిమ్మల్ని వదిలిపెడతాం’’ అని రెండో రాయబారం పంపాడు. మండేలా విన్లేదు. నల్లజాతి ప్రజలను ఉద్దేశించి జైలునుంచే ఒక లేఖను రాసి బయటికి విడుదల చేశాడు.
‘‘జీవితాన్ని మీరెంతగా ప్రేమించారో నేనూ అంతే ప్రేమించాను. స్వేచ్ఛగా జీవించాలన్న మీ హక్కు, నా హక్కు వేర్వేరు కాదు. మన హక్కుల్ని విక్రయించేందుకు తెల్లజాతి ప్రభుత్వానికి నేనెలాంటి వాగ్దానం చెయ్యలేను’’ అని తన జాతికి నమ్మకాన్ని, ధీమాను ఇచ్చారు.
దక్షిణాఫ్రికాకు రెండు జీవిత చరిత్రలు. ఒకటి ఆ దేశానిది. రెండు మండేలాది. కానీ ఈ మాటను ఆ దేశ ప్రజలు అంగీకరించరు. మండేలా లేకపోతే దక్షిణాఫ్రికా లేదంటారు. మండేలా జీవిత చరిత్రే దక్షిణాఫ్రికా జీవిత చరిత్ర అంటారు. మావో, లెనిన్, గాంధీలా మండేలా తన జాతి ప్రజలకు విముక్తి ప్రదాత. ప్రపంచ దేశాల ప్రియతమ నేత. ఎంవెజూలో జన్మించాడు. సామ్రాజ్యవాదులు వచ్చి తిష్ట వేయకముందు ఆఫ్రికాలో ఎంత స్వేచ్ఛ ఉండేదో రాత్రి వేళల్లో కథలు కథలుగా విన్నాడు.
నల్లజాతి పోరాట వీరుల త్యాగాలతో స్ఫూర్తి పొందాడు. నల్లవారి హక్కుల కోసం ఆవిర్భవించిన ‘ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్’లో చేరాడు. క్రియాశీలక కార్యకర్తగా పని చేశాడు. తెల్లవారి ఆగ్రహానికి గురయ్యాడు. ఇరవై ఏడేళ్ల పాటు దుర్భరమైన జైలు జీవితం గడిపాడు. విడుదలయ్యాక - దక్షిణాఫ్రికాలో ప్రజాస్వామ్య వ్యవస్థ ఏర్పాటుకు కృషి చేశారు. దక్షిణాఫ్రికాలో ఎన్నికైన తొలి అధ్యక్షుడు. స్వేచ్ఛ... అతడు సాధించి పెట్టిన తేనెపట్టు. ఆత్మగౌరవం... నల్లజాతికి అతడు రాసిపెట్టిన రాజ్యాంగం.