
‘‘ప్రత్యర్థిని అగౌరవపరచకుండానే నేనతడిని ఓడించగలనని అర్థమైంది’’ అని తన ఆటోబయోగ్రఫీ ‘లాంగ్ వాక్ టు ఫ్రీడమ్’ లో ఒకచోట రాసుకున్నారు నెల్సన్ మండేలా. విధానాలకు వ్యక్తులు ఎలాగైతే బాధ్యులు కారో, జాతి వివక్షకు తెల్లజాతి అధికారులు అలా బాధ్యులు కారని ఆయన విశ్వాసం. మండేలా ఏనాడూ నేరుగా తెల్ల అధికారులతో తలపడలేదు. జాతి విచక్షణ వ్యవస్థతోనే ఆయన పోరాటం. నల్లవాళ్లందరూ తక్షణం జోహన్నెస్‌బర్గ్‌ను వదిలి తమ సొంత ఊళ్లకు వెళ్లిపోవాలని హుకుం జారీ అయినప్పుడు ఒక వ్యక్తి మండేలా దగ్గరికి వచ్చాడు. ‘‘మమ్మల్ని కాపాడండి. నేను, నా భార్యాపిల్లలు ఏళ్లుగా ఇక్కడ ఉంటున్నాం. నా పిల్లలు ఇక్కడే చదువుకుంటున్నారు. కానీ ఇప్పుడు మమ్మల్ని వెళ్లిపొమ్మంటున్నారు. నా ఉద్యోగం తీసేశారు. చావడం తప్ప వేరే దారిలేదు. ఏదో ఒకటి చెయ్యండి. నా కుటుంబం కూలిపోకుండా చేతులు అడ్డుపెట్టండి’’ అని మండేలాను వేడుకున్నాడు. వెంటనే అధికారి దగ్గరికి వెళ్లాడు మండేలా. ‘‘చూడండి, కార్యకర్తగా కాదు... ఒక మనిషిగా నేను మీ దగ్గరకు వచ్చాను. నేను మీ ముందుకు తేబోతున్న సమస్య పరిష్కారానికి పూర్తిగా మీ మీదే ఆధారపడి వచ్చాను’’ అన్నాడు. మండేలా మాటతీరులో తనపై కనిపించిన గౌరవభావం ఆ తెల్ల అధికారిని కదిలించింది. ‘‘ఏదైనా ఉద్యోగం చూసుకుని ఇక్కడే ఉండిపొమ్మని చెప్పండి’’ అని నిరభ్యంతర పత్రం రాసిచ్చాడు!
లోకంలో ఎక్కడైనా మనుషులు మాత్రమే ఉంటారు. చెడ్డ మనుషులు ఉండరు. వ్యవస్థలు, విధానాలు మనుషుల్ని చెడ్డవాళ్లుగా, శత్రువులుగా చిత్రీకరిస్తాయి. జాతి వివక్ష అమాయక ప్రజల్ని బలి తీసుకుంటుందనీ, వివక్షను పాటించేవారు కూడా తమ సొంత మనుషులను కోల్పోవలసి వస్తుందని తెల్ల అధికారులకు అర్థమయ్యేలా చెప్పగలిగారు మండేలా. ఇంత గొప్ప వ్యక్తిని ఏ దేశం మాత్రం గౌరవించదు? మండేలాకు నోబెల్ శాంతి బహుమతి వచ్చింది. మన ‘భారత రత్న’నూ ఇచ్చుకున్నాం. మండేలా 2013 డిసెంబర్ 5న కన్నుమూశారు.
Comments
Please login to add a commentAdd a comment