స్వీయకథలో ప్రణబ్, చిదంబరంపై దువ్వూరి వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: ప్రణబ్ ముఖర్జీ, పి. చిదంబరం ఆర్థిక మంత్రులుగా పని చేసిన సమయంలో సానుకూల సెంటిమెంటు కోసం వడ్డీ రేట్లను తగ్గించాలని, వృద్ధి రేటును పెంచి చూపాలని తమపై తీవ్ర స్థాయిలో ఒత్తిళ్లు ఉండేవని ఆర్‌బీఐ మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు వెల్లడించారు. రిజర్వ్ బ్యాంక్ స్వయం ప్రతిపత్తికి ప్రాధాన్యతనివ్వాల్సిన అవసరం గురించి ప్రభుత్వంలో కొంతైనా అవగాహన ఉండదని ఆయన వ్యాఖ్యానించారు.
ఇటీవల ‘జస్ట్ ఎ మెర్సినరీ? నోట్స్ ఫ్రమ్ మై లైఫ్ అండ్ కెరియర్’ పేరిట రాసిన స్వీయకథలో దువ్వూరి ఈ విషయాలు పేర్కొన్నారు. వడ్డీ రేట్ల విషయంలోనే కాకుండా ఇతరత్రా అంశాల్లోనూ ప్రభుత్వం నుంచి ఆర్‌బీఐపై ఒత్తిడి ఉండేదని ఒక అధ్యాయంలో ఆయన ప్రస్తావించారు. ‘ప్రణబ్ ముఖర్జీ ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు జరిగిన విషయమిది. ఆర్థిక కార్యదర్శి అరవింద్ మాయారాం, ప్రధాన ఆర్థిక సలహాదారు కౌశిక్ బసు మా అంచనాలను సవాలు చేశారు.
సానుకూల సెంటిమెంటును పెంపొందించాల్సిన భారాన్ని ప్రభుత్వంతో పాటు ఆర్‌బీఐ కూడా పంచుకోవాల్సిన అవసరం ఉందన్న వాదనలు వచ్చాయి. ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వాలకు సెంట్రల్ బ్యాంకులు సహకరిస్తుంటే మన దగ్గర మాత్రం ఆర్‌బీఐ తిరుగుబాటు ధోరణిలో ఉంటోందంటూ మాయారాం వ్యాఖ్యానించారు. అయినప్పటికీ ప్రభుత్వానికి ఆర్‌బీఐ చీర్‌లీడరుగా ఉండాలన్న డిమాండ్‌కి నేను తలొగ్గలేదు’ అని దువ్వూరి పేర్కొన్నారు.
చిదంబరం విషయానికొస్తే .. వడ్డీ రేట్లు తగ్గించాలంటూ ఆర్‌బీఐపై తీవ్ర ఒత్తిడి తెచి్చనట్లు దువ్వూరి చెప్పారు. పరిస్థితులను సమీక్షించిన మీదట తాను అంగీకరించలేదన్నారు. దీంతో కలవరానికి గురైన చిదంబరం అసాధారణ రీతిలో ఆర్‌బీఐపై అసంతృప్తిని బాహాటంగానే వెళ్లగక్కారని వివరించారు. ఏపీలోని పార్వతీపురంలో సబ్–కలెక్టరుగా కెరియర్‌ను ప్రారంభించిన దువ్వూరి కేంద్ర ఆర్థిక కార్యదర్శిగా, అటు పైన అంతర్జాతీయ మాంద్యం పరిస్థితుల్లో ఆర్‌బీఐ గవర్నర్‌గా కూడా పని చేసిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment