విద్యాసాగర్‌రావు ఆత్మకథ ‘ఉనిక’ ఆవిష్కరణ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్
ఎన్నికల సమయంలో మాత్రమే పార్టీలు వేర్వేరుగా పోరాడాలి
ఎన్నికల తర్వాత అన్ని వర్గాలు కలిసి అభివృద్ధి పథంలో సాగాలి
అభివృద్ధి కంటే రాజకీయాలు ముఖ్యం కాదు
ప్రజా ప్రభుత్వం ఎలాంటి భేషజాలకు పోదన్న సీఎం
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వమంటే అధికార పక్ష సభ్యులే కాదని, అన్ని పార్టీల సభ్యులు కలిస్తేనే ప్రభుత్వం అని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. రాష్ట్రంలోని 119 మంది శాసనసభ్యులు కలిస్తేనే ప్రభుత్వమని, కేవలం 65 మంది అధికార పార్టీ ఎమ్మెల్యేలను మాత్రమే ప్రభుత్వంగా భావించడం పొరపాటని పేర్కొన్నారు. ఎన్నికల సమ యంలో మాత్రమే వేర్వేరుగా పోరాడాలని, ఎన్నికల తర్వాత అన్ని వర్గాలు కలిసి అభివృద్ధి వైపు ప్రయాణం సాగించాల్సి ఉంటుందని అన్నారు.
తమిళనాడు, మహారాష్ట్రల మాజీ గవ ర్నర్ చెన్నమనేని విద్యాసాగర్‌రావు ఆత్మకథ ‘ఉనిక’ పుస్తకా న్ని ఆదివారం తాజ్ కృష్ణ హోటల్‌లో హరియణా, ఒడిశా గవర్నర్లు బండారు దత్తాత్రేయ, కంభంపాటి హరిబాబు, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్, రాష్ట్ర మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్, రాజ్యసభ సభ్యుడు కె.లక్ష్మణ్ తదితరులతో కలిసి సీఎం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.
అప్పట్లో చర్చలతో సమస్యలు పరిష్కారమయ్యేవి
‘పాలకపక్షం, ప్రతిపక్షం కలిస్తేనే ప్రభుత్వం. అసెంబ్లీలో ముఖ్యమంత్రికి ఎంత సమయం మైక్ ఇస్తారో.. ప్రధాన ప్రతిపక్ష నేతకు కూడా అంతే సమయం మైక్ ఇస్తారు. ఉమ్మడి ఏపీలో బీజేపీ ప్రాతినిధ్యం చాలా తక్కువే అయినప్పటికీ ఆ పార్టీ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో చాలా విషయాలు లేవనెత్తేవారు. కమ్యూనిస్టులు కూడా ప్రజా సమస్యలపై అసెంబ్లీలో మాట్లాడేవారు. అసెంబ్లీ వాయిదా పడితే పాలక పక్షం, ప్రతిపక్షం చర్చల ద్వారా సమస్యలు పరిష్కరించుకునే పరిస్థితులు ఉండేవి. అలాంటి వాతావరణం నెలకొల్పేందుకు ప్రజా ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. 13 నెలల ప్రజాపాలనలో ఒక్క ప్రతిపక్ష సభ్యుడిని కూడా సస్పెండ్ చేయలేదు..’ అని సీఎం చెప్పారు.
అన్ని పార్టీల సహకారం అవసరం
‘రాష్ట్ర అభివృద్ధికి అన్ని పార్టీల సహకారం అవసరం. సమస్యలొస్తే తమిళనాడులో అధికార, ప్రతిపక్ష పార్టీలు ఒక్కటి అవుతాయి. అలాంటి సంస్కృతి తెలంగాణలో కూడా పెరగాలి. రాష్ట్ర అభివృద్ధి కంటే రాజకీయాలు ముఖ్యం కాదు. ఈ విషయంలో ప్రజా ప్రభుత్వం ఎలాంటి భేషజాలకు పోదు. హైదరాబాద్ ప్రపంచ స్థాయి నగరాలతో పోటీ పడాలి. సమీపంలోని అమరావతితో కాదు. హైదరాబాద్ విశ్వనగరంలా మారాలంటే మెట్రోరైలు ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వ సహకారం అవసరం. రీజినల్ రింగ్ రోడ్డు, రిజినల్ రింగ్ రైల్ ప్రాజెక్టులపై కేంద్రం కేబినెట్‌లో చర్చించి నిర్ణయం తీసుకోవాలి.
అందుకు కేంద్ర మంత్రులు జి.కిషన్‌రెడ్డి, బండి సంజయ్ ప్రత్యేక చొరవ తీసుకోవాలి. రాష్ట్రానికి సముద్ర మార్గం లేనందున డ్రైపోర్టును, ఆటో మొబైల్ ఇండ్రస్ట్రీని తెలంగాణకు ఇచ్చేలా ప్రధానిని అడగాలి. గోదావరి నీటి వినియోగం పూర్తిగా జరగాలనే ఉద్దేశంతోనే రాజశేఖరరెడ్డి హయాంలో ప్రాణహిత–చేవెళ్ల చేపట్టారు. తుమ్మిడిహెట్టి ప్రాజెక్టుకు మహారాష్ట్ర భూభాగాన్ని తెలంగాణకు ఇవ్వాలి. ఇందుకు విద్యాసాగర్‌రావు, బీజేపీ పెద్దలు ఆ రాష్ట్ర ప్రభుత్వంతో చర్చించాలి..’ అని రేవంత్ విజ్ఞప్తి చేశారు.
విద్యార్థి రాజకీయాల్లేకుంటే చైతన్యం ఉండదు
‘వర్సిటీల్లో విద్యార్థులు రాజకీయాల్లోకి రావాలనే ఆలోచనను ప్రోత్సహించాలి. విద్యార్థి రాజకీయాలు లేకుంటే చైతన్యం ఉండదు. సమస్యలకు పరిష్కారం తొందరగా దొరకదు. స్కిల్స్ యూనివర్సిటీ ద్వారా యువతకు వేగంగా ఉపాధి అవకాశాలు అందుతాయి. జూన్ రెండో తేదీ నాటికి ఇది పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తుంది..’ అని ముఖ్యమంత్రి తెలిపారు. విద్యాసాగర్‌రావుగారి వ్యక్తిగతం ఎవరూ విమర్శించరని రేవంత్ చెప్పారు. రాజకీయ చైతన్యం అధికంగా ఉన్న తమిళనాడు రాష్ట్రానికి, అలాగే ఆర్థిక కేంద్రం మహారాష్ట్రకు ఒకేసారి గవర్నర్‌గా పనిచేసిన ఆయన..జాతీయ స్థాయిలో తెలంగాణ ప్రతిష్టను పెంచారని కొనియాడారు. మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడుతూ.. కరీంనగర్‌కు చెందిన విద్యాసాగర్‌రావు జాతీయ రాజకీయాల్లో తనదైన ముద్ర వేశారన్నారు. ఆయన పనితీరు అందరికీ ఆదర్శనీయమని పేర్కొన్నారు. పొన్నం ప్రభాకర్, బండి సంజయ్, మాజీ ఎంపీలు బి.వినోద్‌కుమార్, టి.సుబ్బిరామిరెడ్డి తదితరులు మాట్లాడారు.
అన్ని పార్టీలు అభివృద్ధి కోసం పోరాడాలి
యువతలో దాగి ఉన్న నైపుణ్యాన్ని వెలికితీసే దిశగా ప్రభుత్వం స్కిల్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేయడం అభినందనీయమని విద్యాసాగర్‌రావు అన్నారు. మూసీ నది పరిరక్షణ అత్యవసరమని, హైదరాబాద్‌ను విశ్వనగరంగా మార్చేందుకు కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవాని సూచించారు. ఎన్టీఆర్ ప్రభుత్వంలో ప్రైవేటు బిల్లులు ఆమోదింపజేసిన ఘనత ఉందని, ఈ ప్రభుత్వం కూడా ఆ విధానాన్ని అనుసరించాలని ఆకాంక్షించారు.
Comments
Please login to add a commentAdd a comment