మండేలా సంస్మరణలో ఏకమైన దక్షిణాఫ్రికా
జొహాన్నెస్‌బర్గ్: జాతి వివక్ష వ్యతిరేక పోరాట యోధుడు, దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు నెల్సన్ మండేలాకు నివాళులర్పించడంలో దేశ ప్రజలం తా ఏకమయ్యారు. ‘మదీబా’ సంస్మరణ కోసం ప్రభుత్వం ఆదివారం ప్రకటించిన జాతీయ ప్రార్థనా దినం సందర్భంగా ప్రజలంతా కులమతాలు, జాతివర్ణాలకు అతీతంగా ఆదివారం చర్చ్‌లు, ఇతర ప్రార్థనా స్థలాలకు భారీగా తరలివచ్చారు. జొహాన్నెస్‌బర్గ్‌లోని బ్రయన్‌స్టన్ మెథడిస్ట్ చర్చ్‌లో జరిగిన మండేలా సంస్మరణ కార్యక్రమంలో దేశాధ్యక్షుడు జాకబ్ జుమాతోపాటు మండేలా మాజీ భార్య విన్నీ మండేలా, ఇతర కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. 15న మండేలా స్వగ్రామం కునులో ప్రభుత్వ లాంఛనాలతో జరిగే ఈ అంత్యక్రియలకు అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా దంపతులతోపాటు ఐరాస సెక్రటరీ జనరల్ బాన్ కీ మూన్, భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, బ్రిటన్ ప్రధాని డేవిడ్ కామెరాన్ తదితరులు హాజరుకానున్నారు.