
నేడు నెల్సన్ మండేలా అంత్యక్రియలు
జాతివివక్ష వ్యతిరేకోద్యమ నాయకుడు, దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు నెల్సన్ మండేలా భౌతికకాయాన్ని శనివారం ప్రిటోరియా నుంచి ఆయన చిన్నప్పుడు గడిపిన కును గ్రామానికి తరలించారు. అంతకుముందు ప్రిటోరియాలో దేశాధ్యక్షుడు జాకబ్ జుమా, ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్ నేతలు ఘనంగా నివాళి అర్పించారు. అనంతరం భౌతికకాయాన్ని ప్రత్యేక విమానంలో థాథా పట్టణానికి తీసుకెళ్లి, అక్కడి నుంచి అధికార లాంఛనాలతో కును వరకు అంతిమయాత్ర నిర్వహించారు. 31 కి.మీ సాగిన యాత్ర జనసంద్రాన్ని తలపించింది. అభిమానులు తమ ప్రియతమ నేతను తలచుకుంటూ పాటలు పాడారు. మండేలా అంత్యక్రియలు ఆదివారం ఆయన తెగ హోసాకు చెందిన శ్మశానంలో జరుగుతాయి.