
నల్లసూర్యునికి ఘన నివాళి
సాక్షి, హైదరాబాద్: దక్షి ణాఫ్రికా మాజీ అధ్యక్షుడు నెల్సన్ మండేలాకు శాసనసభ గురువారం ఘనంగా నివాళులర్పించింది. నల్లజాతీయుల స్వేచ్ఛ కోసం దాదాపు మూడు దశాబ్దాల జైలు జీవితం గడిపిన మండేలా శ్వేత జాతీయులపై ప్రతీకారం తీర్చుకోవాలన్న ఆలోచన ఏనాడూ రానీయలేదని, ఆయన క్షమా గుణం ఎవరెస్ట్ శిఖరం కంటే గొప్పదని సభ్యులు కొనియాడారు. సభ్య సమాజంలో మండేలా మహా శిఖరమని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి కొనియాడగా.. ఆయన యుగపురుషుడని ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబునాయుడు అన్నారు. మండేలా జీవితమే ఓ సందేశం అని వైఎస్సార్‌సీపీ శాసనసభాపక్ష నేత విజయమ్మ శ్లాఘించారు.
సభలో తొలుత ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి... మండేలా మృతికి సంతాప తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జాతి వివక్షకు వ్యతిరేకంగా, మానవ హక్కుల సాధన కోసం విశేషంగా కృషి చేసిన మండేలా మరణం దిగ్భ్రాంతి కలిగించిందన్నారు. మహాత్మాగాంధీ స్ఫూర్తితో మండేలా పోరాడారని తెలిపారు. ఆయనకు భారతదేశం ‘భారతరత్న’ పురస్కారాన్ని ఇచ్చి సత్కరించిందని, 1993లో నోబెల్ శాంతి బహుమతి, యాభైకిపైగా అంతర్జాతీయ యూనివర్సిటీలు గౌరవ డాక్టరేట్లు ప్రదానం చేశాయని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజల తరపున ఆ దేశ ప్రజలకు, మండేలా కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్లు చెప్పారు. అనంతరం ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు మాట్లాడుతూ.. సొంత గడ్డపై కనీసం ఓటు హక్కు కూడా లేని నల్లజాతీయుల తరఫున అలుపెరుగని పోరాటం చేసిన మండేలా ‘యుగపురుషుడు’ అని అభివర్ణించారు. అహింస, క్షమాభిక్ష ఆయన సుగుణాలని వ్యాఖ్యానించారు.
అహింస, సహాయ నిరాకరణతో ఆయన అనుకున్నది సాధించారని పేర్కొన్నారు. అఫ్రికా స్థితిగతులు మెరుగుపర్చడానికి ఆయన కృషి అమోఘం అని అన్నారు.
క్షమాభిక్షలో ఎవరెస్ట్: మండేలా జీవితమే ఒక సందేశమని వైఎస్సార్‌సీపీ శాసనసభా పక్షనేత వైఎస్ విజయమ్మ అన్నారు. స్వేచ్ఛ, సౌభ్రాతృత్వం, రంగు, కులం, మతం లాంటి సంకుచిత భావాలకు దూరంగా ఆయన జీవనం కొనసాగిందని కొనియాడారు. నల్లజాతీయుల స్వేచ్ఛ కోసం ఆయన దాదాపు మూడు దశాబ్దాల కాలం కారాగారంలో ఉన్నా.. ఎన్ని చిత్రహింసలకు గురిచేసినా వెరవకుండా తన పంథాలో సాగారని చెప్పారు. ఆయన జీవితంలో పగ, ప్రతీకారానికి తావు లేదని, క్షమాభిక్షలో ఎవరెస్ట్ కంటే ఎత్తై వారని అన్నారు. అసమాన వ్యక్తత్వమే ఆయనకు ఈ గుర్తింపు తెచ్చిందని, మానవుల మధ్య అడ్డుగోడలు కూల్చడానికి మండేలా పోరాటమే స్ఫూర్తి అని అన్నారు. టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ మాట్లాడుతూ.. మండేలా ఇచ్చిన సందేశం ప్రకారం ‘నీ హక్కుల కోసం పోరాడు.. ఇతరులపై హక్కు కోసం పోరాడ వద్దు’ అని చేసిన సూచనను అందరూ గుర్తుంచుకోవాలన్నారు. అందరూ స్వేచ్ఛగా ఉండాలని కోరారని, అణగారిన వర్గాల కోసం చేసిన ఆయన పోరాటం అందరికీ స్ఫూర్తిదాయకమని అన్నారు. మరణాన్ని కూడా లెక్కచేయని చరితార్థుడు మండేలా అని కీర్తించారు. సీపీఐ నేత మల్లేశ్, సీపీఎం నాయకుడు జూలకంటి రంగారెడ్డి, బీజేపీ నాయకుడు యెండల లక్ష్మీనారాయణ, లోక్‌సత్తా అధినేత జయప్రకాశ్ నారాయణ్‌లు మండేలా మృతిపై సంతాపం ప్రకటించారు. అనంతరం మండేలా ఆత్మశాంతికోసం రెండు నిమిషాలు మౌనం పాటించారు. అనంతరం సభ శుక్రవారానికి వాయిదా పడింది.
మండేలా ఆదర్శనీయుడు: చక్రపాణి
మండేలాకు శాసన మండలి ఘనంగా నివాళులర్పించింది. ఉదయం మండలి ప్రారంభం కాగానే మంత్రి సి.రామచంద్రయ్య ప్రభుత్వ పక్షాన సంతాప తీర్మానం ప్రవేశపెట్టి ప్రసంగించారు. అనంతరం వివిధ పార్టీలకు చెందిన సభ్యులు మండేలాకు నివాళులర్పించారు. ఆయన జీవితంలోని ముఖ్య ఘట్టాలు, మహాత్మా గాంధీని స్ఫూర్తిగా తీసుకున్న తీరు గురించి వివరించారు. చివరగా మండలి చైర్మన్ చక్రపాణి మండేలాను అంతా ఆదర్శంగా తీసుకుని నవసమాజ నిర్మాణానికి కృషి చేయాలని తన సందేశంలో పేర్కొన్నారు. తర్వాత సభ రెండు నిమిషాలు మౌనం పాటించింది. అనంతరం వాయిదాపడింది.
అన్ని పార్టీలూ సహకరించాలి: శోభ
ఉద్యమాన్ని కిరణ్ నీరుగారుస్తున్నారంటూ ధ్వజం
సమైక్య తీర్మానం కోసం స్పీకర్‌కు వైఎస్సార్ కాంగ్రెస్ నోటీసిచ్చిందని పార్టీ శాసనసభా పక్ష ఉప నేత భూమా శోభానాగిరెడ్డి తెలిపారు. ప్రైవేట్ బిల్లు కింద ఇచ్చిన ఈ తీర్మానానికి విభజనతో నష్టపోయే ప్రాంతాలకు చెందిన అన్ని పార్టీల సభ్యులూ మద్దతివ్వాలని కోరారు. గురువారం అసెంబ్లీ వాయిదా పడ్డాక పార్టీ కేంద్ర కార్యాలయం వద్ద ఆమె మీడియాతో మాట్లాడారు. సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి సమైక్య ఉద్యమాన్ని నీరుగారుస్తున్నారంటూ దుయ్యబట్టారు. వారానికోసారి పత్రికల్లో ప్రకటనలు తప్పితే సమైక్యం కోసం ఆయన ఏం చేశారని సూటిగా ప్రశ్నించారు.
సభలో విభజన బిల్లును ఓడిస్తామంటూ ప్రజలను మభ్యపెట్టేలా కిరణ్ ప్రకటనలు చేస్తున్నారంటూ శోభ దుమ్మెత్తిపోశారు. ‘‘బిల్లు వచ్చినప్పుడు కేవలం అభిప్రాయాలు మాత్రమే తీసుకుంటారు. ఓటింగ్ ఉండదు. అదే తీర్మానం విషయంలో అయితే ఓటింగ్ ఉంటుంది. కాబట్టి సభ సమైక్య తీర్మానం చేసి కేంద్రానికి పంపితే పార్లమెంటులో అదొక ఆయుధంలా పని చేస్తుంది’’ అని శోభ వివరించారు. కానీ కిరణ్ మాత్రం కాంగ్రెస్ అధిష్టానం డెరైక్షన్‌లో విభజన దిశగా ముందుకెళ్తూ ప్రజలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రధాన ప్రతిపక్ష నేత అయిన చంద్రబాబుకు తానేం మాట్లాడుతున్నదీ తనకైనా అర్థమవుతోందా అని ప్రశ్నించారు. సమైక్యానికి మద్దతివ్వకపోతే బాబు చరిత్రహీనుడిగా మిగిలిపోతారని హెచ్చరించారు.