
ఆకాశమెత్తు ఆదర్శం అవసరం
బైలైన్
ఎం.జె.అక్బర్,
సీనియర్ సంపాదకులు
బ్రిటన్ ప్రధాని డేవిడ్ కామెరాన్ ఏ సిగ్గూలేని నయవంచకుడా లేక మరో మితవాద రాజకీయవేత్త మాత్రమేనా? లండన్‌లోని సుప్రసిద్ధమైన ‘10 డ్రౌనింగ్ స్ట్రీట్’ విలాసంలో కెమెరాల ముందు నిలిచి ఆయన మండేలాకు అర్ఫించిన నివాళి ఘనమైనదే. కానీ ఆయన ఒక విషయం చెప్పడం మరచారు. విశ్వవిద్యాలయ విద్యార్థిగా ఉండగా ఆయన గది గోడకు ‘మండేలాను ఉరి తీయండి’ అనే పోస్టరు ఉండేది.
కామెరాన్, ఆయన మితవాద టోరీ సహచర బృందాలు మార్గరేట్ థాచర్‌ను ఆరాధించేవారు. దక్షిణాఫ్రికాలోని జాత్యహం కార వ్యవస్థను, దాని జాతి దురహంకార క్రూరత్వాన్ని ఇక ఏవిధంగానూ సమర్థించజాలమనీ, ఆ పాశవిక దురన్యాయాన్ని సమర్థిస్తూ కూడా తాము అత్యుత్తమ నాగరికతకు ప్రాతినిధ్యం వహిస్తున్నామని ప్రజాస్వామిక దేశాలు చెప్పుకోడం కుదరదనీ అమెరికాతో పాటు అత్యధికభాగం పాశ్చాత్య దేశాలు బ్రిటన్ కంటే ముందే గుర్తించాయి. అయినా ఆ తర్వాత కూడా చాలా కాలంపాటు అవి అక్కడి జాత్యహంకార వ్యవస్థను నిలబెట్టే ఆసరా అయ్యాయి. అందుకు కారణం మార్గరేట్ థాచర్. బ్రిటన్ మితవాదం పెంచి పోషించిన చరిత్రకారులు దాని మితవాద భావజాల స్రవింతిలో భాగమే. వారు దక్షిణాఫ్రికాలోని జాత్యహంకార పాలనకు సమర్థకులుగా, చిట్టచివరి ప్రతిఘటనా కేంద్రంగా నిలి చారు. వలస పాలనా, దాని వివిధ దుష్ట రూపాలు ‘స్థానికుల’ మంచికేనని వారు చెప్పేవారు. తమ ఏలుబడిలోని దేశాల ప్రజలు... తమ చరిత్ర గతిలో ఐరోపా దేశాలు జోక్యం చేసుకోవడమనే ‘వరం పొందినవారు’ అని ప్రచారం చేసేవారు. దక్షిణాఫ్రికా జాత్యహంకార పాలన కంటే భారత్‌లోని బ్రిటిష్‌రాజ్ తక్కువ దుర్మార్గమైనదేనని ఒప్పుకోవాల్సిందే. అయితే అందుకు సరితూగేట్టుగా లక్షలాది మంది భారతీయులు కరువు కాటకాలలో రాలిపోవడాన్ని, చైనీ యులు నల్లమందు బానిసలు కావడాన్ని చెప్పుకోవచ్చు.
దక్షిణాఫ్రికాలోని అత్యంత బీభత్సకరమైన, జుగుప్సాకరమైన పరిస్థితుల నుంచే 20వ శతాబ్దపు ముగ్గురు అతి గొప్ప దార్శనికులు... గాంధీ, మండేలా, లూథర్‌కింగ్‌లు ఆవిర్భవించడం పూర్తిగా సమంజసం. వారిలో ఒకరైన మార్టిన్ లూథర్‌కింగ్ అమెరికాలో సుదీర్ఘంగా కమ్ముకున్న బానిసత్వపు నీలినీడల నుం చి వచ్చినవారు. మండేలా లేదా గాంధీలోని అద్భుత మేధో ప్రతిభ కు ప్రేరణను కలిగించినది బహుశా వారనుభవించిన అత్యథమస్థాయి అవమానమే కావొ చ్చు. ప్రతీకారం ప్రత్యామ్నాయం కాజాలదని అర్థం కావాలంటే నరకాన్ని అనుభవించి ఉండాలి. ప్రతీకారం మరో నరకాన్ని సృష్టించడం మాత్రమే చేస్తుంది. కాకపోతే దాని అధికార వ్యవస్థ భిన్నమైనదై ఉంటుంది.
గాంధీ తరచుగా చెబుతుండినట్టు కంటికి కన్ను తీసుకోవడమే జరిగితే త్వరలోనే ప్రపంచమంతటా అంధులే మిగులుతారు. మండేలా లేదా గాంధీలు సవాలు చేసిన వ్యవస్థలు ఆనాటి విజ్ఞతను బట్టి శతాబ్దాల పాటు మనగలిగినవి. ఆ వ్యవస్థలను సవాలు చేసిన వారిద్దరూ వాటిపట్ల ఎంతగా ఆగ్రహం చెందారనేదాన్ని తక్కువగా అంచనా వేయడానికి వీల్లేదు. అయితే పీడన మర్మం యజమాని బలంలో కంటే బానిస బలహీనతలోనే ఎక్కువగా ఉన్నద ని వారు అర్థం చేసుకున్నారు. వారు విసిరిన సవాలు కూడా దానికి అనుగుణమైనదే. తమ దేశాలను చెరబట్టిన నియంతృత్వాన్ని ధ్వంసించడానికి ముందు వారు ప్రజలను భయం నుంచి విముక్తులను చేయాల్సివ చ్చింది. వారిరువురి జీవితాలు, ఆదర్శప్రాయమైన ధైర్యసాహసాలు, అసమాన త్యాగాలు... నిస్సహాయమైన, నిరాశమయమైన పలు తరాలకు నిరంకుశత్వ విషవలయం నుంచి కాపాడే కరదీపికలయ్యాయి.
ఒక ద్వీపం మీది చెరసాలలో 27 ఏళ్ల యవ్వన జీవితాన్ని కోల్పోయిన పిదప పదవీ స్వీకారం చేస్తూ మండేలా... పాశవికమైన బానిసత్వం దక్షిణాఫ్రికాలో తిరిగి మళ్లీ తలెత్తడం ఎన్నటికీ జరగదు గాక జరగదు, జరగదని అన్నారు, 1947లో గాంధీ భారతదేశపు సంకెళ్లను తెంచడంతోనే ‘ఆప్రికా, ఆసియా ఖండాల వలసీకరణ’ అనే బృహత్తర యూరోపియన్ సౌధం ఇసుక మేడలా కుప్పకూలిపోయింది. అయితే నిజంగా ఆశ్చర్యం గొలిపే విషయం ఒక్కటే. ఉన్మాదపుటానందంతో జారిస్టులను హతమార్చిన కమ్యూనిస్టులకు భిన్నంగా గాంధీ, మండేలాలు... అంతర్యుద్ధం లేదా మరేదైనా యుద్ధానికి బదులు అందరినీ కలుపుకుపోవడం ద్వారానే అత్యుత్తమ భవిత సాధ్యమని గ్రహించారు.
గొప్ప వ్యక్తులను మన జీవితాలకు దూరం చేసి, ఊకదంపుడు పుస్తకాలలోని నిస్సారమైన వాక్యాలకు అతికించేయడం చాలా సులువైన పని. మనలాంటి సామాన్యులం గాంధీ, మండేలాలను అనుసరించలేం. గాంధీ అతి నిరాడంబరమైన ఆశ్రమ సంస్కృతిని ఎంచుకుంటే, మండేలా లొంగుబాటుతో జీవిత సౌఖ్యాలను తిరిగి అందుకోగలిగినా కాదని జైల్లో ఒంటరితనాన్నే ఎంచుకున్నారు. అలాంటి బాధలను అనుభవించగలిగిన వ్యక్తిత్వం మనకు లేదు. గాంధీ తన ఆత్మకథలో బహిర్గతం చేసినట్టుగా మనలో దాగివున్న బలహీనతను, దుర్బలతను, పరస్పర విరుద్ధతల అంతర్గత కల్లోలాన్ని వెల్లడి చే సే మనోస్థైర్యం మనకు లేదు. కానీ అసాధారణమైన కారుణ్య తాత్విక చింతన నుంచి మనం కొంత నేర్చుకోగలం. గాంధీ, మండేలా తమ లోలోతుల్లోని విశ్వాసానికి శిష్యులు. అందుకే రెండో చెంపను చూపారు... అది కూడా తాము క్రైస్తవులమని చెప్పుకోడానికి సైతం వెరవని దుస్సాహసికులైన క్రూర శత్రువులకు చూపారు. ఈ ప్రపంచం సాత్వికులదేనని వారు విశ్వసించారు.
వారు తమ పొగుగువారిని వారెవరో వారిగానే ప్రేమించారు, ప్రత్యేకించి తాము హిందువులుకాగా పొరుగువారు ముస్లింలైనప్పుడు లేదా తాము నల్లవారుకాగా పొరుగువారు తెల్లవారైనప్పుడు వారు అదే ప్రేమను చూపగలిగారు.
వారు లోపరిహ తులైన పరిపూర్ణ మూర్తులేమీ కారు. అలాంటి అర్థరహితమైన విషయాలను వారివద్ద ప్రస్తావిస్తే నవ్వేసేవారు. నిజమైన హీరోలకు భజనపరుల అవసరం లేదు. చిల్లర మల్లర సాహసికులే పొగడ్తలను కోరుకుం టారు. వారు పుణ్యపురుషులు కారు. ఆదర్శప్రాయమైనది ప్రతిదీ ఆచరణ సాధ్యమైనదే అవుతుందని విశ్వసించేటంతటి అమాయకులు కారు. వారు తాము పనిచేసిన కాలం నాటి రాజకీయ వాతావరణంలో పలువురితో కలిసి పనిచేసారు, కాపాడారు, వారు వృద్ధి చెందడానికి తోడ్పడ్డారు. అలాంటి వారిలో కూడా అహంకారం, భజనపరత్వం చెల్లాచెదురుగా పడి ఉండేవి. అయినా వారు వారిని ఇముడ్చుకోడానికి ప్రయత్నించారు. అయితే ఆదర్శవాదం కనుచూపు మేరలో కనిపిస్తూ ఉండకపోతే ఏ సమాజంలోనైనా లేదా ఏ దేశంలోనైనా రాజకీయాలు బయటపడలేని చిట్టడవిలో చిక్కుకుపోతాయని, త్వరత్వరగా దుర్గంధభరితమైన మస్తిష్కపు జైలుగా దిగజారిపోతాయని వారు గుర్తించారు.
వారిరువురూ దేవుణ్ణి విశ్వసించారు. ఇహలోకంలో వారిద్దరూ కలుసుకునే అవకాశం చిక్కలేదు. బహుశా వారి అంతరాత్మలు స్వర్గంలో కలుసుకుంటాయనుకుంటాను. వాళ్లు కిందకు చూసినప్పుడు తమ వారసులను, వారి పెడదోవలను, అవినీతిని చూసి సంతుష్టి చెందలేరు. కానీ వారిద్దరూ కామెరాన్ హృదయపూర్వకంగా అర్పించిన నిజాయితీతో కూడిన నివాళులకు సంతోషిస్తారని కచ్చితంగా చెప్పగలను. ఎందుకంటే ఆ నివాళి వారి అంతిమ విజయానికి ప్రాతినిధ్యం వహిస్తుంది. అర్ధనగ్న ఫకీరు, నల్ల యువకుడు శాంతిని విశ్వసించినందు వల్లనే సుదీర్ఘ యుద్ధంలో విజయం సాధించగలిగారని విన్‌స్టన్ చర్చిల్, మార్గరెట్ థాచర్‌ల వారసునికి తెలుసు.