దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు నెల్సన్ మండేలా (94) ఆరోగ్య పరిస్థితి మరింత విషమించింది. ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ తిరగబెట్టడంతో మూడు వారాల కిందట ప్రిటోరియా ఆస్పత్రిలో చేరిన ఆయనకు ప్రస్తుతం వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నారు. మండేలా ఆరోగ్యం క్షీణించినట్లు ఆయన కుటుంబ సభ్యులు చెప్పినట్లు ‘ది సిటిజన్’ పత్రిక బుధవారం వెల్లడించింది. మండేలా ఆరోగ్యం క్షీణించడంపై దక్షిణాఫ్రికా సంప్రదాయక నేతల సంఘం అధ్యక్షుడు ఫాతెకిలె హొలొమిసా ఆందోళన వ్యక్తం చేశారు. మండేలా ఆరోగ్యంపై ఆస్పత్రి వర్గాలు తాజాగా ఎలాంటి ప్రకటనా విడుదల చేయకున్నా, మండేలా వ్యక్తిగత వైద్యుడు వి.జె.రామ్‌లకన్ ఆస్పత్రిలోకి వెళ్తుండటం కనిపించిందని ఎస్‌ఏబీసీ వెల్లడించింది. మండేలా కుటుంబ సభ్యులు గానీ, ప్రభుత్వాధికారులు గానీ బుధవారం ఆయనను చూసేందుకు ఆస్పత్రికి వెళ్లలేదని తెలిపింది. మరోవైపు, మండేలా పెద్ద కుమార్తె మకాజివె కునులోని పూర్వీకుల నివాసంలో కుటుంబ సభ్యుల సమావేశం నిర్వహించారు. మండేలా అంత్యక్రియలు ఎక్కడ నిర్వహించాలనే అంశంపై కుటుంబ సభ్యుల సమావేశంలో విభేదాలు తలెత్తడంతో, మండేలా మనవడు ఒకరు సమావేశం మధ్యలోనే బయటకు వెళ్లిపోయినట్లు ‘స్టార్’ దినపత్రిక తెలిపింది. మండేలా జన్మస్థలమైన ఎమ్వెజోలోనే అంత్యక్రియలు చేపట్టాలని ఆయన మనవడు చెప్పగా, మిగిలిన వారు మండేలా చివరి కోరిక మేరకు ఆయనను ఆయన పిల్లల సమాధి పక్కనే ఖననం చేయాలని అభిప్రాయపడినట్లు వెల్లడించింది