World Suicide Prevention Day 2021: మనిషికి జంతువుతో పోలిస్తే ఉన్న అడ్వాంటేజ్.. మనుగడ పోరాటంలో తెలివితేటల్ని, విచక్షణ జ్ఞానాన్ని ఉపయోగించుకోగలగడం. నోరు లేని మూగజీవాలు ఎలాగోలా తమ బతుకుల్ని నెట్టుకొస్తుంటే.. అన్నీ ఉన్నా సంఘజీవి మనిషి మాత్రం పిరికితనంతో బలవన్మరణాలకు పాల్పడుతున్నాడు. క్షణికావేశంలో తీసుకుంటున్న నిర్ణయాలెన్నో బతుకుల్ని బుగ్గిపాలు చేస్తుంటే.. అందులో ఒకటైన ఆత్మహత్య మనిషిని మానసికంగా కుంగదీసి మరీ చంపేస్తోంది. ఒకవేళ ఆ ఒక్క క్షణం ఆగి ఆలోచిస్తే.. నెగెటివ్ అంశాలెన్నో పాజిటివ్‌గా మారిపోవడమే కాదు.. మరో మలుపు తిరిగి జీవితంలో అద్భుతాలు జరగొచ్చేమో కదా!
► సమస్యలు వస్తుంటాయి.. పోతుంటాయి. కానీ, ప్రాణం పోతే తిరిగి రాదు. ఆత్మహత్య సమస్యలకు పరిష్కారం కాదు.
►ఆత్మహత్యలను నివారించేందుకు, అది ఎంత పెద్ద నేరమో అవగాహన కల్పించేందుకు ప్రతీ ఏటా ఒక దినం నిర్వహిస్తున్నారు.
►ప్రతీ ఏటా ఆత్మహత్యా నివారణ దినోత్సవం సెప్టెంబర్ 10న జరుపుతున్నారు.
►ఈ ఏడాది థీమ్ ఏంటో తెలుసా? ‘బతకాలనే ఆశను అవతలివాళ్లలో సృష్టించడం.. అదీ చేతల ద్వారా’.
►కరోనా వల్ల మనిషిలో మానసికంగా కుంగుబాటు ఎక్కువ అయిపోయింది.
►ఉద్యోగాలు కోల్పోవడం, ఉపాధి అవకాశాలు పోగొట్టుకోవడం, అయినవాళ్లను దూరం చేసుకోవడం, సోషల్ గ్యాదరింగ్‌లు లేకపోవడం వల్ల మనిషి.. నిరాశానిస్పృహలోకి నెట్టేస్తున్నాయి. క్షణికావేశంలో అయినవాళ్లకు, అభిమానించేవాళ్లకు దూరంగా వెళ్లిపోతున్నారు.
►కిందటి ఏడాది బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ హఠాన్మరణం తర్వాత దేశవ్యాప్తంగా డిప్రెషన్-సూసైడ్‌ల గురించి విస్తృత చర్చ నడిచింది. అంతకు ముందు ఆత్మహత్యలు చేసుకున్న సెలబ్రిటీలతో పాటు యువత మానసిక స్థితి గతులపై సమీక్ష నిర్వహించేందుకు మేధావులకు, మానసిక నిపుణులకు అవకాశం ఇచ్చింది.
►అందుకే ఈ ఏడాది “Creating Hope Through Action” థీమ్ తెచ్చారు
►వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్.. ది ఇంటర్నేషనల్ అసోషియేషన్ ఫర్ సూసైడ్ ప్రివెన్షన్(IASP), వరల్డ్ ఫెడరేషన్ ఫర్ మెంటల్ హెల్త్(WFMH) సంయుక్తంగా ఈ రోజును నిర్వహిస్తారు.
►2003లో తొలిసారి ఈ దినోత్సవాన్ని నిర్వహించారు
►వందల్లో 60 మంది ఆత్మహత్యలకు పాల్పడడానికి కారణం.. ఒంటరిమనే భావన. కష్టకాలంలో సరైన ఓదార్పు లేకపోవడం.
►ఆర్థిక కారణాలు, బంధాలు, అయినవాళ్లతో గొడవలు కూడా మనిషిని ఆత్మహత్యకు ప్రేరేపిస్తున్నాయి.
►కాలు విరిగినా, చెయ్యి విరిగినా ఎలా విశ్రాంతి తీసుకుంటామో.. అలాగే మనసుకు విశ్రాంతి ఇవ్వాలి.
►సపోర్ట్‌గా నిలవాల్సింది సొసైటీనే. అంటే కుటుంబ సభ్యులు, స్నేహితులు, చుట్టుపక్కల ఉండే ఎవరైనా కావొచ్చు.
►సెన్సిటివ్ బిహేవియర్.. అంటే అప్పటిదాకా ధైర్యంగా ఉన్న మనిషి, చిన్న సంఘటనతోనూ కుంగుబాటుకు గురై ఆత్మహత్యకు పాల్పడే అవకాశాలు ఉండొచ్చు. కాబట్టి, వరుస దెబ్బలతో నిరాశనిస్పృహల్లోకి కూరుకుపోయిన వాళ్లే ఆత్మహత్యలకు పాల్పడతారనే అభిప్రాయం సరైంది కాదు.
►ఆత్మహత్యకు పాల్పడటం, ఆత్మహత్యకు యత్నించడం, పుసిగొల్పడం-ప్రేరేపించడం.. ఇవన్నీ నేరాలే. ఐపీసీ సెక్షన్-309 ప్రకారం.. జైలుశిక్ష జరిమానా తప్పవు. రాజీ కుదుర్చుకోవడానికి వీల్లేదు. అలాగే వీళ్ల తరపున ఏ లాయర్ వాదించడు.
►ప్రపంచంలో ప్రతీ నలభై సెకన్లకు ఒక ఆత్మహత్య నమోదు అవుతోంది. అందులో భారత్ టాప్ టెన్‌లో ఉండడం గమనార్హం.
►ఎందుకు బతకాలి? బతికి ఏం సాధించాలి? అనే పిరికి ప్రశ్నల కంటే.. బతికి సాధించుకోవాలి అనే ధైర్యం మనిషిని మహర్షిగా మారుస్తుంది.
క్షణికావేశ నిర్ణయం ఒక జీవితాన్ని అంధకారంలోకి నెట్టేస్తుంది. ఆ క్షణాన్ని గనుక అధిగమిస్తే అంతా వెలుగే నిండుతుంది - జాకీ చాన్
ఓడిన ప్రతీసారి రెట్టింపు ఉత్సామంతో పైకి లేవడమే మనిషి తన జీవితంలో సాధించే గొప్ప కీర్తి - నెల్సన్ మండేలా
- సాక్షి, వెబ్‌డెస్క్ స్పెషల్
Comments
Please login to add a commentAdd a comment