నెల్సన్ మండేలా మృతి పట్ల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్ర సంతాపం తెలిపారు.
తెల్లవారి గుండెల్లో ప్రచండాగ్నులు రగిలించిన నల్లసూరీడు, దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు నెల్సన్ మండేలా మృతి పట్ల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్ర సంతాపం తెలిపారు. ''21వ శతాబ్ది మానవాళికి ప్రత్యక్షంగా తెలిసిన మహోన్నత మానవుడు నెల్సన్ మండేలా. జాతుల మధ్య వైరానికి స్వస్తి పలికి దక్షిణాఫ్రికా చరిత్రలో మాత్రమే కాకుండా మొత్తం మావన జాతి చరిత్రలోనే నలుపు-తెలుపు అన్న వర్ణ వివక్షణను రూపుమాపి మానవులంతా ఒకటేనని చాటారు మండేలా. ఒక గాంధీ, ఒక మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్, ఒక మండేలా.... వీరి శరీరాలకు మరణం ఉంది తప్ప వారి మానవతా విలువలకు లేదు.
భారత జాతి పిత మహాత్మ గాంధీ గురించి ఐన్ స్టీన్ చేసిన వ్యాఖ్యలు నాకు గుర్తుకు వస్తున్నాయి. ఇంతటి మహోన్నతమైన మానవతామూర్తి రక్తమాంసాలతో ఒక మనిషిగా జన్మించి మన మధ్యే నడయాడాడంటే నమ్మటం బహుశా భవిష్యత్ తరాలకు అసాధ్యం కావచ్చు'' అని ఐన్ స్టీన్ ఆరోజు చేసిన వ్యాఖ్య ఈ రోజున మండేలాకు కూడా వర్తిస్తుంది. కులం, మతం, ప్రాంతం, వర్ణం, వర్గంలాంటి సంకుచిత భావాలతో నిత్యం దహించుకుపోతున్న మనుషులకు మండేలా అనే ఆ మూడు అక్షరాలు మానవత్వాన్ని నింపే మార్గదర్శకాలని నమ్ముతున్నాను. అంతటి మహోన్నత వ్యక్తికి నివాళులర్పించడానికి ఎవరికైనా అక్షరాలు రావు.... అశ్రువులు మాత్రమే వస్తాయి... అని జగన్ మోహన్ రెడ్డి అన్నారు.