మండేలా అంత్యక్రియలకు ఏర్పాట్లు
జొహాన్నెస్‌బర్గ్: జాతి వివక్ష వ్యతిరేక ఉద్యమ నేత, మాజీ అధ్యక్షుడు నెల్సన్ మండేలా అంత్యక్రియల కోసం దక్షిణాఫ్రికా ప్రభుత్వం ఏర్పాట్లు ప్రారంభించింది. జొహాన్నెస్‌బర్గ్గ్‌లోని ఎఫ్‌ఎన్‌బీ స్టేడియంలో మంగళవారం జరగనున్న మండేలా స్మారక కార్యక్రమానికి ప్రపంచ నేతలు పెద్దసంఖ్యలో హాజరు కానున్నందున, వారి కోసం తగిన ఏర్పాట్లు చేస్తోంది. చాలాకాలంగా అస్వస్థతతో బాధపడుతున్న నల్లసూర్యుడు మండేలా (95) శుక్రవారం అస్తమించిన సంగతి తెలిసిందే. ప్రజల సందర్శనార్థం ఆయన భౌతిక కాయాన్ని ప్రిటోరియాలోని యూనియన్ బిల్డింగ్స్ వద్ద మూడు రోజులు ఉంచనున్నారు.
అనంతరం డిసెంబర్ 15న ఆయన స్వగ్రామమైన కునులో ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. మండేలా మరణ వార్తతో విషాదసాగరంలో మునిగిపోయిన కును గ్రామం, ఆయన భౌతికకాయం రాక కోసం ఎదురు చూస్తోంది. మండేలా అంత్యక్రియలు ముగిసేంత వరకు సంతాప దినాలుగా ప్రకటించిన దక్షిణాఫ్రికా ప్రభుత్వం, ఆదివారం జాతీయ ప్రార్థనా దినంగా ప్రకటించింది. అలాగే, దేశవ్యాప్తంగా డిసెంబర్ 11 నుంచి 13 వరకు సంతాప కార్యక్రమాలు ఏర్పాటు కానున్నాయి. ‘మా దేశం ముద్దుబిడ్డ, మా జాతిపిత అంత్యక్రియలను అత్యంత ఘనంగా నిర్వహించేందుకు మనమంతా కలసికట్టుగా కృషిచేయాలి’ అని దక్షిణాఫ్రికా అధ్యక్ష కార్యాలయం శనివారం ఒక ప్రకటనలో పిలుపునిచ్చింది. దేశవ్యాప్తంగా చర్చ్‌లు, మసీదులు, ఆలయాలు తదితర ప్రార్థనా స్థలాల్లో మండేలా స్మారకార్థం జరిగే ప్రార్థనల్లో ప్రజలు పాల్గొనాలని కోరింది.
హాజరు కానున్న ప్రముఖులు: మండేలా అంత్యక్రియలకు అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా, ఆయన భార్య మిషెల్ ఒబామా, మాజీ అధ్యక్షుడు జార్జి బుష్, ఆయన భార్య లారా బుష్, మరో మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్, ఆయన భార్య, అమెరికా మాజీ విదేశాంగ మంత్రి హిల్లరీ క్లింటన్ హాజరు కానున్నారు. భారత్ తరఫున రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ నేతృత్వంలోని ప్రతినిధి బృందం మండేలా అంత్యక్రియలకు హాజరు కానుంది. కాగా, దక్షిణాఫ్రికాలో శనివారం సైతం ప్రజలు పెద్దసంఖ్యలో వీధుల్లో గుమిగూడి సంతాప కార్యక్రమాల్లో పాల్గొన్నారు. జోహాన్నెస్‌బర్గ్ శివార్లలోని హఫ్‌టన్‌లో మండేలా నివాసం వద్దకు వేలాది మంది జనం చేరుకుని, ఆయన జ్ఞాపకాలను మననం చేసుకున్నారు. అంత్యక్రియల సన్నాహాల కోసం దక్షిణాఫ్రికా ఆర్మీ తన సిబ్బందికి సెలవులను రద్దుచేసి, బలగాలన్నింటినీ విధుల్లోకి రప్పించింది. ఉత్తర కొరియా, జింబాబ్వే సహా వివిధ దేశాల నుంచి శనివారం సైతం మండేలాకు నివాళులర్పిస్తూ సంతాప సందేశాలు వెల్లువెత్తాయి.