South africa government
-
‘మండేలా’ తాళం చెవి వేలం ఆపండి
జొహన్నస్‌బర్గ్: జాతి వివక్ష వ్యతిరేక ఉద్యమ నాయకుడు నెల్సన్ మండేలా 18 ఏళ్లపాటు కారాగార శిక్ష అనుభవించిన జైలు గది తాళం చెవిని వేలం వేయడాన్ని దక్షిణాఫ్రికా ప్రభుత్వం తీవ్రంగా ఆక్షేపించింది. నల్లజాతి సూరీడు, దక్షిణాఫ్రికాలో ప్రజాస్వామ్య బద్ధంగా అధ్యక్షుడైన తొలి నాయకుడు జైలు జీవితం గడిపిన గది తాలూకూ వస్తువులన్నీ జాతి సంపదలని దక్షిణాఫ్రికా ప్రకటించింది. అమెరికాలో జనవరి 28న జరగనున్న ఓ ప్రైవేట్ వేలంపాటలో ఆ తాళం చెవికి ధర కట్టడాన్ని నిలిపివేయాలని డిమాండ్ చేసింది. అసలు తమ ప్రభుత్వాన్ని సంప్రదించకుం డా వేలంవేయడ మేంటని దక్షిణాఫ్రికా క్రీడలు, సాంస్కృతిక శాఖ మంత్రి నాథి ఎంతెత్వా ప్రశ్నించారు. మండేలాకు చెందిన కళ్లద్దాలు, పెన్నులు, అమెరికా మాజీ అధ్యక్షుడు జార్జ్ బుష్, ఐక్యరాజ్యసమితి నుంచి అందుకున్న జ్ఞాపికలూ వేలానికి పెట్టారు. ఈ మొత్తం ఘటనపై దర్యాప్తు కొనసాగిస్తామన్నారు. వేలానికి పెట్టిన మండేలా వస్తువులను తిరిగి దేశానికి తెస్తామన్నారు. మండేలాకు విధించిన 27 ఏళ్ల కారాగార శిక్షలో 18 ఏళ్లు రాబిన్ ద్వీపంలోని జైలులో ఒకే గదిలో గడిపారు. ఆ కాలంలో ఆ జైలుకు జైలర్‌గా క్రిస్టో బ్రాండ్ ఉన్నాడు. మండేలాకు, క్రిస్టోకు మంచి స్నేహం కుదిరింది. ఆ తర్వాత క్రిస్టో .. రాబిన్ ద్వీపానికి టూర్ గైడ్‌గా మారాడు. ప్రస్తుతం ఆ జైలును పురావస్తుశాలగా మార్చారు. అయితే, మండేలా ఉన్న గది తాళం చెవి డూప్లికేట్ ఒకటి క్రిస్టో చెంతకు చేరింది. ఆ డూప్లికేట్ కీను అమెరికాకు చెందిన గెన్సీస్ ఆక్షన్స్ అనే వేలం సంస్థకు విక్రయించాడు. నోబెల్ శాంతి పురస్కార గ్రహీత, మహోన్నతమైన మండేలా గడిపిన గది తాలూకు కీ కావడంతో అది రూ.10 కోట్లకుపైగా ధర పలకవచ్చని ప్రాథమిక అంచనాలున్నాయి. గది మాస్టర్ కీ(అసలైన తాళం చెవి) జైలులోనే ఉందని, డూప్లికేట్‌కు ఒడిగట్టిన అధికారులు ఎవరనేది తేలుస్తామని మంత్రి చెప్పారు. -
ప్రమాదంలో దక్షిణాఫ్రికా క్రికెట్!
కేప్‌టౌన్: బోర్డు అవకతవకలు, అనుచిత కార్యకలాపాలు, అవినీతి ఆరోపణలతో కుదేలైన దక్షిణాఫ్రికా క్రికెట్ (సీఎస్ఏ) మరో ప్రమాదంలో పడనుంది. అంతర్జాతీయ క్రికెట్లో పాల్గొనకుండా దక్షిణాఫ్రికా క్రికెట్‌పై నిషేధం విధించేందుకు అక్కడి ప్రభుత్వం సిద్ధమైంది. ఈ మేరకు తమ నిర్ణయాన్ని అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) దృష్టికి కూడా తీసుకెళ్లినట్లు క్రీడా మంత్రి నాతి మెథ్వీ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సమస్యను పరిష్కరించడంలో సీఎస్ఏకు సహకరించేందుకు పలుమార్లు సమావేశమైనప్పటికీ వారి తీరులో ఎలాంటి మార్పు రాలేదని మెథ్వీ అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘సీఎస్ఏ పాలనలో స్థిరత్వం తీసుకురావడానికి చాలా ప్రయత్నించాం. కానీ వారి నుంచి సహకారం అందలేదు. అందుకే ఈ నిర్ణయానికి వచ్చాం. ఇక వారితో ఎటువంటి సంప్రదింపులు చేయదల్చుకోలేదు’ అని ఆయన అన్నారు. తాను ఈ విషయంలో ఎందుకు జోక్యం చేసుకోకూడదో తెలిపేలా తమ వాదనలు వినిపించాలని క్రికెట్ అధికారులకు మెథ్వీ అక్టోబర్ 27 వరకు గడువునిచ్చారు. -
గాంధీ మనవరాలిని కలిసిన కుప్పురాం
బంజారాహిల్స్: వాకర్స్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ఏబీ కుప్పురాంకు దక్షిణాఫ్రికా ప్రభుత్వం అరుదైన అవకాశం కల్పించింది. జూలై 26న సౌతాఫ్రికాలోని పీటర్‌మార్టిజ్‌బర్గ్ నగరంలో ప్రారంభమైన ‘గాంధీ–మండేలా యూత్ సింపోజియం’లో మాట్లాడే అవకాశం ఆయనకు దక్కింది. ఈ మేరకు పీటర్‌మార్టిజ్‌బర్గ్ గాంధీ మెమోరియల్ కమిటీ డిప్యూటీ చైర్పర్సన్ బన్నీబూలా ఆహ్వానం పంపగా.. జూలై 23న ఆయన సౌతాఫ్రికాకు వెళ్లారు. ఇండియా, దక్షిణాఫ్రికా మధ్య సత్సంబంధాలు నెలక్పొలే దిశగా ఈ సదస్సు నిర్వహిస్తున్నారు. ఇందులో పాల్గొనే అవకాశం లభించడంపై కుప్పురాం ఆనందం వ్యక్తం చేశారు. ఇదొక ప్రతిష్టాత్మక సదస్సు అని పేర్కొన్నారు. సందర్శనలో భాగంగా ఆయన గాంధీ మనవరాలు ఇలాగాంధీని కలుసుకున్నారు. ఆమె దక్షిణాఫ్రికాలో పొలిటిషియన్, యాక్టివిస్ట్. -
మండేలా అంత్యక్రియలకు ఏర్పాట్లు
జొహాన్నెస్‌బర్గ్: జాతి వివక్ష వ్యతిరేక ఉద్యమ నేత, మాజీ అధ్యక్షుడు నెల్సన్ మండేలా అంత్యక్రియల కోసం దక్షిణాఫ్రికా ప్రభుత్వం ఏర్పాట్లు ప్రారంభించింది. జొహాన్నెస్బర్గ్గ్లోని ఎఫ్ఎన్బీ స్టేడియంలో మంగళవారం జరగనున్న మండేలా స్మారక కార్యక్రమానికి ప్రపంచ నేతలు పెద్దసంఖ్యలో హాజరు కానున్నందున, వారి కోసం తగిన ఏర్పాట్లు చేస్తోంది. చాలాకాలంగా అస్వస్థతతో బాధపడుతున్న నల్లసూర్యుడు మండేలా (95) శుక్రవారం అస్తమించిన సంగతి తెలిసిందే. ప్రజల సందర్శనార్థం ఆయన భౌతిక కాయాన్ని ప్రిటోరియాలోని యూనియన్ బిల్డింగ్స్ వద్ద మూడు రోజులు ఉంచనున్నారు. అనంతరం డిసెంబర్ 15న ఆయన స్వగ్రామమైన కునులో ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. మండేలా మరణ వార్తతో విషాదసాగరంలో మునిగిపోయిన కును గ్రామం, ఆయన భౌతికకాయం రాక కోసం ఎదురు చూస్తోంది. మండేలా అంత్యక్రియలు ముగిసేంత వరకు సంతాప దినాలుగా ప్రకటించిన దక్షిణాఫ్రికా ప్రభుత్వం, ఆదివారం జాతీయ ప్రార్థనా దినంగా ప్రకటించింది. అలాగే, దేశవ్యాప్తంగా డిసెంబర్ 11 నుంచి 13 వరకు సంతాప కార్యక్రమాలు ఏర్పాటు కానున్నాయి. ‘మా దేశం ముద్దుబిడ్డ, మా జాతిపిత అంత్యక్రియలను అత్యంత ఘనంగా నిర్వహించేందుకు మనమంతా కలసికట్టుగా కృషిచేయాలి’ అని దక్షిణాఫ్రికా అధ్యక్ష కార్యాలయం శనివారం ఒక ప్రకటనలో పిలుపునిచ్చింది. దేశవ్యాప్తంగా చర్చ్‌లు, మసీదులు, ఆలయాలు తదితర ప్రార్థనా స్థలాల్లో మండేలా స్మారకార్థం జరిగే ప్రార్థనల్లో ప్రజలు పాల్గొనాలని కోరింది. హాజరు కానున్న ప్రముఖులు: మండేలా అంత్యక్రియలకు అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా, ఆయన భార్య మిషెల్ ఒబామా, మాజీ అధ్యక్షుడు జార్జి బుష్, ఆయన భార్య లారా బుష్, మరో మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్, ఆయన భార్య, అమెరికా మాజీ విదేశాంగ మంత్రి హిల్లరీ క్లింటన్ హాజరు కానున్నారు. భారత్ తరఫున రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ నేతృత్వంలోని ప్రతినిధి బృందం మండేలా అంత్యక్రియలకు హాజరు కానుంది. కాగా, దక్షిణాఫ్రికాలో శనివారం సైతం ప్రజలు పెద్దసంఖ్యలో వీధుల్లో గుమిగూడి సంతాప కార్యక్రమాల్లో పాల్గొన్నారు. జోహాన్నెస్‌బర్గ్ శివార్లలోని హఫ్టన్లో మండేలా నివాసం వద్దకు వేలాది మంది జనం చేరుకుని, ఆయన జ్ఞాపకాలను మననం చేసుకున్నారు. అంత్యక్రియల సన్నాహాల కోసం దక్షిణాఫ్రికా ఆర్మీ తన సిబ్బందికి సెలవులను రద్దుచేసి, బలగాలన్నింటినీ విధుల్లోకి రప్పించింది. ఉత్తర కొరియా, జింబాబ్వే సహా వివిధ దేశాల నుంచి శనివారం సైతం మండేలాకు నివాళులర్పిస్తూ సంతాప సందేశాలు వెల్లువెత్తాయి.