మహా పోరాటయోధుడు | Nelson Mandela Jayanti | Sakshi
Sakshi News home page

మహా పోరాటయోధుడు

Published Sun, Jul 15 2018 12:18 AM | Last Updated on Sun, Jul 15 2018 4:34 AM

Nelson Mandela  Jayanti - Sakshi

‘ఒక వ్యక్తికి ఉన్న జీవించే హక్కును హరిస్తే అతడు తిరుగుబాటుదారుడు కాక తప్పదు’ అంటారు నెల్సన్‌ మండేలా. నిజమే. అణచివేత కలకాలం సాగదు. అణచివేత పెరిగే కొలదీ నియంతల అహంకారం పతనమయ్యే క్షణాలు సమీపిస్తున్నట్టే. ఇదే ప్రపంచ దేశాల చరిత్రలో కనిపిస్తుంది. అయితే అందుకు సాగిన ఉద్యమాల స్వరూపాలు వేరు. పోరాటాల స్వభావాలు వేరు. వాటికి నాయకత్వం వహించిన నేతల పంథాలు వేరు. నెల్సన్‌ మండేలా అనే మహా పోరాటయోధుడు కూడా అందులో ఒకరు. తన జాతి స్వేచ్ఛ కోసం 27 ఏళ్లు ఆయన తన స్వేచ్ఛను జైలు గోడలకు బలిచేసుకున్నాడు. దక్షిణాఫ్రికా ఆధునిక ప్రపంచ చరిత్రలో వివక్షకూ, నిరంకుశత్వానికీ చిరునామాగా కనిపిస్తుంది. ఈ దేశం పేరుతో భారతీయులకు కూడా చిరపరిచయమే ఉంది. ఆ దేశంతో, భారతీయులు జాతిపితగా పిలుచుకునే మహాత్మా గాం«ధీ అక్కడ జరిపిన హక్కుల పోరాట చరిత్రతో భారతీయుల పరిచయం ఉద్వేగ భరితమైనది. నల్లజాతీయులు (అక్కడి శ్వేతజాతి ప్రభుత్వం దృష్టిలో నల్లవారే కాదు, భారతీయుల కూడా నల్లవారి కిందే లెక్క) జుట్టు పెంచినా పన్ను కట్టించుకున్న దేశమది. పెళ్లి కూడా ఒక మత సంప్రదాయం మేరకే జరగాలన్న వ్యవస్థ అది. ఫస్ట్‌క్లాస్‌ టిక్కెట్‌తో రైలు ఎక్కినా నల్లజాతీయుడు కాబట్టి గాంధీజీని రైలు బోగీ నుంచి కిందకు నెట్టివేసిన అధికార మదం ఆనాటి ఆ దేశ ప్రభుత్వానిది. అలాంటి చోట జాతి వివక్ష ప్రభుత్వాన్ని, ఆ ప్రభుత్వాన్ని నడుపుతున్న శ్వేతజాతిని నెల్సన్‌ మండేలా తల వంచేటట్టు చేయగలిగారు.   

నెల్సన్‌ మండేలా (జూలై 18,1918– డిసెంబర్‌ 5,2013)కూ, గాంధీజీకీ కొన్ని విషయాలలో సామ్యాలు కనిపిస్తాయి. అహింసా పద్ధతులతో నిరంకుశత్వాన్ని మెట్టు దిగేటట్టు చేయవచ్చునని గాంధీజీ విశ్వాసం. శాసనోల్లంఘన ద్వారా ఎలాంటి ప్రభుత్వాలనైనా కదిలించవచ్చునని ఆయన అనుభవం. నెల్సన్‌ మండేలా ఉద్యమ తొలి దశ కూడా అలాగే మొదలైంది. అహింస ద్వారా, శాసనోల్లంఘన ద్వారా ప్రభుత్వాన్ని ప్రజల ముందు తలొగ్గేటట్టు చేయవచ్చునని ఆయన అనుకున్నారు. కానీ ఆయన శాంతియుత పంథాను విడిచిపెట్టి సాయుథ పథం వైపు నడవక తప్పని పరిస్థితులు తలెత్తాయి. మహాత్ముడి ఉద్యమానికీ, మండేలా ఉద్యమానికి మధ్య కాలం తన లక్షణాన్ని అంతగా మార్చుకుందేమోమరి!

మండేలా రాజకీయాలు, ఉద్యమం, ప్రస్థానం గురించి చెప్పుకునే ముందు ఆయన గత చరిత్రను స్మరించుకోవాలి. ఆయనను ఉద్యమకారునిగా మారడం వెనుక వాస్తవాలు అందులోనే ఉన్నాయి. అదొక దేశ చరిత్ర. ఒక జాతి బాధల గాథ. అందులో ఆగ్రహం, ఆవేశాల కథ. ఇలాంటి వారి పుట్టుపూర్వోత్తరాలు తెలుసుకోవడం లాంఛనం అని చెప్పలేం కూడా. అదొక చారిత్రక అవసరం. మొదటి ప్రపంచ యుద్ధం ముగిసిపోతున్న కాలమది. కానీ ఆ యుద్ధం తెచ్చిన విపత్తులతో, కరువు కాటకాలతో ప్రపంచం కొత్త యుద్ధం ప్రారంభిస్తున్న కాలం. కానీ ఆ యుద్ధం కొన్ని గణనీయ మార్పులు తెచ్చింది. నాలుగు నియంతృత్వాలు కుప్పకూలాయి. జర్మనీ, ఆస్ట్రియా, టర్కీ, రష్యా నియంతలు పతనమయ్యారు. కొత్త రాజకీయ తాత్వికతలు బలం పుంజుకున్నాయి. రాజకీయాలు వేడెక్కాయి. రాడికల్‌ భావాలు పదునెక్కాయి. కానీ శ్వేతజాతి అధీనంలో, లేదా శ్వేతజాతి నల్లబంటుల చేతిలో ఉన్న దక్షిణాఫ్రికా మాత్రం మార్పునకు నోచుకోలేదు. బహుశా మొదటి ప్రపంచ యుద్ధంలో ఇంగ్లండ్‌ విజయం అందుకు అవకాశం ఇచ్చి ఉండవచ్చు. కానీ యుద్ధం ఆరంభం కావడానికి ముందే గాంధీజీ ఆ దేశంలో రాజకీయ చైతన్యానికీ, హక్కుల స్పృహకూ అంకురార్పణ చేశారు. ఇదంతా జరిగిన దాదాపు రెండు దశాబ్దాల తరువాత దక్షిణాఫ్రికా రాజకీయ వాతావరణం మీద ఉన్న అసంతృప్తి కొత్త మలుపు తీసుకుంది. ఆగ్రహంగా, ఆవేశంగా ఆ అసంతృప్తి రూపు దాలుస్తున్న సమయంలో మండేలా జన్మించారు. 

నెల్సన్‌ మండేలా అసలు పేరు నెల్సన్‌ రోలిలాహ్లా మండేలా. మాడిబా ఆయన ముద్దుపేరు. థెంబు తెగ. కేప్‌ పరిధిలోని ఉటాటా అనే ప్రాంతంలో మెజో అనే ఊళ్లో ఆయన జన్మించారు. మాట్లాడే భాష హోసా. కానీ చదువుకు సుదూరంగా ఉండిపోయిన తెగలలో అదొకటి. తండ్రి గాడ్లా హెన్రీ. బహుభార్యాత్వం ఉన్న ఆ తెగలో గాడ్లా నాలుగు వివాహాలు చేసుకున్నాడు. వారిలో మూడవ భార్య కుమారుడు నెల్సన్‌. గాడ్లా థెంబు తెగకు అధిపతి. ఆ తెగ నుంచి మొదటిసారి పాఠశాలలో చేరిన వాడు నెల్సన్‌ మండేలాయే. అక్కడే క్రైస్తవ ఉపాధ్యాయురాలు ‘నెల్సన్‌’ అన్న అక్షరాలను అతడి తెగ ఇచ్చిన పేరులో చేర్చింది. అలా ఎందుకు జరిగిందో తనకు మాత్రం తెలియదని మండేలా ‘లాంగ్‌ వాక్‌ టు ఫ్రీడమ్‌’ పుస్తకంలో చెప్పుకున్నారు. తరువాత ఉన్నత చదువుల కోసం ఆయన పెద్ద త్యాగం, సాహసం చేయవలసి వచ్చింది. వారి ఆచారం మేరకు తెగ ఆధిపత్యాన్ని త్యజించిన తరువాత మాత్రమే నెల్సన్‌కు ఉన్నత చదువులకు వెళ్లడానికి అవకాశం చిక్కింది. 

విట్‌వాటర్‌సాండ్‌ విశ్వవిద్యాలయంలో న్యాయశాస్త్రం చదివారు నెల్సన్‌. విద్యార్థి దశలోనే ఆయన రాజకీయాలు మొదలయ్యాయి. నల్లజాతీయుల విముక్తికోసం అప్పటికే ఉద్యమిస్తున్న ఆఫ్రికన్‌ నేషనల్‌ కాంగ్రెస్‌లో మండేలా సభ్యుడయ్యారు. ఆ వెంటనే, అంటే 1944లో ఆ సంస్థ యువజన శాఖకు నాయకుడయ్యారు. చదువు పూర్తి చేసి న్యాయవాదిగా నల్లజాతీయుల కోసం సలహాలు ఇచ్చేందుకు మొదట ఒక సంఘాన్ని ఏర్పాటు చేశారు (నిజానికి గాంధీజీ చేసిన పని కూడా ఇదే. దక్షిణాఫ్రికా ప్రభుత్వం నుంచి హక్కులు సాధించేందుకు నల్లజాతీయులను, భారతీయులను ఏకం చేయడానికి ముందు గాంధీజీ అక్కడ న్యాయసలహాదారుగానే పనిచేశారు). తన మండేలా బాల్యమిత్రుడు, ఆఫ్రికన్‌ నేషనల్‌ కాంగ్రెస్‌ సభ్యుడు అలీవర్‌ టాంబో సంఘం ఏర్పాటులో సహకరించారు. 1948 తరువాత జాతి వివక్ష ప్రభుత్వం రుద్దిన చట్టాలతో సర్వం కోల్పోయిన వారికి న్యాయ సహాయం చేయడమే వీరి ఉద్దేశం. దీనితో పాటు ఇలాంటి చట్టాల గురించి నల్లజాతీయులలో అవగాహన కల్పించడానికి దేశమంతా తిరుగుతూ ఉండేవారు. 1948లో జరిగిన ఎన్నికలు నల్లజాతీయుల ఆగ్రహాన్ని మరింత పెంచాయి. అప్పుడు అధికారంలోకి వచ్చిన నేషనల్‌పార్టీ ప్రభుత్వం నల్లజాతీయుల హక్కులకు మరింతగా ఆటంకాలు కల్పించడం ఆరంభించింది. అప్పటిదాకా జరిగిన పోరాటాలు వ్యర్థమైపోయే సూచనలు కనిపించాయి. అల్పసంఖ్యాక శ్వేత జాతి ప్రభుత్వం మరింత బలపడే విధంగా చర్యలు మొదలయినాయి. పైగా నల్లజాతీయులకు పూర్తి స్థాయి పౌరసత్వం కల్పించాలంటూ అఫ్రికన్‌ నేషనల్‌ కాంగ్రెస్‌ చేపట్టిన ఉద్యమం కూడా ఊపందుకుంటున్న కాలం. అందుకోసం అహింసా పద్ధతులలో సమ్మెలు, బాయ్‌కాట్లు, శాసనోల్లంఘన జరుగుతోంది. అప్పుడే మండేలా  ప్రభుత్వం దృష్టిలో పడ్డారు. నిజానికి  నల్లజాతీయుల స్వేచ్ఛ కోసం 1955లో అక్షరబద్ధమైన ‘ఫ్రీడమ్‌ చార్టర్‌’ రచనలో కూడా మండేలాదే కీలక పాత్ర. ఆ హక్కుల పత్రాన్ని అప్పటి ప్రభుత్వం నిషేధించింది. అందుకే ప్రభుత్వం ఆయన మీద మరింతగా దృష్టి కేంద్రీకరించింది. మండేలాను వెంటాడడం మొదలయింది. నిఘా విస్తరించింది. డిసెంబర్‌ 5,1956న మండేలా సహా, 155 మంది ఉద్యమకారులను శ్వేతజాతి ప్రభుత్వం అరెస్టు చేసింది. ఆరోపణ – దేశద్రోహం. ఈ కేసును 1961లో న్యాయస్థానం కొట్టివేసింది. కానీ ఒక దశలో మండేలా సహా పలువురికి మరణశిక్ష పడవచ్చునని అంతా భయపడ్డారు. ఇది జరగడానికి ముందే మరో దారుణం జరిగింది. దానిపేరే షార్ప్‌విల్లే హత్యాకాండ. 

మార్చి 21, 1960న ఆ దుర్ఘటన జరిగింది. నల్లజాతి యువకులను మరింత వేధించడానికీ, వారి జీవించే హక్కును మరింత పరిమితం చేయడానికీ జాత్యహంకార ప్రభుత్వం అంతకు ముందే ఒక చట్టం తెచ్చింది. దాని ప్రకారం గ్రామీణ ప్రాంతాల నుంచి ఉపాధి కోసం పట్టణాలకు వచ్చే నల్లజాతీయులు వారి వివరాలను తెలిపే పత్రాలను తప్పనిసరిగా ఉంచుకోవాలి. 16 సంవత్సరాలు దాటిన ప్రతి నల్లవానికి ఇది అనివార్యం. తరువాత నల్లజాతి మహిళలకు కూడా ఈ చట్టాన్ని వర్తింపచేశారు. అంటే పట్టణాలకు వారి వలసను నిరోధించడమే ఈ చట్టం ఉద్దేశం. ఇలాంటి పత్రాలు లేవంటూ ఆఫ్రికన్‌ నేషనల్‌ కాంగ్రెస్‌ సంస్థ సభ్యులని, పాన్‌ ఆఫ్రికన్‌ ఆఫ్రికనిస్టు కాంగ్రెస్‌ సభ్యులను వేధించేవారు (పాన్‌ ఆఫ్రికనిస్టు కాంగ్రెస్‌ ఆఫ్రికన్‌ నేషనల్‌ కాంగ్రెస్‌లో చీలిక వర్గం). అప్పటి నేషనల్‌పార్టీ ప్రభుత్వం, ఆ  ప్రభుత్వం అధినేత డాక్టర్‌ హెన్రిక్‌ వెర్‌వోర్డ్‌ ఇందుకు బాధ్యులు. ఈ చర్యకు నిరసనగా శాంతియుతంగా ఉద్యమం చేయాలని ఆఫ్రికన్‌ నేషనల్‌ కాంగ్రెస్‌ పిలుపునిచ్చింది. నిజానికి ఆ మార్చి 31న నిరసనలు చేపట్టాలని ఆ సంస్థ ఉద్దేశం. కానీ పాన్‌ ఆఫ్రికనిస్టులు మార్చి 21న నిరసన జరపాలని నిర్ణయించారు. దేశమంతా ఉద్యమం జరిగినా, షార్ప్‌విల్లే దురాగతం మాత్రం (ట్రాన్స్‌వాల్‌ దగ్గరలోనిది. ఇది కూడా ఆనాటి గాంధీజీ ఉద్యమ క్షేత్రాలలో ఒకటి) ఘోరమైనది.  ఏడు నుంచి పదివేల మంది వరకు ఉద్యమకారులు షార్ప్‌విల్లే పోలీసు స్టేషన్‌ను ముట్టడించాలని వచ్చారు. వారి నినాదం ఒక్కటే– ‘మా దగ్గర ఎలాంటి పత్రాలు లేవు. మమ్మల్ని వెంటనే అరెస్టు చేయండి!’  ఉద్యమం శాంతియుతంగా జరుగుతూ ఉండగా పోలీసులే రెచ్చగొట్టి కాల్పులు జరిపారని ఉద్యమకారుల ఆరోపణ. ఉద్యమకారులే హింసకు దిగారని పోలీసుల వాదన. ఏమైనా కాల్పులలో 69 మంది చనిపోయారు. 29 మంది చిన్నారులు సహా 260 మంది వరకు గాయపడ్డారు. ఈ ఉదంతమే చాలామంది నల్లజాతీయులకు శాంతియుత పంథా మీద నమ్మకం పోయేలా చేసింది. ఈ దుర్ఘటన దక్షిణాఫ్రికా నల్లజాతీయుల మనసులను ఎంతగా గాయపరిచిందంటే, ఆ రక్తపంకిల చరిత్రను నేటికీ మార్చి 21న దేశమంతా స్మరించుకుంటుంది. ప్రభుత్వం సెలవు ప్రకటిస్తుంది. 

షార్ప్‌విల్లే హింసాకాండతో మండేలా కూడా తన అహింసా సిద్ధాంతాన్ని పక్కన పెట్టారు. 1961లో ఏర్పడిన ఉఖంటో వి సిజ్వే (జాతి చేతిలోని బల్లెం) లేదా ‘ఎమ్‌ కె’ అనే సంస్థలో ఆయన సభ్యుడయ్యారు. నిజానికి ఇది ఆఫ్రికన్‌ నేషనల్‌ కాంగ్రెస్‌తో ఎడబాటు కాదు. ఎమ్‌ కె కూడా ఆఫ్రికన్‌ నేషనల్‌ కాంగ్రెస్‌కు అనుబంధంగా పనిచేసే సాయుధ పోరాట సంస్థ. గెరిల్లా పోరాట పంథాలో జాత్యహంకార ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడడం దీని ఉద్దేశం. ఇందుకోసమే ఆయన అల్జీరియా వెళ్లి కొద్దికాలం గెరిల్లా యుద్ధతంత్రంలో శిక్షణ పొంది వచ్చారు. కానీ అక్కడ నుంచి తిరిగి వచ్చిన వెంటనే ఆగస్ట్‌ 5, 1962న మండేలాను జాత్యహంకార ప్రభుత్వం అరెస్టు చేసింది. ఆ రోజే బయటి ప్రపంచంతో ఆయన బంధం తెగిపోయింది. మళ్లీ ఆయన వెలుగు చూడడానికి 27 ఏళ్లు పట్టింది. 

విచారణ తరువాత మండేలాను జూన్‌ 12, 1964న కేప్‌టౌన్‌కు సమీపంలోని రూబెన్స్‌ ఐలెండ్‌ జైలుకు తరలించారు. ఇందులో ఆయన ఏకాంత ఖైదీ. భార్య విన్నీ మండేలాను తప్ప వేరెవరినీ ఆయనను కలుసుకోవడానికి అనుమతించలేదు. ఖైదీ నం. 46664 ముద్రతో రాళ్లు కొట్టారు. కానీ ఆ రాళ్లతో పాటు జాత్యహంకార ప్రభుత్వ ఆధిపత్యం కూడా చితికిపోతూ వచ్చిందన్నది వాస్తవం. మండేలా స్వస్థలం ట్రాన్స్‌కెయికి పరిమితమైతే విడుదల చేస్తామని ప్రభుత్వం ప్రతిపాదన పంపించింది. అందుకు మండేలా సమాధానం, ‘జాతి వివక్ష ఎన్ని రూపాల్లో ఉన్నప్పటికీ దాని అన్ని రూపాలను కూడా నేను తీవ్రంగా ద్వేషిస్తున్నాను. దీని మీద తుది వరకు పోరాడతాను.’ 1973 నుంచి 1988 వరకు కూడా ఇలాంటి ప్రతిపాదనను అంగీకరించమని ప్రభుత్వం మండేలాను బలవంత పెడుతూనే ఉండేది. మధ్యలో మాట మార్చి హింసను వీడితే విడుదల గురించి ఆలోచిస్తామని కూడా 1985లో మరో ప్రతిపాదన పంపించింది. దీనిని కూడా ఆయన అంగీకరించలేదు. ఆయన రూపం మారిపోయింది. ఆరోగ్యం క్షీణించింది. అవేమీ బయట ప్రపంచానికి తెలియకుండానే 18 ఏళ్లు గడచిపోయాయి. 1988లో క్షయ వ్యాధి సోకింది. అప్పెడు విక్టర్‌ వెర్సటర్‌ జైలుకు తరలించారు. మధ్యలో మళ్లీ పోల్స్‌మూర్‌ జైలులో కొన్నాళ్లు ఉంచారు. 
1980 నాటికి ప్రపంచంలో మండేలా విడుదలకు ఉద్యమం ప్రారంభమైంది. కానీ జాత్యహంకార ప్రభుత్వం వాటిని చెవిన పెట్టలేదు. కానీ 1990 నాటికి అధ్యక్షుడు బోథా అధ్యాయం ముగిసింది. జాత్యహంకార ప్రభుత్వం వాస్తవాలను గుర్తించక తప్పని వాతావరణంలో బోథాకు ఎఫ్‌ డబ్లు్య డీక్లార్క్‌ వారసునిగా అధ్యక్ష స్థానంలోకి వచ్చాడు. ఇతడు కొన్ని వాస్తవాలను గమనించాడని చెప్పక తప్పదు. అంతర్జాతీయ ఒత్తిడి ఎక్కువయింది. అంతర్యుద్ధ భయం పెరిగింది. దీనితో చర్చలు జరిపి మొత్తానికి మండేలాను విడుదల చేయడమే కాకుండా నల్లజాతీయులకు అధికారం అప్పగించడానికి కూడా అంగీకరించాడు డీక్లార్క్‌. అలా ప్రపంచం ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న మండేలా విడుదల సాధ్యమైంది. ఫిబ్రవరి 11, 1990 ఆయన జైలు నుంచి విముక్తి పొందారు. అంతకాలం దాదాపు రెండు దశాబ్దాల పాటు మండేలా అంటే ఒక్క ఫొటోను బట్టే తెలిసేది. కానీ ఆయన బయటకు వచ్చే సమయానికి ఆ రూపమే వేరు. 

పుట్టుకతోనే మనిషిలో ద్వేషించే గుణం ఉండదని అంటారు మండేలా. అది ఆయన ఔన్నత్యానికి నిదర్శనం. అందుకే రంగు ఏదైనా అందరికీ స్వేచ్ఛ స్వాతంత్య్రాలు ఉండాలన్నదే నా ఆకాంక్ష అన్నారాయన. ఇది ఆయన దక్షిణాఫ్రికాకు అధ్యక్షునిగా ఎన్నికైన తరువాత అన్న మాట అనుకుంటే పొరపాటు. ఆయన జైలులో మగ్గుతున్నప్పటికీ కూడా అలాంటి మాట ఆయన హృదయం పలకగలిగింది. అందుకే మండేలా మహోన్నతుడయ్యాడు. అమెరికా ఆయన మీద ఉగ్రవాది ముద్ర వేసింది. కానీ ప్రపంచం ఆ ముద్రను పట్టించుకోలేదు. ఒక పోరాట యోధునిగా, హక్కుల ఉద్యమానికి నిలువెత్తు ఆదర్శంగా గౌరవించింది. మండేలా 1994–1999 మధ్య దక్షిణాఫ్రికా అధ్యక్షునిగా పనిచేశారు. దేశంలోని నలుపు తెలుపు వర్ణాల మధ్య అంతరాలను నిర్మూలించడానికి ఆ కొద్దికాలంలోనే ఆయన కృషి చేశారు. వారి మనసుల మధ్య ఇంద్రచాపం వంటి వారథి నిర్మించడానికి తపన పడ్డారు. రగ్బీ తెల్లజాతి క్రీడ కాబట్టి దానిని దూరంగా ఉంచాలని ఉద్యమకాలంలో కొందరు గట్టిగా అభిప్రాయపడ్డారు. దానిని చాలాకాలం అమలు చేశారు. కానీ ఆ  క్రీడను తిరిగి ఆడమని అందరినీ ఆయన ప్రోత్సహించాడు. సయోధ్యకు మండేలా అనుసరించిన వ్యూహం ఇంత సున్నితంగా ఉంది. దక్షిణాఫ్రికాకు ఆయన అధ్యక్షుడైన తరువాతే తాగునీటి సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. వెనుకబాటు తెచ్చిన అనారోగ్యంతో బాధపడుతున్న తన వారి కోసం 500 ఆస్పత్రులు నిర్మించాడాయన. 15 లక్షల మంది బాలలను బడికి పంపించాడు. చిరకాలం బానిసత్వంతో మగ్గిన ఒక జాతిని పునరుజ్జీవింప చేయడానికి ఆయన చేసిన కృషి మండేలాలోని పరిపాలకుడిని, ద్రష్టనే కాకుండా ఆయనలోని నిజమైన రాజనీతిజ్ఞుడిని ఆధునిక ప్రపంచం ఎదుట ఆవిష్కరించింది. 

పదవి నుంచి దిగిపోయిన తరువాత మండేలా సేవారంగాన్ని ఎంచుకున్నారు. ఆయన కుమారుడు ఎయిడ్స్‌ వ్యాధితో మరణించాడు. అతడి జ్ఞాపకార్థం ఎయిడ్స్‌ వ్యాధి నిర్మూలన పనిని చేపట్టారు మండేలా. భార్య విన్నీ మీద అవినీతి ఆరోపణలు వచ్చాయి. ఆమెతో విడిపోయారు. తాను ఒక జాతి స్వేచ్ఛ కోసం జీవితాంతం పోరాడిన మాట నిజమే అయినా, తనకూ కొన్ని బలహీనతలు ఉన్నాయని, కాబట్టి తనను మనిషిగానే చూడాలని ఆయన సవినయంగా మనవి చేశారు. జీవితాన్ని తెరచిన పుస్తకంలా ప్రపంచం ఎదుట ఇలా ఉంచిన నేతలు నిజంగానే అరుదు. 
- డా. గోపరాజు నారాయణరావు

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement