
మండేలాకు యావత్ ప్రపంచం ఘన నివాళి
జోహాన్నెస్‌బర్గ్: జాతి వివక్షపై అలుపెరగని పోరాటం చేసిన నాటి తరం చివరి ధ్రువతార, నల్ల వజ్రం, దక్షిణాఫ్రికా ప్రథమ నల్లజాతి అధ్యక్షుడు నెల్సన్ మండేలాకు మంగళవారం యావత్ప్రపంచం ఘనంగా నివాళి అర్పించింది. మునుపెన్నడూ కనీ, వినీ ఎరగని రీతిలో 100 మంది ప్రపంచస్థాయి నాయకులు, దేశాధినేతలు ఒక్కటిగా డిసెంబర్ 5న మరణించిన ఆ మహా నాయకుడికి శ్రద్ధాంజలి ఘటించారు. చరిత్రలోనే మహోన్నత నాయకుడిగా ఆయనను కొనియాడారు. శ్వేతజాతి ప్రభుత్వ దుర్మార్గాలకు వ్యతిరేకంగా మండేలా చేసిన పోరాటంలో కీలకంగా నిలిచిన సొవెటోలోని ఎఫ్‌ఎన్‌బీ స్టేడియంలో మండేలా సంస్మరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. అదే స్టేడియంలో కొన్నేళ్లక్రితం జరిగిన సభలోనే ఆయన చివరిసారిగా ప్రజలకు కనిపించారు.
తమ ప్రియతమ నాయకుడికి నివాళులర్పించేందుకు ప్రజలు వేలాదిగా తరలివచ్చారు. కార్యక్రమంలో భగవద్గీతలోని సంస్కృత శ్లోకాలను పఠించారు. సర్వమత ప్రార్థనలు నిర్వహించారు. కార్యక్రమం జరుగుతుండగా భారీ వర్షం పడడంతో ఒక నేత ‘వర్షం ద్వారా దేవుడు మండేలాను స్వర్గంలోకి స్వాగతం పలుకుతున్నాడ’ంటూ వ్యాఖ్యానించారు.
స్ఫూర్తిదాయక నేత: సంస్మరణ కార్యక్రమంలో అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా మాట్లాడుతూ.. ‘ఒక జాతిని న్యాయం దిశగా నడిపించి, ఆ ప్రస్థానంలో విశ్వవ్యాప్తంగా కోట్లాది ప్రజలకు స్ఫూర్తినిచ్చిన మహానాయకుడికి నివాళులర్పిస్తూ ప్రశంసించాల్సి రావడం చాలా కష్టమైన విషయం’ అన్నారు. అమెరికా, దక్షిణాఫ్రికాల్లో జరిగిన జాతి వివక్ష వ్యతిరేక పోరాటాలను ప్రస్తావిస్తూ చేసిన 20 నిమిషాల ప్రసంగంలో ఒబామా పలుమార్లు భారత జాతిపిత మహాత్మాగాంధీని గుర్తు చేశారు. ‘విజయం సాధించే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని మొదట్లో అందరూ భావించిన ప్రజా ఉద్యమాన్ని గాంధీజీ వలెనే మండేలా కూడా విజయవంతంగా నడిపించారు’ అని పేర్కొన్నారు. ఐరాస ప్రధాన కార్యదర్శి బాన్ కీ మూన్, బ్రిటన్ ప్రధాని కేమరాన్, ఫ్రాన్స్ అధ్యక్షుడు హోలాండె, జింబాబ్వే అధ్యక్షుడు ముగాబే, అఫ్ఘాన్ అధ్యక్షుడు కర్జాయ్ తదితరులు మండేలాకు నివాళులర్పించారు. కాగా, మండేలా భార్య గ్రేషా మేచీల్, మాజీ భార్య విన్నీ మండేలా, ఇతర కుటుంబ సభ్యులు కార్యక్రమానికి హాజరయ్యారు. మండేలా అంత్యక్రియలను ఆయన స్వగ్రామం కునులో 15న ప్రైవేటు కార్యక్రమంగా నిర్వహించనున్నారు.
మండేలా పూజ్యనీయుడు: ప్రణబ్
భారత్ తరఫున రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ, యూపీఏ అధ్యక్షురాలు సోనియాగాంధీ, లోక్‌సభలో ప్రతిపక్ష నేత సుష్మా స్వరాజ్ సహా ఉన్నతస్థాయి ప్రతినిధి బృందం మండేలా సంస్మరణ సభలో పాల్గొంది. ఈ కార్యక్రమంలో మాట్లాడే అవకాశం లభించిన కొద్దిమంది నాయకుల్లో ప్రణబ్ ఒకరు కావడం విశేషం.
స్టేడియంలోకి భారత రాష్ట్రపతి ప్రవేశించగానే సభికులంతా లేచి నిల్చొని హర్షధ్వానాలతో ఆహ్వానం పలికారు. దక్షిణాఫ్రికా అధ్యక్షుడు జాకొబ్ జుమా పక్కనే ప్రణబ్ ఆసీనులయ్యారు. ‘క్షమ, ప్రేమల నిజమైన అర్థాన్ని ప్రపంచానికి నేర్పిన అద్భుత వ్యక్తిత్వం కలిగిన పూజ్యనీయుడు మండేలా. ఆయన వారసత్వం ప్రపంచానికి లభించిన అమూల్యమైన సంపద. తనదైన సత్యాగ్రహ పంథాలో అన్యాయానికి, అసమానతలకు వ్యతిరేకంగా పోరాడి అభివృద్ధిదాయక సామాజిక, ఆర్థిక మార్పుకు కారణమైన మహనీయుడు. ఈ శతాబ్దపు అత్యంత స్ఫూర్తిమంతమైన నేతల్లో ఆయన ఒకరు. భారతీయులం ఆయనను ఎప్పటికీ అభిమానిస్తూనే ఉంటాం. మా దేశంతో ఆయనకున్న ప్రేమ, స్నేహానుబంధం మేమెన్నటికీ మరచిపోం. మండేలా ఆత్మకు శాంతి కలగాలి’ అని ప్రణబ్ తన సందేశంలో పేర్కొన్నారు. దారుణమైన పీడన మధ్య అహింసాయుతంగా తన ఉద్యమాన్ని మండేలా గొప్పగా కొనసాగించారని ప్రణబ్ ప్రశంసించారు. దక్షిణాఫ్రికా, భారత్‌ల మధ్య ఉన్న బలమైన బంధాలను ఈ సందర్భంగా ప్రణబ్ ప్రస్తావించారు. ‘మహాత్మాగాంధీ తన రాజకీయ ఉద్యమ ప్రస్థానాన్ని ఇక్కడే ప్రారంభించార’ని గుర్తుచేశారు. ‘మండేలా పట్టుదల, ఓర్పు, అహింసాయుత పోరాటం, అసమాన వ్యక్తిత్వం మాకు గాంధీజీని గుర్తుకు తెస్తాయి. అందుకే భారతదేశ అత్యున్నత పౌర పురస్కారమైన భారత రత్నను ఆయనకు అందించి మమ్మల్ని మేము గౌరవించుకున్నాం’ అన్నారు. 1995లో భారత పర్యటనకు వచ్చినప్పుడు మండేలా సబర్మతి ఆశ్రమాన్ని సందర్శించారని, అప్పుడు సొంత ఇంటికి వచ్చినట్టుగా ఉందని వ్యాఖ్యానించారని ప్రణబ్ గుర్తుచేశారు.