ఆరిపోయిన ఆఫ్రికన్ సెర్చ్‌లైట్... | African searchlights extinguished ... | Sakshi
Sakshi News home page

ఆరిపోయిన ఆఫ్రికన్ సెర్చ్‌లైట్...

Published Sun, Jan 26 2014 11:16 PM | Last Updated on Tue, Oct 2 2018 8:39 PM

ఆరిపోయిన ఆఫ్రికన్ సెర్చ్‌లైట్... - Sakshi

ఆరిపోయిన ఆఫ్రికన్ సెర్చ్‌లైట్...

2010లో దక్షిణాఫ్రికాలో జరిగిన ఫుట్‌బాల్ ప్రపంచకప్‌లో డ్యూమర్ హడావుడి అంతా ఇంతా కాదు. జర్నలిస్ట్‌గా ఇతడు ఆఖరిసారి కవరేజ్ చేసిన అతి పెద్ద కార్యక్రమం నెల్సన్‌మండేలా అంత్యక్రియలు.
 
 చీకటి ఖండంలోని పరిస్థితుల పరిశోధనకై వెలిగిన సెర్చ్‌లైట్ లాంటి వ్యక్తి కొమ్లా డ్యూమర్. ఆఫ్రికన్ దేశాలకు సంబంధించిన రాజకీయ, ఆర్థిక, సామాజిక, క్రీడా విశేషాలను ప్రపంచానికి వివరించే కార్యక్రమం ‘ఫోకస్ ఆన్ ఆఫ్రికా’. బీబీసీ వరల్డ్ న్యూస్‌లో ప్రైమ్‌టైమ్‌లో ప్రసారం అవుతూ వచ్చిన ఈ కార్యక్రమపు ప్రెజెంటర్‌గా పేరు పొందిన వ్యక్తి డ్యూమర్.  ఇటీవలే డ్యూమర్ అనే ఆ వెలుగు ఆరిపోయింది. 41 యేళ్ల వయసులోనే డ్యూమర్ గుండెపోటుతో లండన్‌లోని తన నివాసంలో మరణించాడు. ఈ సందర్భంగా ఆయన ప్రస్థానం గురించి...
 
 అట్లాంటిక్ తీర ప్రాంతంలో ఉంటుంది ఘనాదేశం. ఈ దేశం ఆఫ్రికా తరపు వాయిస్ వినిపించడానికి గొప్ప బహుమతులనే ఇచ్చింది. అలాంటి బహుమతుల్లో డ్యూమర్ ముఖ్యుడు. ఇంతకుముందు ఐక్యరాజ్యసమితి అధ్యక్షుడిగా ఉన్న కోఫీ అన్నన్ కూడా ఘనా దేశానికి చెందినవాడే. ఆ తర్వాత ఆ దేశంలో మంచి గుర్తింపు సంపాదించుకొన్న వ్యక్తి డ్యూమర్. ఘనా దేశంలో ఒక విద్యాధికుల కుటుంబంలో జన్మించాడు డ్యూమర్. ఇతడి తండ్రి సోషియాలజీలో ప్రొఫెసర్, తల్లి మాస్ కమ్యూనికేషన్‌లో మాస్టర్‌‌స డిగ్రీ చేశారు. అంతకన్నా ముందు వారిని పరిశీలిస్తే ఘనాదేశపు జాతీయగీతాన్ని రచించిన ఫిలిప్ బె హో డ్యూమర్ వాళ్ల తాతగారే. ఈ విధంగా డ్యూమర్ కుటుంబ నేపథ్యం ఆయన జర్నలిస్టు కావడానికి కారణం అయ్యింది. మొదట ఘనా తర్వాత నైజీరియాలలో చదువుకొన్న డ్యూమర్ ఆ తర్వాత అమెరికాలోని హార్వర్డ్ యూనివర్సిటీలో సీటు సంపాదించాడు. అక్కడ ఎమ్‌ఏ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పూర్తి చేశాడు.
 
భిన్నమైన రంగంలోకి: చదివింది పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్.. ప్రవేశించింది కమ్యూనికేషన్ రంగం, గుర్తింపు తెచ్చుకొంది న్యూస్ ప్రెజెంటర్‌గా. ఇలా భిన్నమైన రీతిలో జరిగింది డ్యూమర్ పయనం. ఘనాలోని తన సొంతూరిలో ‘జాయ్ ఎఫ్‌ఎమ్’లో మార్నింగ్ షోకి హోస్ట్ చేయడంతో డ్యూమర్‌కు గుర్తింపు దక్కింది. ఘనా జర్నలిస్ట్ అసోసియేషన్ అప్పట్లోనే డ్యూమర్‌కు ఉత్తమ ప్రెజెంటర్ అవార్డును కూడా ఇచ్చింది. ఆ గుర్తింపుతో బీబీసీ వారి ఆఫ్రికా విభాగంలో ప్రవేశం దక్కింది. బీబీసీ రేడియోతో మొదలైన డ్యూమర్ ప్రస్థానం బీబీసీ వరల్డ్ న్యూస్ చానల్‌లో కీలక స్థానం వరకూ సాగింది.
 
కీలక సంఘటనలకు వ్యాఖ్యాత: బీబీసీలో ఆఫ్రికా అనగానే... డ్యూమర్ పేరు ప్రస్తావించే దశకు ఆయన ఎదిగారు. వచ్చింది. కోఫీ అన్నన్, బిల్‌గేట్స్ వంటి ప్రముఖులతో ప్రత్యేకమైన ఇంటర్వ్యూలు చేశాడు. అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ఆఫ్రికాలో పర్యటించినప్పుడు ఆయన వెంట ఉన్నవారిలో డ్యూమర్ కూడా ఒకరు. 2010లో దక్షిణాఫ్రికాలో జరిగిన ఫుట్‌బాల్ ప్రపంచకప్‌లో డ్యూమర్ హడావిడి అంతా ఇంతా కాదు. జర్నలిస్ట్‌గా ఇతడు ఆఖరిసారి కవరేజ్ ఇచ్చిన ప్రముఖ  కార్యక్రమం నెల్సన్‌మండేలా అంత్యక్రియలు.
 
 ప్రభావవంతమైన ఆఫ్రికన్: ఆఫ్రికా పరిస్థితుల గురించి అవగాహనతో, ఆఫ్రికా అంటే అభిమానంతో ఆ ప్రాంతంలోని వార్తలను పాశ్చాత్య ప్రపంచానికి ప్రెజెంట్ చేసే డ్యూమర్ అంటే ఆఫ్రికన్లకు ప్రత్యేక అభిమానం. యూరప్‌లోని ఆఫ్రికన్‌లలో డ్యూమర్ కు ఫ్యాన్‌ఫాలోయింగ్ ఏర్పడింది. ఈ నేపథ్యంలో 2013లో ఎంపిక చేసిన ‘అత్యంత ప్రభావాత్మక ఆఫ్రికన్లు-100’ జాబితాలో డ్యూమర్‌కు స్థానం దక్కింది. అంతలోనే డ్యూమర్ మరణించడం విషాదం.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement