నింగికెగిసిన మరో దిగ్గజం
నింగికెగిసిన మరో దిగ్గజం
Published Tue, Mar 28 2017 12:52 PM | Last Updated on Wed, Apr 3 2019 8:07 PM
- మండేలా సన్నిహితుడి కన్నుమూత
జొహన్నెస్‌బర్గ్: నల్లజాతి సూరీడు నెల్సన్ మండేలా సన్నిహితుడు, వర్ణవివక్షపై పోరాడిన భారతీయ ఆఫ్రికన్ అహద్ కత్రాడా(87) కన్నుమూశారు. ఆయన జొహన్నెస్‌బర్గ్‌లోని డొనాల్డ్‌గోర్డాన్ ఆస్పత్రిలో సోమవారం కన్నుమూశారని సన్నిహితులు తెలిపారు. దక్షిణాఫ్రికా శ్వేత జాతీయుల పాలనకు వ్యతిరేకంగా పోరాడినందుకు గాను నెల్సన్ మండేలాతోపాటు మరో ముగ్గురిపై 1964లో జరిగిన చారిత్రక రివోనియా విచారణలో కత్రాడాపై జీవిత ఖైదు విధించారు. ఆ ముగ్గురిలో కత్రాడా ఒకరు కాగా అండ్రూ మ్లాంగెనీ, డెనిస్ గోల్డ్‌బెర్గ్ అనే వారున్నారు. వీరంతా రోడెన్‌దీవిలో కఠిన కారాగార శిక్ష అనుభవించారు. వీరు అక్కడే 18 ఏళ్లు జైలు జీవితం గడిపారు. దీంతో కలిపి మొత్తం ఆయన 26 సంవత్సరాల మూడు నెలలు కారాగార వాసం చేశారు.
జైలులో ఉండగానే ఆయన నాలుగు డిగ్రీలు పొందారు. నెల్సన్ మండేలాకు ఎంతో సన్నిహితుడిగా కత్రాడాను చెప్పుకుంటారు. కత్రాడాను తన పెద్ద సోదరునిగా మండేలా చెబుతుండేవారు. కత్రాడా మృతి ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్ (ఏఎన్‌సీ)కు తీరని లోటని పార్టీ ఒక ప్రకటనలో తెలిపింది. అపార్థీడ్(వర్ణవివక్ష) అనంతరం దక్షిణాఫ్రికాకు మొదటి అధ్యక్షుడుగా నెల్సన్‌మండేలా బాధ్యతలు చేపట్టే క్రమంలో కత్రాడా కృషి కూడా ఉంది. ప్రవాస భారతీయ కుటుంబంలో 1929లో దక్షిణాఫ్రికాలో జన్మించిన కత్రాడా చిన్న వయస్సు నుంచే వర్ణవివక్షపై పోరాటాల్లో పాల్గొన్నారు. దక్షిణాఫ్రికాలోని భారతీయులను తక్కువ చూడటంపై జరిగిన పోరాటంలో ఆయన జైలు జీవితం కూడా అనుభవించారు. ఆయన భార్య బార్బరా హొగన్ కూడా ఏఎన్‌సీలో చురుగ్గా పనిచేశారు. తన రాజకీయ పోరాట అనుభవాలపై కత్రాడా 6 పుస్తకాలు రాశారు. భారత ప్రభుత్వం 2005లో ప్రవాసీ భారతీయ సమ్మాన్ అవార్డుతో కత్రాడాను గౌరవించింది.
Advertisement