మండేలా.. మాలోనే ఉన్నావు
స్వగ్రామం కునులో మండేలాకు అంత్యక్రియలు
అశ్రునయనాలతో మహాత్ముడికి తుది వీడ్కోలు
తరలివచ్చిన 4,500 మంది ప్రముఖులు
మండేలా కలగన్న ఆశయాలను సాధిస్తాం: జాకబ్‌జుమా
కును: బాల్యంలో ఆటలాడి, అల్లరిచేసి, స్నేహితులతో మధుర క్షణాలను పంచుకున్న నల్లజాతీయుల దేవుడు.. అదే నేలపై అంతిమ వీడ్కోలు తీసుకున్నాడు. కుటుంబ సభ్యులు, స్నేహితులు, ఆత్మీయుల అశ్రునయనాల మధ్య.. సైనిక దళాల గౌరవ వందనాల నడుమ అధికారిక లాంఛనాలతో దక్షిణాఫ్రికాలోని కును గ్రామంలో నెల్సన్ మండేలాకు ఆదివారం అంత్యక్రియలు జరిగాయి. మండేలా భౌతికకాయాన్ని ఉంచిన శవపేటికను కుటుంబ సభ్యులు, అతిథులు వెంటరాగా.. ఇంటి నుంచి సమాధి చేసే స్థలం వరకూ తీసుకెళ్లారు. థెంబు తెగ ప్రజల మత సంప్రదాయాలను అనుసరించి సమాధి చేశారు. భౌతికంగా దక్షిణాఫ్రికన్లను వీడినా.. వారి మనసుల్లో తాను మిగిల్చి వెళ్లిన స్ఫూర్తి రూపేణా మండేలా సజీవులై ఉన్నారు. మండేలా అనారోగ్యంతో ఈ నెల 5న తుదిశ్వాస విడిచిన విషయం తెలిసిందే.
కొండ ప్రాంతం కునులో అంత్యక్రియలు జరిగే స్థలం వరకూ దారికి ఇరువైపులా సైనికులు గౌరవ వందనాలు సమర్పిస్తుండగా.. మండేలా అంతిమ యాత్రలో గిరిజన నేతలు, దేశ విదేశాల నుంచి వచ్చిన ప్రముఖులు పాల్గొన్నారు. మండేలా 95 ఏళ్ల వయసుకు గుర్తుగా ఒక్కో ఏడాదికి ఒక్కో కొవ్వొత్తి చొప్పున 95 కొవ్వొత్తులను వెలిగించి నివాళులర్పించారు. మారుమూల కొండ ప్రాంతం కావడంతో కేవలం 4,500 మందిని మాత్రమే మండేలా అంత్యక్రియలకు దక్షిణాఫ్రికా ప్రభుత్వం అనుమతించింది. మండేలా చివరి భార్య గ్రెకామాచెల్, మాజీ భార్య విన్నీ, ఇతర కుటుంబ సభ్యులు సహా మొత్తం మీద 450 మందినే సమాధి స్థలం వరకు అనుమతించారు.
మీ అడుగుజాడల్లో నడుస్తాం..
స్మారక కార్యక్రమంలో దక్షిణాఫ్రికా అధ్యక్షుడు జాకబ్ జుమా మాట్లాడుతూ.. మండేలా ఆశయాలైన పేదరిక నిర్మూలన, నిరుద్యోగ-నేరరహిత దక్షిణాఫ్రికా సాధన కోసం కృషి చేస్తామని ప్రకటించారు. మీ(మండేలా) తుది అడుగుజాడల్లో దక్షిణాఫ్రికా ముందుకు వెళుతుందని హామీ ఇస్తున్నట్లు పేర్కొన్నారు. భారత సంతతికి చెందిన దక్షిణాఫ్రికా పౌరుడు, ఉద్యమకారుడు, రాబెన్ ఐలాండ్ కారాగారంలో మండేలాతో కలిసి కారాగారవాసం చేసిన అహ్మద్‌కత్రదా మాట్లాడుతూ.. మండేలా దక్షిణాఫ్రికా ప్రజలతోపాటు ప్రపంచమంతటినీ చరిత్రలో అంతకుముందెన్నడూ లేని విధంగా ఐక్యంగా నిలిపారని ప్రస్తుతించారు. బ్రిటన్ యువరాజు చార్లెస్, ఇరాన్ ఉపాధ్యక్షుడు మొహమ్మద్ షారియత్‌మదారి, పలు ఆఫ్రికా దేశాల అధ్యక్షులతోపాటు ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల అగ్రనేతల తరఫున ప్రతినిధులు, టాక్ షో వ్యాఖ్యాత ఓఫ్రా విన్‌ఫ్రే కూడా అంత్యక్రియలకు హాజరయ్యారు.