అంతర్జాతీయం | International news | Sakshi
Sakshi News home page

అంతర్జాతీయం

Published Wed, Apr 30 2014 10:02 PM | Last Updated on Thu, Jul 11 2019 5:01 PM

అంతర్జాతీయం - Sakshi

అంతర్జాతీయం

హతాఫ్ -3 క్షిపణిని పరీక్షించిన పాకిస్థాన్
 అణుసామర్థ్యం ఉన్న క్షిపణి హతాఫ్-3ని పాకిస్థాన్ ఏప్రిల్ 22న విజయవంతంగా ప్రయోగించింది. 200 కిలోమీటర్ల పరిధి ఉన్న ఈ క్షిపణి ఉపరితలం నుంచి ఉపరితలంలోని లక్ష్యాలను ఛేదిస్తుంది. సైన్యంలోని వ్యూహాత్మక దళాల కమాండ్ శిక్షణలో భాగంగా ఈ పరీక్ష నిర్వహించింది. భారత్‌లోని పలు ప్రాంతాలు ఈ క్షిపణి పరిధిలోకి వస్తాయి.
 
 కొత్త ఖనిజాన్ని గుర్తించిన ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు
 పశ్చిమ ఆస్ట్రేలియాలో కొత్త ఖనిజాన్ని శాస్త్రవేత్తలు గుర్తించినట్లు అడిలైడ్‌కు చెందిన మినరలాజికల్ మ్యాగజీన్ ఏప్రిల్ 21న తెలిపింది. నిర్మాణం, కూర్పులో ప్రత్యేకత కలిగిన ఆ ఖనిజానికి పుట్నిసైట్ అని పేరుపెట్టారు. ఈ పుట్నిసైట్‌లో స్టోంటియం, కాల్షియం, క్రోమియం, సల్ఫర్, కార్బన్, ఆక్సిజన్, హైడ్రోజన్ మూలకాలు ఉన్నాయి. ప్రపంచంలో ఇప్పటి వరకు 400 ఖనిజ రకాలను గుర్తించారు.  
 
 బీజింగ్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఉత్తమ చిత్రంగా సిద్దార్థ్
 హిందీ చిత్రం సిద్దార్థ్ బీజింగ్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఉత్తమ చిత్రంగా ఎంపికైంది. ఈ చిత్రానికి ఇండియన్ కెనడియన్ రిచీ మెహతా దర్శకత్వం వహించారు. తప్పిపోయిన కొడుకు కోసం తండ్రి వెతకడం అనే ఇతివృత్తంతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. 88 దేశాల నుంచి వచ్చిన 837 చిత్రాలతో పోటీ పడిన సిద్దార్థ్ ఉత్తమ చిత్రంగా నిలిచింది.
 
 దక్షిణ కొరియా ప్రధాని చుంగ్ హాంగ్ వాన్ రాజీనామా
 ప్రయాణికుల నౌక మునిగిపోయిన దుర్ఘటనతో కలత చెందిన దక్షిణ కొరియా ప్రధానమంత్రి చుంగ్ హాంగ్ వాన్  ఏప్రిల్ 27న పదవికి రాజీనామా చేశారు. ప్రయాణికులను రక్షించడంలో ప్రభుత్వం సరిగా స్పందించలేదని ప్రజల నుంచి ఆగ్రహం వ్యక్తమైంది. సహాయ చర్యలు సమర్థంగా నిర్వహించలేకపోయామని ప్రధాని అంగీకరించారు. దక్షిణకొరియా దక్షిణ తీరంలో ఏప్రిల్ 16న నౌక మునిగిపోయి 300 మంది గల్లంతయ్యారు. మొత్తం 459 మంది నౌకలో ప్రయాణిస్తున్నారు. అందులోని వారంతా విహారయాత్రకు వెళ్లిన విద్యార్థులు.
 
 ప్రభావితం చేయగల వ్యక్తుల్లో మోడీ, కేజ్రీవాల్, అరుంధతి రాయ్‌కి స్థానం
 2014 సంవత్సరానికి ప్రపంచంలో అత్యంత ప్రభావితం చేయగల 100 మంది జాబితాను టైమ్ మ్యాగజీన్ ఏప్రిల్ 25వ సంచికలో ప్రచురించింది. ఈ 100 మందిలో భారత్ నుంచి నరేంద్ర మోడీ, ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు అరవింద్ కేజ్రీవాల్, నవలాకారిణి అరుంధతీ రాయ్‌లకు చోటు దక్కింది. వీరితో పాటు కొయంబత్తూర్‌కు చెందిన ఆరోగ్య ప్రచారకర్త అరుణాచలమ్ మురుగనాథమ్ కూడా ఈ జాబితాలో ఉన్నారు.

 టైమ్ మ్యాగజీన్ జాబితాలో అమెరికా అధ్యక్షుడు ఒబామా, చైనా అధ్యక్షుడు జిన్ పింగ్, ముఖచిత్రంగా ప్రచురితమైన గాయకురాలు బియోన్‌‌స, అమెరికా విదేశాంగ మంత్రి జాన్ కెర్రీ, అమెరికా మాజీ విదేశాంగ మంత్రి హిల్లరీ క్లింటన్, పాకిస్తాన్ బాలికల విద్య ప్రచార కార్యకర్త మలాలా యూసఫ్ జాయ్, విజిల్ బ్లోయర్ ఎడ్వర్‌‌డ స్నోడన్, జపాన్ ప్రధానమంత్రి షింజో అబె ఉన్నారు.

 దక్షిణ ఆఫ్రికాలో బహుళ జాతి ప్రజాస్వామ్యానికి 20 ఏళ్లు
 దక్షిణ ఆఫ్రికాలో బహుళ జాతి ప్రజాస్వామ్యానికి ఏప్రిల్ 27 నాటికి 20 ఏళ్లు పూర్తయ్యాయి. 27న ఫ్రీడమ్ డే ని జరుపుకున్నారు. మండేలా లేకుండా తొలిసారి ఫ్రీడమ్ డే జరిగింది. జాత్యహంకార వ్యతిరేక పోరాట యోధుడు మండేలా 95 ఏళ్ల వయసులో 2013 డిసెంబర్‌లో మరణించారు. 20 ఏళ్ల క్రితం దేశంలో అన్ని జాతులు తొలిసారి ప్రజాస్వామ్యయుతంగా జరిగిన ఎన్నికల్లో పాల్గొన్నాయి. ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్ (ఏఎన్‌సీ) అధికారంలోకి వచ్చింది. నెల్సన్ దేశ తొలి నల్లజాతి అధ్యక్షుడిగా అధికారం చేపట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement