ఎవరు మనకు ఆదర్శం? | who is inspiration ?..... | Sakshi
Sakshi News home page

ఎవరు మనకు ఆదర్శం?

Published Sun, Jan 10 2016 12:58 AM | Last Updated on Thu, Jul 11 2019 5:01 PM

ఎవరు మనకు ఆదర్శం? - Sakshi

ఎవరు మనకు ఆదర్శం?

విద్య - విలువలు

 ఒక వ్యక్తి గొప్పవాడవడం, సంస్కారవంతుడవడం అనేది మరొకరి బోధనల వల్ల ఉండదు. మీ అంతట మీరు కమిట్ (కట్టుబడి ఉండడం) కావడం మీద ఉంటుంది. నేను ఫలానావాడిని ఆదర్శవంతంగా తీసుకున్నానని అంటూంటారు. ఎందుకంటే నిర్భయత్వం, అధైర్యం ఈ రెండు మాటల మధ్య ఉన్న సున్నితమైన సరళరేఖను పట్టుకోవడం దగ్గర వారి అవసరం ఉంటుంది. మీరు ఆదర్శంగా ఎవరిని తీసుకుంటారో, వారి ప్రభావం వల్ల మాత్రమే చెక్కుచెదరని మనస్తత్వంతో మీరు నిలబడగలుగుతారు.
 
 నెల్సన్ మండేలా గురించి వినే ఉంటారు. జోహాన్నెస్ బర్గ్ దగ్గర మూడు శిఖరాలున్నాయి. వాటికి దూరంగా రాబిన్‌దీవి ఉంటుంది. మాజీ రాష్ట్రపతి కలాం గారు కూడా వెళ్లివచ్చారు ఒకసారి. అక్కడ నిర్మానుష్యం. చుట్టూ సముద్రం... దాని ఘోష తప్ప మరేమీ కనబడని, వినబడని చోట మీతో మాట్లాడడానికి మరో వ్యక్తి ఉండడు. ప్రపంచం ఏమైపోతున్నదో తెలిసే అవకాశం లేదు. అక్కడ ఆరడుగుల నెల్సన్ మండేలాను ఐదడుగుల గదిలో బంధించారు. కాళ్లు కూడా పూర్తిగా చాపుకోవడానికి అవకాశం లేని ఆ గదిలో మలమూత్ర విసర్జనకు ఏ సదుపాయం లేదు.
 
  మరునాడు ఒక వ్యక్తి వచ్చి తీస్తాడు. అప్పటిదాకా అంతే! అలా ఎన్ని రోజులు... 26 సంవత్సరాలున్నాడు. మా దేశానికి స్వాతంత్య్రం తీసుకురావాలన్న దీక్షతో పెద్దలు కన్న కలలు నెరవేరాలని ఉన్నాడు. చిన్న చిన్న కాగితాల్లో ఏదో రాసుకుంటున్నాడని బయట విపరీతమైన ఎండ ఉన్నప్పుడు వెలుగులోకి, బాగా వెలుతురులోంచి చీకటిలోకి తీసుకెళ్లేవారు. దానితో ఆయన కంటి దృష్టిపోయింది. అయినా నా అన్న వారిని చూడకుండా, జీవితంలో ఏ సుఖాన్ని అనుభవించకుండా, అలా 26 ఏళ్లున్నాడు. ఏనాడూ నన్ను విడిచిపెట్టమని అడగలేదు. నా పోరాటం ఆపేస్తానని అనలేదు, జాతి వివక్షకు వ్యతిరేకంగా తన పోరాటాన్ని అపలేదు. అలాగే గడిపాడు.
 
  26 ఏళ్ల తర్వాత వారికి స్వాతంత్య్రం వచ్చింది. ఆయన రాష్ట్రపతి పదవిలోకి రాగానే ఆయన బాధపెట్టినవారి మీద కక్ష పెట్టుకోలేదు. అధికారంలో వాళ్లను కూడా భాగస్వాములను చేశాడు.
 కమిట్‌మెంట్ అంటే అది. ఆదర్శంగా తీసుకోవాల్సింది అటువంటి వాటిని. సంస్కారం, ఆరోగ్యవంతమైన భయం, ఆదర్శం అనేవి ఏదో పద్యం బట్టీ కొట్టినట్లు ఉచ్చరిస్తే రావు.
 
 నాకు విశాఖపట్నంలో ఒక వ్యక్తి తారసపడ్డాడు. అతను ప్రతిరోజూ రాత్రి ఒంటిగంటకు నిద్రలేస్తాడు. స్నానం చేసి ఆవుపాలు తెచ్చి మరగబెడతాడు. అందులో సుగంధ ద్రవ్యాలు వేస్తాడు. అది పట్టుకుని ఎంత జోరుగా వాన కురుస్తున్నా, చలి కోసేస్తున్నా, ఒక స్నేహితుడి మోటార్‌సైకిల్ మీద తాటిచర్లపాలెం నుంచి సింహాచలం కొండమీదికెళ్తాడు. తెల్లవారుఝామున నాలుగు గంటలకు సుప్రభాతం చదివే సమయానికి గోరువెచ్చటిపాలు సింహాద్రీశుడికిస్తాడు.
 
  ఎందుకిలా చేస్తున్నావని అతన్నడిగా. ‘‘సార్ ! ఎప్పుడో మీ ఉపన్యాసం విన్నాను. ఒకప్పుడు 30 లీటర్ల పాలు సింహాద్రి అప్పన్నకు నైవేద్యం పెట్టేవారనీ, ఇప్పుడు శేరుపాలు కూడా పెట్టడం లేదని మీరు చెప్పిన విషయం విని నాకు బాధేసింది. అప్పటినుంచి కొన్ని సంవత్సరాలుగా రోజూ శేరు ఆవుపాలు కొని ఇదిగో ఇలా పట్టుకెడుతున్నానన్నాడు. మరి దీనికి డబ్బులెలా అంటే పనిచేస్తే నాకు రు.3 వేలు వస్తుంది. దానితో నా జీవితం నడిచిపోతుంది. మా స్నేహితుల నుంచి ఆరువేల రూపాయలు పోగు చేస్తా. వాటితో ఇలా నా జీవితానికి ఒక ప్రయోజనం కల్పించుకున్నా’ అన్నాడు. ఒక్కమాట విన్నాడు. తన జీవితాన్ని ఎలా మలిచేసుకున్నాడో చూడండి.
 
  ఇన్ని ఎకరాలున్న స్వామివారు పొద్దున తాగడానికి ఆవుపాలు లేవన్న దరిద్రం లేకుండా వాటిని తను స్వయంగా ఎన్ని ప్రతికూల పరిస్థితులెదురైనా వెరవకుండా పట్టుకెడుతున్నాడు. కమిట్‌మెంట్ అంటే అది. ఆదర్శంగా తీసుకోవాల్సింది  ఇటువంటి వాటిని. మీరు విద్యార్థికానీయండి, అన్న, తండ్రి, పౌరుడు... ఇలా ఏదయినా కానీయండి. మీకు గొప్ప వికసనాన్ని తీకువచ్చేది, మీకూ, దేశానికీకూడా గౌరవం తీసుకువచ్చేది సంస్కార వైభవం. అందుకే చదువుతో పాటు సంస్కారమూ నేర్చుకోండి.
 చెప్పడం సులభం. ఆచరించడం చాలా కష్టం. అలా ఆచరించడానికి అవసరమైన నైతికబలం ఎక్కడ లభిస్తుందో తెలుసా...పెద్దలు చెప్పిన మాటమీద గౌరవం చూపడంతో వస్తుంది.
 
 
 ఒక ఐఏఎస్ అధికారి ఉండేవారు. ఒకప్పుడు ఆయన నేను పనిచేస్తున్న సంస్థలో సీనియర్ మేనేజర్‌గా పనిచేశారు. ఆయన ప్రతిరోజూ లంచ్ బ్రేక్‌లో భోజనం చేసిన వెంటనే ఓ పది నిముషాలు ఎవ్వరితో మాట్లాడకుండా భగవద్గీతలో ఏదో ఒక శ్లోకాన్ని తీసుకుని చదివి వ్యాఖ్యానం చేసేవారు. అలా ఎందుకని అడిగితే ఓ మారు ఆయనేమన్నారంటే - ‘‘నేను ఒక ఫైలుమీద సంతకం చేస్తే అది కొన్ని వందలమంది భవిష్యత్తుని నిర్ణయిస్తుంది. వారి కష్టసుఖాలు నిర్ణయిస్తుంది.
 
  ఆ పదవిలో కూర్చున్న నేను దానికి తగిన యోగ్యత పొందుతున్నానా లేదా అన్నది జ్ఞాపకం చేసుకోవడానికి అన్నంతోపాటు భగవద్గీత కూడా పుచ్చుకుంటాను. ఆరోగ్యవంతమైన భయాన్ని, కుర్చీలో ఉన్న నా అధికారాన్ని నిలుపుతాను’’ అన్నారు. ఆయన పనిచేసిన కాలం మా సంస్థకు స్వర్ణయుగం. అదీ సంస్కారం. చదువు పక్కన అది అలా ఉండాలి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement