
మండేలాకు పార్లమెంట్ నివాళి
ఢిల్లీ : నల్లజాతి సూర్యుడు, ఆఫ్రికా మాజీ అధ్యక్షుడు నెల్సన్ మండేలాకు పార్లమెంట్ ఉభయ సభలు ఘనంగా నివాళులు అర్పించాయి. ఈ సందర్భంగా లోక్సభలో మండేలా సేవలను సభ్యులు గుర్తు చేసుకున్నారు. కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే మాట్లాడుతూ జాతి వివక్షపై జైలు నుంచే మండేలా పోరాడారని పేర్కొన్నారు. ఆయన సేవలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం 1990లో భారతరత్నతో గౌరవించిందని షిండే గుర్తు చేశారు. భారతీయ జనతా పార్టీ తరపును ఆపార్టీ నేత సుష్మా స్వరాజ్ మండేలాకు నివాళులు అర్పించారు.
28 ఏళ్లు జైలులో గడపటం చిన్న విషయం కాదని, మహాత్మాగాంధీ ప్రేరణతో మండేలా పోరాటం చేశారని ఆమె అన్నారు. ఎస్పీ అధినేత ములాయం సింగ్ యాదవ్ మాట్లాడుతూ మహాత్మాగాంధీ చూపిన మార్గంలో మండేలా పయనించి జాతి వివక్షపై పోరాటం చేశారన్నారు. రాజ్యసభ కూడా మండేలాకు ఘనంగా నివాళులు అర్పించింది. అనంతరం సభ సోమవారానికి వాయిదా పడింది. నెల్సన్ మండేలా గురువారం అర్థరాత్రి మృతి చెందిన విషయం తెలిసిందే.