బెల్గాంలో అసెంబ్లీ సమావేశాలు పూర్తి
= గురువారమే సొంత నియోజకవర్గాలకు పలువురు ఎమ్మెల్యేలు
= ఆట విడుపుగా మరికొందరు గోవాకు
= శుక్రవారం సభలో దాదాపు సీట్లు ఖాళీ
= మండేలాకు నివాళులర్పించి.. సభలు వాయిదా
= సమావేశాలు అర్థవంతంగా జరిగాయని స్పీకర్, చైర్మన్ సంతృప్తి
సాక్షి ప్రతినిధి, బెంగళూరు : బెల్గాంలో పది రోజుల పాటు సాగిన శాసన సభ శీతాకాల సమావేశాలు శుక్రవారం ముగిశాయి. అనంతరం ఉభయ సభలు నిరవధికంగా వాయిదా పడ్డాయి. గురువారమే చాలా మంది శాసన సభ్యులు తట్టా బుట్టా సర్దుకుని సొంత నియోజక వర్గాలకు వెళ్లిపోయారు. కొందరు ఆట విడుపుగా సమీపంలో ఉన్న గోవాకు వెళ్లారు. వారాంతాన్ని అక్కడే గడిపి సోమవారం సొంత ఊర్లకు తిరిగి వెళ్లనున్నారు. శుక్రవారం ఉభయ సభలు కొద్ది సేపు సమావేశమై దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు నెల్సన్ మండేలాకు ఘన నివాళులు అర్పించాయి. అనంతరం స్పీకర్ కాగోడు తిమ్మప్ప, శాసన మండలి చైర్మన్ డీహెచ్. శంకరమూర్తిలు సభలను వాయిదా వేశారు. 2006లో బెల్గాంలో తొలిసారి శాసన సభ సమావేశాలు జరిగాయి. ప్రస్తుతం నాలుగో సారి నిర్వహించారు.
నల్ల సూరీడు
జోహన్నెస్‌బర్గ్‌లో గురువారం రాత్రి తుది శ్వాస విడిచిన నెల్సన్ మండేలాను ఉభయ సభలు నల్ల సూరీడుగా అభివర్ణించాయి. జాత్యహంకారంపై అవిశ్రాంత పోరాటం చేశారని శ్లాఘించాయి. శాసన సభలో కాగోడు తిమ్మప్ప, మండలిలో శంకరమూర్తిలు సంతాప తీర్మానాలను ప్రవేశ పెట్టారు. ప్రజాస్వామ్యం, మానవ హక్కులు, శాంతి రంగాలతో పాటు అస్పృశ్యతను నిర్మూలించడానికి ఆయన అందించిన సేవలను స్పీకర్ గుర్తు చేశారు.
శాసన సభ వ్యవహారాల శాఖ మంత్రి టీబీ. జయచంద్ర మాట్లాడుతూ దక్షిణాఫ్రికా రాజ్యాంగ నిర్మాణం, భూసంస్కరణలు, దారిద్య్ర నిర్మూలన పథకాలను ఆయన అమలు చేశారని శ్లాఘించారు. 27 ఏళ్ల పాటు జైలులో మగ్గి బయటకు వచ్చిన అనంతరం జాత్యహంకార ప్రభుత్వాన్ని ఇంటికి సాగనంపారని తెలిపారు. ఉభయ సభల్లో ప్రతిపక్ష నాయకులు హెచ్‌డీ. కుమారస్వామి, డీవీ. సదానందగౌడలు మాట్లాడుతూ వంశ పారంపర్య పాలనను అంతమొందించినందుకు ప్రపంచ వ్యాప్తంగా ఆయన మన్ననలు అందుకున్నారని కొనియాడారు. మంత్రులు వీ. శ్రీనివాస ప్రసాద్, హెచ్‌సీ. మహదేవప్ప, దినేశ్ గుండూరావులతో పాటు ప్రతిపక్షాలకు చెందిన యడ్యూరప్ప, జగదీశ్ శెట్టర్, సీటీ. రవి, కేఎస్. పుట్టనయ్య, అశోక్ ఖేణి, వైఎస్‌వీ. దత్తా, కే. శివమూర్తిలు వివిధ రంగాలకు మండేలా అందించిన సేవలను స్మరించుకున్నారు.
తీపి-చేదుల మిశ్రమం
బెల్గాం కర్ణాటకలో అంతర్భాగమని చాటి చెప్పడానికి ఏటా ఒక సారి అక్కడ శాసన సభ సమావేశాలను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ దఫా జరిగిన సమావేశాలు ప్రభుత్వానికి తీపి-చేదు మిశ్రమంగా నిలిచాయి. తొలి రెండు రోజులు చెరకు రైతుల సమస్యలు, షాదీ భాగ్యలపై ఉభయ సభలు అట్టుడికాయి. అనంతరం ప్రధాన సమస్యలపై చర్చలు జరిగాయి. కృష్ణా జలాల పంపకంపై బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యునల్ తుది తీర్పు, ఏనుగులు, పులి సమస్య, శాంతి భద్రతలు, యువతుల అదృశ్యం తదితర అంశాలపై ఆసక్తికరమైన చర్చలు సాగాయి. స్పీకర్ కాగోడు తిమ్మప్ప, ఇంకా పలు పాలక, ప్రతిపక్ష సభ్యుల నిరసన ధ్వనుల మధ్య ఎస్మాకు సభామోదం లభించింది. ఇంకా పదికి పైగా బిల్లులను కూడా ఉభయ సభలు ఆమోదించాయి. కాగా ఈసారి సమావేశాలు అర్థవంతంగా జరిగాయని స్పీకర్, చైర్మన్ సంతృప్తి వ్యక్తం చేశారు.
ముగించేశారు
Published Sat, Dec 7 2013 4:05 AM | Last Updated on Sat, Sep 2 2017 1:20 AM
Advertisement
Advertisement