
దేశవాలీ క్రికెట్‌కు సంబంధించి గోవా క్రికెట్ అసోసియేషన్ (GCA) ఆసక్తికర రీతిలో పావులు కదుపుతున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే భారీ ఆఫర్‌తో ముంబై బ్యాటర్ యశస్వి జైస్వాల్‌కు గాలం వేసిన జీసీఏ.. మరో ముంబైకర్ సూర్యకుమార్ యాదవ్, హైదరాబాద్ స్టార్ బ్యాటర్ తిలక్ వర్మతో కూడా సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం. తదుపరి దేశవాలీ సీజన్ కోసం జీసీఏ ఈ ముగ్గురిని తమ జట్టులో (గోవా) చేర్చుకోవాలని భావిస్తుందట.
జీసీఏ జైస్వాల్‌కు ఆటగాడిగా అవకాశం ఇవ్వడంతో పాటు కెప్టెన్సీ కూడా కట్టబెట్టనుందని సమాచారం. జీసీఏ ఆఫర్‌కు జైస్వాల్ కూడా సముఖత వ్యక్తం చేసినట్లు తెలుస్తుంది. ఈ మేరకు అతను నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ (NOC) కోసం ముంబై క్రికెట్ అసోసియేషన్‌ను కూడా సంప్రదించాడని తెలుస్తుంది. వ్యక్తిగత కారణాల వల్ల జైస్వాల్ ముంబైని వీడాలని భావిస్తున్నాడని ప్రచారం జరుగుతుంది. గతంలో అర్జున్ టెండూల్కర్ (సచిన్ టెండూల్కర్ తనయుడు), సిద్దేశ్ లాడ్ ముంబైని వీడి గోవాకు ప్రాతినిథ్యం వహించిన వారిలో ఉన్నారు.
కాగా , ఉత్తరప్రదేశ్‌కు చెందిన యశస్వి జైస్వాల్.. దేశవాళీ క్రికెట్‌లో చాలా ఏళ్లుగా ముంబైకి ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. అండర్-19 దశ నుంచి ముంబైకి ఆడుతున్న ఈ ఎడమచేతి వాటం బ్యాటర్.. విజయ్ హజారే (వన్డే) టోర్నీలో డబుల్ సెంచరీ బాదడం ద్వారా వెలుగులోకి వచ్చాడు. అంచెలంచెలుగా ఎదుగుతూ ఐపీఎల్‌లో (2020) ఆడే అవకాశం దక్కించుకున్న జైస్వాల్.. 2023లో టీమిండియా తరఫున అరంగేట్రం చేశాడు.
జైస్వాల్ ప్రస్తుతం ఐపీఎల్ 2025లో బిజీగా ఉన్నాడు. ఈ సీజన్‌కు ముందు జైస్వాల్‌ను రాజస్థాన్ రాయల్స్ రూ. 18 కోట్లకు రీటైన్ చేసుకుంది. జైస్వాల్ ఈ సీజన్‌లో ఇప్పటివరకు ఆడిన మూడు మ్యాచ్‌ల్లో కేవలం 34 పరుగులే చేసి నిరాశపరిచాడు. అతడి జట్టు రాయల్స్ కూడా ఈ సీజన్‌లో అంతంతమాత్రంగానే ఉంది. ఆ జట్టు ఇప్పటివరకు ఆడిన మూడు మ్యాచ్‌ల్లో ఒక దాంట్లో మాత్రమే గెలిచింది.
సూర్యకుమార్, తిలక్ వర్మ విషయానికొస్తే.. ఐపీఎల్‌లో ఈ ఇద్దరు గత కొన్ని సీజన్లుగా ముంబై ఇండియన్స్‌కు ఆడుతున్నారు. ఈ సీజన్ వేలానికి ముందు ముంబై ఈ ఇద్దరిని రీటైన్ చేసుకుంది. ఈ సీజన్‌లో స్కై, తిలక్ పెద్దగా ఆకట్టుకునే ప్రదర్శనలేమీ చేయలేదు. వారి జట్టు ఈ సీజన్‌లో ఇప్పటివరకు ఆడిన మూడు మ్యాచ్‌ల్లో కేవలం ఒకదాంట్లోనే గెలిచింది.