‘మార్గదర్శకుడు మండేలా’
న్యూఢిల్లీ: దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు నెల్సన్ మండేలా మృతిపై బ్యాటింగ్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ విచారం వ్యక్తం చేశాడు. ఆయన ఎంతో మందికి మార్గదర్శకుడిగా నిలిచారని కొనియాడాడు. ‘నేను మండేలాను తొలిసారి కలుసుకున్న సందర్భం నా జీవితంలో అత్యంత చిరస్మరణీయ జ్ఞాపకాల్లో ఒకటిగా నిలిచిపోయింది. నిజంగా ఆయన ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మందికి ప్రేరణగా నిలిచిన మహనీయుడు. నా హృదయంలో మండేలా ఎప్పటికీ నిలిచిపోతారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను’ అని సచిన్ తన ట్విట్టర్ ఖాతాలో పేర్కొన్నాడు.
అలాగే అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) అధ్యక్షుడు థామస్ బాచ్, హెవీవెయిట్ బాక్సింగ్ లెజెండ్ మహ్మద్ అలీ, ఫిఫా చీఫ్ సెప్ బ్లాటర్, టైగర్ వుడ్స్, దక్షిణాఫ్రికా గోల్ఫ్ గ్రేట్ గ్యారీ ప్లేయర్, కివీస్ రగ్బీ ఆటగాళ్లు ఈ నల్ల సూరీడుకి శ్రద్ధాంజలి ఘటించారు. డునెడిన్‌లో తొలి టెస్టు ఆడుతోన్న వెస్టిండీస్, న్యూజిలాండ్ క్రికెటర్లు తమ మ్యాచ్ ప్రారంభానికి ముందు నిమిషం పాటు మౌనం పాటించారు. మరోవైపు ఐసీసీ అధ్యక్షుడు అలన్ ఐజాక్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ డేవిడ్ రిచర్డ్‌సన్ మండేలాకు ఘనంగా నివాళి అర్పించారు. ‘ఓ నాయకుడిగా, పోరాట యోధుడిగా, కార్యకర్తగా పేరు తెచ్చుకోవడమే కాకుండా ప్రజలందరినీ ఒక్కతాటిపైకి తెచ్చిన మహా మనిషి మండేలా’ అని ఐజాక్ అన్నారు. మండేలా మరణం తమ సొంత దేశ ప్రజలకే కాకుండా మొత్తం ప్రపంచానికే విషాద వార్తగా దక్షిణాఫ్రికాకే చెందిన రిచర్డ్‌సన్ తెలిపారు.