thomas bach
-
ఐఓసీ చీఫ్ జపాన్ పర్యటన రద్దు
టోక్యో: కరోనా కేసులు పెరుగుతుండటంతో జపాన్ పర్యటనను అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) అధ్యక్షుడు థామస్ బాచ్ రద్దు చేసుకున్నారు. ఈ విషయాన్ని ఒలింపిక్ ఆర్గనైజింగ్ కమిటీ తమ ప్రకటనలో పేర్కొంది. వచ్చే సోమవారం టార్చ్ రిలే హిరోషిమా నగరానికి చేరుకోనుండగా... బాచ్ అందులో పాల్గొనాల్సి ఉంది. ప్రస్తుతానికైతే బాచ్ పర్యటన రద్దయిందని... త్వరలోనే ఆయన కొత్త పర్యటన తేదీలను ప్రకటిస్తామని ఒలింపిక్ ఆర్గనైజింగ్ కమిటీ తెలిపింది. ఒలింపిక్స్‌కు మరో 10 వారాల సమయం మాత్రమే ఉండగా... నిర్వాహకులు అనేక సమస్యలతో సతమతమవుతున్నారు. కరోనా వేళ ఒలింపిక్స్ ఏంటంటూ... వాటిని మరోసారి వాయిదా లేదా రద్దు చేయాలంటూ స్థానిక మీడియా నిర్వహించిన సర్వేల్లో తేలింది. ఈ సర్వేల్లో ఏకంగా 60 నుంచి 80 శాతం మంది ప్రజలు ఒలింపిక్స్ నిర్వహణపై తమ విముఖతను తెలియజేశారు. మరోవైపు ఇటీవలే టోక్యో ఒలింపిక్స్‌ను నిర్వహించకూడదంటూ ఆన్లైన్లో దాఖలు చేసిన పిటిషన్‌కు మద్దతుగా 3 లక్షల మందికి పైగా జపాన్‌వాసులు సంతకాలు చేశారు. ఇన్ని సమస్యల మధ్య కూడా అనుకున్న తేదీల్లోనే ఒలింపిక్స్‌ను నిర్వహిస్తామని ఐఓసీ పేర్కొనడం విశేషం. -
క్రీడాకారులకు కోవిడ్ వ్యాక్సిన్ తప్పనిసరి కాదు
టోక్యో : వచ్చే ఏడాది జరిగే టోక్యో ఒలింపిక్స్‌లో పాల్గొనే క్రీడాకారులకు కోవిడ్–19 వ్యాక్సిన్ విషయంలో వెసులుబాటు కల్పిస్తూ అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) అధ్యక్షుడు థామస్ బాచ్ నిర్ణయం తీసుకున్నారు. ఈ మెగా ఈవెంట్లో పాల్గొనే వారు కోవిడ్–19 వ్యాక్సిన్‌ను వేయించుకోవడం తప్పనిసరేం కాదంటూ మంగళవారం వ్యాఖ్యానించారు. అంతేకాకుండా వ్యాక్సిన్ తీసుకోవడం అథ్లెట్ల నిర్ణయానికే వదిలేశారు. ‘ఈ నిర్ణయం తీసుకోవడానికి చాలా కారణాలే ఉన్నాయి. ఒలింపిక్స్ జరిగే నాటికి ఎన్ని వ్యాక్సిన్లు అందుబాటులోకి వస్తాయనే విషయంపై స్పష్టత లేదు. అంతేకాకుండా ఒక్కొక్కరిపై ఒక్కోలా వ్యాక్సిన్ తన ప్రభావాన్ని చూపే అవకాశం ఉంది. కొందరిలో ఇది దుష్ప్రభావం చూపే అవకాశం కూడా ఉంది’ అంటూ థామస్ బాచ్ వ్యాఖ్యానించారు. అయితే తాము మాత్రం వ్యాక్సిన్ తీసుకోవాల్సిందిగా అథ్లెట్లను కోరతామని థామస్ పేర్కొనడం విశేషం. జపాన్‌లో మూడు రోజుల పర్యటనలో భాగంగా బాచ్ మంగళవారం టోక్యో ఒలింపిక్స్ ప్రధాన వేదిక నేషనల్ స్టేడియంతోపాటు క్రీడాకారులు బస చేసే క్రీడా గ్రామాన్ని సందర్శించి అక్కడి సౌకర్యాలను పరిశీలించారు. టోక్యో ఒలింపిక్స్–2021 వచ్చే ఏడాది జూలై 23న మొదలవుతాయి. -
టోక్యో వాయిదా... మాకూ భారమే: ఐఓసీ
టోక్యో: ఈ ఏడాది ఒలింపిక్స్ వచ్చే ఏడాదికి వాయిదా పడటం వల్ల అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ)పై కూడా భారం పడుతుందని ఐఓసీ చీఫ్ థామస్ బాచ్ చెప్పారు. ఓ జర్మన్ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ... వాయిదా వల్ల మాకూ వందల కోట్ల నష్టం (వందల మిలియన్ డాలర్లు) వస్తుంది. ఇక మిగతాదంతా జపానే భరించాల్సి ఉంటుంది. ఇదే విషయాన్ని ‘ఆతిథ్య ఓప్పందం’లో స్పష్టంగా తెలియజేశాం. జపాన్ ప్రధాని సమక్షంలోనే ఈ ఒప్పందం జరిగింది. అదనపు భారంలో సింహభాగాన్ని ఆతిథ్య దేశం భరించాల్సిందేనని నియమ నిబంధనల్లో ఉంది. కొంత నష్టాన్ని ఐఓసీ భరిస్తుంది’ అని అన్నారు. తాజా అంచనాల ప్రకారం 2 నుంచి 6 బిలియన్ డాలర్లు (రూ.15 వేల కోట్ల నుంచి రూ.45 వేల కోట్లు) వరకు ఈ భారం ఉంటుంది. అంటే మొత్తం నిర్వహ ణకు అయ్యే వ్యయంలో ఇంచు మించు సగమన్నమాట! ఇప్పటి వరకు జపాన్ ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలనుకున్న టోక్యో ఈవెంట్ కోసం రూ. 92 వేల కోట్లు (12.6 బిలియన్ డాలర్లు) ఖర్చు చేసింది. అయితే ఇటీవల టోక్యో ఆర్గనైజింగ్ కమిటీ సీఈఓ తోషిరో ముటో వచ్చే ఏడాది కూడా జరిగేది సందేహాస్పదమేనన్నారు. ‘అప్పటికల్లా మహమ్మారి అదుపులోకి వస్తుందని ఎవరైనా చెప్పగలరా’ అని అన్నారు. దీనిపై బాచ్ మాట్లాడుతూ స్పష్టమైన జవాబు ఇచ్చే పరిస్థితిలో తాను లేనని... అయితే మరో వాయిదాకు అవకాశమైతే లేదని జపాన్ వర్గాలు చెప్పినట్లు వెల్లడించారు. -
టోక్యో 2021కూ వర్తిస్తుంది!
లాసానె: టోక్యోలో జరగాల్సిన 2020 ఒలింపిక్స్ కోసం వివిధ క్రీడాంశాల్లో కలిపి ఇప్పటికే 57 శాతం మంది అర్హత సాధించారు. అయితే క్రీడలు ఏడాది కాలం పాటు వాయిదా పడటంతో వీరి అర్హతపై సందేహాలు మొదలయ్యాయి. ఇందులో పలువురు అథ్లెట్లు తమ కెరీర్ చరమాంకంలో ఉండటంతో పాటు సంవత్సరం పాటు తమ ఫిట్నెస్ను, ఆటను అదే స్థాయిలో కొనసాగిస్తూ మళ్లీ క్వాలిఫయింగ్ పోటీల్లో పాల్గొని అర్హత సాధించడం అంటే దాదాపుగా అసాధ్యమే! ఈ నేపథ్యంలో వారికి అనుకూలంగా నిర్ణయం తీసుకోవాలని అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) భావిస్తోంది. ఇప్పటికే 2020 కోసం సాధించిన అర్హత 2021కి కూడా వర్తించే విధంగా చేయాలనే ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. ఈ విషయంపై గురువారం ఐఓసీతో 32 సభ్య దేశాలు చర్చించాయి. అయితే వచ్చే ఏడాది ఒలింపిక్స్ నిర్వహించాల్సిన తేదీలపై మాత్రం ఈ సమావేశంలో స్పష్టత రాలేదు. కొందరు మే నెలలో, మరికొందరు జూన్‌లో అంటూ సూచనలిచ్చారని... వచ్చే నెల రోజుల్లోపు దీనిపై నిర్ణయం తీసుకోవచ్చని ఒక సభ్యదేశపు ప్రతినిధి ప్రకటించారు. -
అందరూ త్యాగాలు చేయాల్సిందే!
లుసానే: ఏడాదిపాటు వాయిదా పడిన టోక్యో ఒలింపిక్స్ క్రీడలను మళ్లీ అంతే స్థాయిలో నిర్వహించాలంటే దీంతో సంబంధం ఉన్న అందరూ తమ వైపు నుంచి కొన్ని త్యాగాలు, సర్దుబాట్లు చేయక తప్పదని అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) అధ్యక్షుడు థామస్ బాచ్ అన్నారు. అథ్లెట్ల కల అయిన ఒలింపిక్స్‌ను సాకారం చేయడం తమ బాధ్యత అని ఆయన వ్యాఖ్యానించారు. ‘టోక్యో ఒలింపిక్స్‌ను పూర్తిగా రద్దు చేయాలనే అంశంపై కూడా చర్చ జరిగింది. దానిని పరిశీలించాం కూడా. అయితే రద్దు చేయడం వల్ల ఎవరికీ మేలు జరిగే అవకాశం లేదని భావించి మేం మొదటి నుంచీ పట్టుదలగా ఉన్నాం. ఇప్పుడు వాయిదా పడిన క్రీడలను మళ్లీ నిర్వహించేందుకు అన్ని వర్గాలవారు కొన్ని రకాల త్యాగాలు చేయాల్సిందే’ అని బాచ్ స్పష్టం చేశారు. 2021లో ఒలింపిక్స్ జరపడం మరో పెద్ద సవాల్ అని, ఈ సమస్యలు పరిష్కరించడంలో భాగంగా ‘హియర్ వి గో’ పేరుతో ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ‘వచ్చే వేసవి సమయంలోనే నిర్వహించాలనే ఏమీ లేదు. ఆ తేదీలతో పాటు ఇతర నెలలకు సంబంధించి కూడా వేర్వేరు ప్రత్యామ్నాయాలు అందుబాటులో ఉన్నాయి. 2021 స్పోర్ట్స్ క్యాలెండర్‌ను కూడా పరిగణనలోకి తీసుకొని షెడ్యూల్ రూపొందిస్తాం. దీనిపై గురువారం 33 సభ్య దేశాల క్రీడా సమాఖ్యలతో చర్చిస్తాం. ఇక వాయిదా వల్ల వచ్చే నష్టాల గురించి ఇప్పుడే చెప్పలేను. అయితే గతంలో మేం ఎన్నడూ ఎదుర్కోని పరిస్థితి ఇది కాబట్టి ఏం చేయాలో చాలా జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటాం’ అని బాచ్ వెల్లడించారు. -
డబ్ల్యూహెచ్ఓ ఎలా చెబితే అలా!
బెర్లిన్: ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) చెప్పినట్లే తాము నడుచుకుంటామని అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) తెలిపింది. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ (కోవిడ్–19) నేపథ్యంలో టోక్యో ఒలింపిక్స్‌ను వాయిదా వేయాలా లేదంటే రద్దు చేయాలా అనేది డబ్ల్యూహెచ్ఓ సిఫార్సులకు అనుగుణంగా నిర్ణయం తీసుకుంటామని, ఆ సంస్థ ఎలా చెబితే అలా నడుచుకుంటామని ఐఓసీ చీఫ్ థామస్ బాచ్ తెలిపారు. ఓ ఇంటర్వూ్యలో ఆయన మాట్లాడుతూ ‘ఇప్పటికైతే విశ్వక్రీడల్ని విజయవంతంగా నిర్వహించే ఏర్పాట్లు చేస్తున్నాం. అయితే ఏ నిర్ణయమైనా డబ్ల్యూహెచ్ఓ సూచనల మేరకే ఉంటుంది. ఎప్పటికప్పుడు ఆ సంస్థతో మా ప్రతినిధులు సంప్రదింపులు జరుపుతూనే ఉన్నారు. ఏదేమైనా కరోనా మహమ్మారి వల్ల ఆయా దేశాల్లో వాయిదా, రద్దయిన క్వాలిఫయింగ్ టోర్నీలతో పెను సవాళ్లు ఎదురవుతున్నాయి’ అని అన్నారు. జపాన్ మాత్రం తమ దేశంలో జూలై 24 నుంచి ఆగస్టు 8 వరకు జరిగే టోక్యో ఒలింపిక్స్‌పై గంపెడు ఆశలతో స్టేడియాలకు కొత్తసొబగులు అద్దుతోంది. మరోవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒలింపిక్స్‌ను వాయిదా వేస్తేనే మేలని సలహా ఇచ్చారు. దీన్ని జపాన్ తోసిపుచ్చింది. ‘ఐఓసీ, టోక్యో ఆర్గనైజింగ్ కమిటీ... ఒలింపిక్స్‌ను వాయిదా లేదంటే రద్దు చేయాలని ఎప్పుడూ అనుకోలేదు’ అని ఒలింపిక్ కాంస్య పతక విజేత అయిన సీకో హషిమొటొ తెలిపింది. -
రూ. 63 కోట్ల చేతి ప్రతి!
అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) అధ్యక్షుడు థామస్ బాచ్, రష్యా కోటీశ్వరుడు అలీషర్ ఉస్మానోవ్ చేతుల్లో కనిపిస్తున్న ఈ రాత ప్రతి విలువ అక్షరాలా రూ. 63 కోట్లు! ఒలింపిక్ క్రీడల నిర్వహణపై తన విజన్‌ను చెబుతూ ‘ఆధునిక ఒలింపిక్ పితామహుడు’ పియర్రీ డి క్యూబర్టీన్ స్వయంగా రాసుకున్న 14 పేజీల డాక్యుమెంట్ ఇది. ఇటీవల జరిగిన వేలంలో ఉస్మానోవ్ దీనిని 8.8 మిలియన్ డాలర్లకు (సుమారు రూ. 63 కోట్లు)కు సొంతం చేసుకున్నాడు. దానిని ఇప్పుడు లాసానేలోని ఒలింపిక్ మ్యూజియంలో ఉంచమంటూ తానే బహుమతిగా అందించాడు. క్రీడల చరిత్రలో వేలం ద్వారా ఒక స్మారకం లేదా జ్ఞాపికకు లభించిన అత్యధిక మొత్తం ఇదే కావడం విశేషం. గతంలో అమెరికా బేస్‌బాల్ ఆటగాడు బేబ్ రూత్ ధరించిన ‘న్యూయార్క్ యాంకీస్’ టీమ్ జెర్సీ 5.64 మిలియన్ డాలర్లకు (రూ. 40 కోట్లు) అమ్ముడుపోయింది. -
సైనాకు అరుదైన గౌరవం
హైదరాబాద్: భారత బ్యాడ్మింటన్ స్టార్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్‌కు అరుదైన గౌరవం లభించింది. అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) అథ్లెట్స్ కమిషన్‌లో సభ్యురాలిగా సైనాను నియమించారు. ఈ మేరకు ఐఓసీ అధ్యక్షుడు థామస్ బాచ్ నుంచి సైనాకు సోమవారం రాత్రి అధికారిక నియామక పత్రం అందింది. గత ఆగస్టులో రియో ఒలింపిక్స్ సందర్భంగా అథ్లెట్స్ కమిషన్ ఎన్నికలు జరిగాయి. అమెరికా ఐస్ హాకీ క్రీడాకారిణి ఎంజెలో రుజియెరో అధ్యక్షురాలిగా ఉన్న ఈ ఐఓసీ అథ్లెట్స్ కమిషన్‌లో తొమ్మిది మంది ఉపాధ్యక్షులు, 10 మంది సభ్యులు ఉన్నారు. అథ్లెట్స్ కమిషన్ సమావేశం వచ్చేనెల 6న జరుగుతుంది. మోకాలికి శస్త్ర చికిత్స చేయించుకున్న సైనా ఇటీవలే మళ్లీ ప్రాక్టీస్ ప్రారంభించింది. అంతా అనుకున్నట్లు జరిగితే వచ్చే నెలలో ఆమె మళ్లీ బరిలోకి దిగొచ్చు. -
రియో మళ్లీ వెలిగింది
ఘనంగా పారాలింపిక్స్ ప్రారంభోత్సవం రియో డి జనీరో: ఒలింపిక్స్‌కు ఏమాత్రం తీసిపోని రీతిలో పారాలింపిక్స్ ప్రారంభ వేడుకలు కూడా ఘనంగా జరిగాయి. భారత కాలమానప్రకారం గురువారం తెల్లవారుజామున మరకానా స్టేడియంలో జరిగిన ఈ వేడుకల్లో సాంబా నృత్యాలతో పాటు భారీ బెలూన్లు, కళ్లు మిరుమిట్లు గొలిపే బాణసంచా వెలుగులతో రియో నగరం జిగేల్మంది. ఒలింపిక్స్ ముగిసిన అనంతరం సంప్రదాయంగా ఈ గేమ్స్ జరిగే విషయం తెలిసిందే. భారీ ఎత్తున తరలివచ్చిన ప్రేక్షకులను సాంబా కళాకారులు ఉర్రూతలూగించగా స్టేడియం మధ్యలో రియో బీచ్ దృశ్యాలను సృష్టించడం అబ్బురపరిచింది. ‘ప్రతి ఒక్కరికీ హృదయం ఉంటుంది’ అనే పేరిట చేసిన ప్రదర్శన అమితంగా అలరించింది. ఈనెల 18 వరకు ఈ క్రీడలు జరుగుతాయి. మరోవైపు నూతనంగా అధ్యక్ష పదవిని అలంకరించిన మైకేల్ టెమెర్ను వ్యతిరేకిస్తూ కొందరు ప్రేక్షకులు ప్లకార్డులు ప్రదర్శించారు. శారీరక వైకల్యం, పాక్షిక అంధత్వం, పక్షవాతం కలిగిన అథ్లెట్లు ఈ గేమ్స్‌లో పాల్గొంటారు. ఓవరాల్‌గా 159 దేశాల నుంచి ఈ గేమ్స్ చరిత్రలో తొలిసారిగా 4,342 మంది అథ్లెట్లు బరిలోకి దిగుతున్నారు. ఇందులో ఇద్దరితో కూడిన అంతర్జాతీయ శరణార్ధి జట్టు కూడా ఉంది. భారత్ నుంచి ఎన్నడూ లేని విధంగా 17 మంది అథ్లెట్లు తమ సత్తాను పరీక్షించుకోనున్నారు. డోపింగ్ ఆరోపణలతో రష్యా అథ్లెట్లను ఇందులో పాల్గొనకుండా బహిష్కరించారు. 154 దేశాల్లో ఈ క్రీడలు ప్రసారం కాబోతున్నాయి. అంగవైకల్యం కలిగిన వారిపై ఉన్న దృష్టికోణాన్ని ఈ క్రీడల ద్వారా తమ అథ్లెట్లు పటాపంచలు చేస్తారని అంతర్జాతీయ పారాలింపిక్స్ కమిటీ (ఐపీసీ) అధ్యక్షుడు ఫిలిప్ క్రావెన్ విశ్వాసం వ్యక్తం చేశారు. రియో ఒలింపిక్స్ ముగిసిన అనంతరం వీటి టిక్కెట్ల అమ్మకాలు గణనీయంగా పెరిగాయని సంతోషం వ్యక్తం చేశారు. అయితే 1984 అనంతరం ఐఓసీ చీఫ్ లేకుండానే ఈ గేమ్స్ ప్రారంభమయ్యాయి. పశ్చిమ జర్మనీ మాజీ అధ్యక్షుడు వాల్టర్ షీల్ అంత్యక్రియల్లో పాల్గొన్న థామస్ బాచ్ ఈ వేడుకలకు గైర్హాజరయ్యారు. -
భారత్ రానున్న ఐఓసీ చీఫ్ 27న ప్రధానితో థామస్ బాచ్ భేటీ
న్యూఢిల్లీ: అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) అధ్యక్షుడు థామస్ బాచ్ రెండు రోజుల పర్యటన కోసం భారత్‌కు ఈ నెల 26న రానున్నారు. 2013లో ఐఓసీ చీఫ్‌గా బాధ్యతలు స్వీకరించిన బాచ్, భారత్‌కు రావడం ఇదే తొలిసారి. భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) ఎగ్జిక్యూటివ్ కమిటీతో సమావేశం కానున్న బాచ్... ప్రధాని నరేంద్ర మోదిని 27న కలవనున్నారు. 2024 ఒలింపిక్స్ నిర్వహణ కోసం భారత్ బిడ్ వేస్తుందని ఇటీవల వార్తలు వచ్చిన నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. -
వింటర్ ఒలింపిక్స్ సందడి ప్రారంభం
-
‘మార్గదర్శకుడు మండేలా’
న్యూఢిల్లీ: దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు నెల్సన్ మండేలా మృతిపై బ్యాటింగ్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ విచారం వ్యక్తం చేశాడు. ఆయన ఎంతో మందికి మార్గదర్శకుడిగా నిలిచారని కొనియాడాడు. ‘నేను మండేలాను తొలిసారి కలుసుకున్న సందర్భం నా జీవితంలో అత్యంత చిరస్మరణీయ జ్ఞాపకాల్లో ఒకటిగా నిలిచిపోయింది. నిజంగా ఆయన ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మందికి ప్రేరణగా నిలిచిన మహనీయుడు. నా హృదయంలో మండేలా ఎప్పటికీ నిలిచిపోతారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను’ అని సచిన్ తన ట్విట్టర్ ఖాతాలో పేర్కొన్నాడు. అలాగే అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) అధ్యక్షుడు థామస్ బాచ్, హెవీవెయిట్ బాక్సింగ్ లెజెండ్ మహ్మద్ అలీ, ఫిఫా చీఫ్ సెప్ బ్లాటర్, టైగర్ వుడ్స్, దక్షిణాఫ్రికా గోల్ఫ్ గ్రేట్ గ్యారీ ప్లేయర్, కివీస్ రగ్బీ ఆటగాళ్లు ఈ నల్ల సూరీడుకి శ్రద్ధాంజలి ఘటించారు. డునెడిన్‌లో తొలి టెస్టు ఆడుతోన్న వెస్టిండీస్, న్యూజిలాండ్ క్రికెటర్లు తమ మ్యాచ్ ప్రారంభానికి ముందు నిమిషం పాటు మౌనం పాటించారు. మరోవైపు ఐసీసీ అధ్యక్షుడు అలన్ ఐజాక్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ డేవిడ్ రిచర్డ్సన్ మండేలాకు ఘనంగా నివాళి అర్పించారు. ‘ఓ నాయకుడిగా, పోరాట యోధుడిగా, కార్యకర్తగా పేరు తెచ్చుకోవడమే కాకుండా ప్రజలందరినీ ఒక్కతాటిపైకి తెచ్చిన మహా మనిషి మండేలా’ అని ఐజాక్ అన్నారు. మండేలా మరణం తమ సొంత దేశ ప్రజలకే కాకుండా మొత్తం ప్రపంచానికే విషాద వార్తగా దక్షిణాఫ్రికాకే చెందిన రిచర్డ్సన్ తెలిపారు.