బెర్లిన్: ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) చెప్పినట్లే తాము నడుచుకుంటామని అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) తెలిపింది. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ (కోవిడ్–19) నేపథ్యంలో టోక్యో ఒలింపిక్స్‌ను వాయిదా వేయాలా లేదంటే రద్దు చేయాలా అనేది డబ్ల్యూహెచ్‌ఓ సిఫార్సులకు అనుగుణంగా నిర్ణయం తీసుకుంటామని, ఆ సంస్థ ఎలా చెబితే అలా నడుచుకుంటామని ఐఓసీ చీఫ్ థామస్ బాచ్ తెలిపారు. ఓ ఇంటర్వూ్యలో ఆయన మాట్లాడుతూ ‘ఇప్పటికైతే విశ్వక్రీడల్ని విజయవంతంగా నిర్వహించే ఏర్పాట్లు చేస్తున్నాం. అయితే ఏ నిర్ణయమైనా డబ్ల్యూహెచ్‌ఓ సూచనల మేరకే ఉంటుంది. ఎప్పటికప్పుడు ఆ సంస్థతో మా ప్రతినిధులు సంప్రదింపులు జరుపుతూనే ఉన్నారు. ఏదేమైనా కరోనా మహమ్మారి వల్ల ఆయా దేశాల్లో వాయిదా, రద్దయిన క్వాలిఫయింగ్ టోర్నీలతో పెను సవాళ్లు ఎదురవుతున్నాయి’ అని అన్నారు. జపాన్ మాత్రం తమ దేశంలో జూలై 24 నుంచి ఆగస్టు 8 వరకు జరిగే టోక్యో ఒలింపిక్స్‌పై గంపెడు ఆశలతో స్టేడియాలకు కొత్తసొబగులు అద్దుతోంది. మరోవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒలింపిక్స్‌ను వాయిదా వేస్తేనే మేలని సలహా ఇచ్చారు. దీన్ని జపాన్ తోసిపుచ్చింది. ‘ఐఓసీ, టోక్యో ఆర్గనైజింగ్ కమిటీ... ఒలింపిక్స్‌ను వాయిదా లేదంటే రద్దు చేయాలని ఎప్పుడూ అనుకోలేదు’ అని ఒలింపిక్ కాంస్య పతక విజేత అయిన సీకో హషిమొటొ తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment