
లాసానె: టోక్యోలో జరగాల్సిన 2020 ఒలింపిక్స్ కోసం వివిధ క్రీడాంశాల్లో కలిపి ఇప్పటికే 57 శాతం మంది అర్హత సాధించారు. అయితే క్రీడలు ఏడాది కాలం పాటు వాయిదా పడటంతో వీరి అర్హతపై సందేహాలు మొదలయ్యాయి. ఇందులో పలువురు అథ్లెట్లు తమ కెరీర్ చరమాంకంలో ఉండటంతో పాటు సంవత్సరం పాటు తమ ఫిట్‌నెస్‌ను, ఆటను అదే స్థాయిలో కొనసాగిస్తూ మళ్లీ క్వాలిఫయింగ్ పోటీల్లో పాల్గొని అర్హత సాధించడం అంటే దాదాపుగా అసాధ్యమే! ఈ నేపథ్యంలో వారికి అనుకూలంగా నిర్ణయం తీసుకోవాలని అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) భావిస్తోంది. ఇప్పటికే 2020 కోసం సాధించిన అర్హత 2021కి కూడా వర్తించే విధంగా చేయాలనే ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. ఈ విషయంపై గురువారం ఐఓసీతో 32 సభ్య దేశాలు చర్చించాయి. అయితే వచ్చే ఏడాది ఒలింపిక్స్ నిర్వహించాల్సిన తేదీలపై మాత్రం ఈ సమావేశంలో స్పష్టత రాలేదు. కొందరు మే నెలలో, మరికొందరు జూన్‌లో అంటూ సూచనలిచ్చారని... వచ్చే నెల రోజుల్లోపు దీనిపై నిర్ణయం తీసుకోవచ్చని ఒక సభ్యదేశపు ప్రతినిధి ప్రకటించారు.
Comments
Please login to add a commentAdd a comment