
టోక్యో: కరోనా కేసులు పెరుగుతుండటంతో జపాన్ పర్యటనను అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) అధ్యక్షుడు థామస్ బాచ్ రద్దు చేసుకున్నారు. ఈ విషయాన్ని ఒలింపిక్ ఆర్గనైజింగ్ కమిటీ తమ ప్రకటనలో పేర్కొంది. వచ్చే సోమవారం టార్చ్ రిలే హిరోషిమా నగరానికి చేరుకోనుండగా... బాచ్ అందులో పాల్గొనాల్సి ఉంది. ప్రస్తుతానికైతే బాచ్ పర్యటన రద్దయిందని... త్వరలోనే ఆయన కొత్త పర్యటన తేదీలను ప్రకటిస్తామని ఒలింపిక్ ఆర్గనైజింగ్ కమిటీ తెలిపింది. ఒలింపిక్స్‌కు మరో 10 వారాల సమయం మాత్రమే ఉండగా... నిర్వాహకులు అనేక సమస్యలతో సతమతమవుతున్నారు.
కరోనా వేళ ఒలింపిక్స్ ఏంటంటూ... వాటిని మరోసారి వాయిదా లేదా రద్దు చేయాలంటూ స్థానిక మీడియా నిర్వహించిన సర్వేల్లో తేలింది. ఈ సర్వేల్లో ఏకంగా 60 నుంచి 80 శాతం మంది ప్రజలు ఒలింపిక్స్ నిర్వహణపై తమ విముఖతను తెలియజేశారు. మరోవైపు ఇటీవలే టోక్యో ఒలింపిక్స్‌ను నిర్వహించకూడదంటూ ఆన్‌లైన్‌లో దాఖలు చేసిన పిటిషన్‌కు మద్దతుగా 3 లక్షల మందికి పైగా జపాన్‌వాసులు సంతకాలు చేశారు. ఇన్ని సమస్యల మధ్య కూడా అనుకున్న తేదీల్లోనే ఒలింపిక్స్‌ను నిర్వహిస్తామని ఐఓసీ పేర్కొనడం విశేషం.