లుసానే: ఏడాదిపాటు వాయిదా పడిన టోక్యో ఒలింపిక్స్ క్రీడలను మళ్లీ అంతే స్థాయిలో నిర్వహించాలంటే దీంతో సంబంధం ఉన్న అందరూ తమ వైపు నుంచి కొన్ని త్యాగాలు, సర్దుబాట్లు చేయక తప్పదని అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) అధ్యక్షుడు థామస్ బాచ్ అన్నారు. అథ్లెట్ల కల అయిన ఒలింపిక్స్‌ను సాకారం చేయడం తమ బాధ్యత అని ఆయన వ్యాఖ్యానించారు. ‘టోక్యో ఒలింపిక్స్‌ను పూర్తిగా రద్దు చేయాలనే అంశంపై కూడా చర్చ జరిగింది. దానిని పరిశీలించాం కూడా. అయితే రద్దు చేయడం వల్ల ఎవరికీ మేలు జరిగే అవకాశం లేదని భావించి మేం మొదటి నుంచీ పట్టుదలగా ఉన్నాం. ఇప్పుడు వాయిదా పడిన క్రీడలను మళ్లీ నిర్వహించేందుకు అన్ని వర్గాలవారు కొన్ని రకాల త్యాగాలు చేయాల్సిందే’ అని బాచ్ స్పష్టం చేశారు.
2021లో ఒలింపిక్స్ జరపడం మరో పెద్ద సవాల్ అని, ఈ సమస్యలు పరిష్కరించడంలో భాగంగా ‘హియర్ వి గో’ పేరుతో ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ‘వచ్చే వేసవి సమయంలోనే నిర్వహించాలనే ఏమీ లేదు. ఆ తేదీలతో పాటు ఇతర నెలలకు సంబంధించి కూడా వేర్వేరు ప్రత్యామ్నాయాలు అందుబాటులో ఉన్నాయి. 2021 స్పోర్ట్స్ క్యాలెండర్‌ను కూడా పరిగణనలోకి తీసుకొని షెడ్యూల్ రూపొందిస్తాం. దీనిపై గురువారం 33 సభ్య దేశాల క్రీడా సమాఖ్యలతో చర్చిస్తాం. ఇక వాయిదా వల్ల వచ్చే నష్టాల గురించి ఇప్పుడే చెప్పలేను. అయితే గతంలో మేం ఎన్నడూ ఎదుర్కోని పరిస్థితి ఇది కాబట్టి ఏం చేయాలో చాలా జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటాం’ అని బాచ్ వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment