ఆతిథ్య దేశం హోదాలో ఈ మెగా ఈవెంట్‌లో నేరుగా ఆడనున్న భారత జట్టు (ఫైల్)
న్యూఢిల్లీ: కరోనా ధాటికి మరో మెగా ఈవెంట్ వాయిదా పడింది. భారత్ వేదికగా జరగాల్సిన అండర్–17 మహిళల ఫుట్‌బాల్ ప్రపంచకప్‌ను వాయిదా వేస్తున్నట్లు అంతర్జాతీయ ఫుట్‌బాల్ సమాఖ్య (ఫిఫా) శనివారం ప్రకటించింది. ప్రాణాంతక వైరస్ కారణంగానే ఈ ఏడాది నవంబర్ 2 నుంచి 21 వరకు జరగాల్సిన ప్రపంచకప్ టోర్నీని నిలిపివేస్తున్నామని ‘ఫిఫా కాన్ఫెడరేషన్స్ వర్కింగ్ గ్రూప్’ వెల్లడించింది. కొత్త తేదీలను తర్వాత ప్రకటిస్తామని తెలిపింది. కాగా ‘ఫిఫా’ నిర్ణయాన్ని అఖిల భారత ఫుట్‌బాల్ సమాఖ్య (ఏఐఎఫ్‌ఎఫ్) స్వాగతించింది. ఈ నిర్ణయం తాము ముందుగా ఊహించిందేనని సమాఖ్య కార్యదర్శి కుశాల్ దాస్ పేర్కొన్నారు. ‘కరోనా కారణంగా మిగతా టోర్నీల్లాగే ఇది కూడా వాయిదా పడుతుందని ముందే ఊహించాం.
ఫిఫా నిర్ణయాన్ని మేం కచ్చితంగా ఆమోదించాల్సిందే. ప్రజారోగ్యం, ఆటగాళ్ల భద్రత, అభిమానుల క్షేమం కోరి ఫిఫా ఈ నిర్ణయం తీసుకొని ఉంటుంది. ఈ టోర్నీకి సంబంధించిన క్వాలిఫయింగ్ ఈవెంట్‌లు కూడా ఇంకా జరగాల్సి ఉన్నాయి. దీన్ని బట్టి ఈ టోర్నీ వచ్చే ఏడాది ఉంటుందని అనుకుంటున్నా’ అని ఆయన అన్నారు. షెడ్యూల్ ప్రకారం ప్రపంచకప్ మ్యాచ్‌లకు కోల్‌కతా, గువాహటి, భువనేశ్వర్, అహ్మదాబాద్, నవీ ముంబై నగరాలు ఆతిథ్యమివ్సాల్సింది. మొత్తం 16 జట్లు తలపడే టోర్నీలో... ఆతిథ్య జట్టు హోదాలో భారత్ నేరుగా అర్హత పొందింది. అండర్–17 మహిళల ప్రపంచకప్‌లో పాల్గొనడం భారత్‌కిదే తొలిసారి కావడం విశేషం. మరోవైపు అండర్–17 వరల్డ్‌కప్‌తో పాటు, ఆగస్టు–సెప్టెంబర్‌లో కోస్టారికా వేదికగా జరగాల్సిన అండర్–20 మహిళల ప్రపంచకప్‌నూ వాయిదావేయాలని వర్కింగ్ కమిటీ సూచించింది.
Comments
Please login to add a commentAdd a comment