Under-17 Football World Cup
-
FIFA Under-17: అమెరికా చేతిలో భారత్ ఘోర పరాభవం
భువనేశ్వర్: ప్రపంచ అండర్–17 మహిళల ఫుట్‌బాల్ టోర్నమెంట్‌ను ఆతిథ్య భారత్ పరాజయంతో ప్రారంభించింది. మంగళవారం జరిగిన గ్రూప్ ‘ఎ’ లీగ్ మ్యాచ్‌లో భారత జట్టు 0–8 గోల్స్ తేడాతో 2008 రన్నరప్ అమెరికా చేతిలో ఘోర పరాజయం చవిచూసింది. అమెరికా తరఫున మెలీనా రెబింబాస్ (9వ, 31వ ని.లో) రెండు గోల్స్ చేసింది. ఆ తర్వాత చార్లోటి కోలెర్ (15వ ని.లో), ఒన్యెకా గమెరో (23వ ని.లో), గిసెలీ థాంప్సన్ (39వ ని.లో), ఎల్లా ఇమ్రి (51వ ని.లో), టేలర్ స్వారెజ్ (59వ ని.లో), మియా భుటా (62వ ని.లో) ఒక్కో గోల్ సాధించారు. మరో మ్యాచ్‌లో బ్రెజిల్ 1–0తో మొరాకోపై నెగ్గింది. భారత్ తమ తదుపరి మ్యాచ్‌ను 14న మొరాకోతో ఆడుతుంది. -
ఆతిథ్యం... ఆలస్యం
న్యూఢిల్లీ: కరోనా ధాటికి మరో మెగా ఈవెంట్ వాయిదా పడింది. భారత్ వేదికగా జరగాల్సిన అండర్–17 మహిళల ఫుట్‌బాల్ ప్రపంచకప్‌ను వాయిదా వేస్తున్నట్లు అంతర్జాతీయ ఫుట్‌బాల్ సమాఖ్య (ఫిఫా) శనివారం ప్రకటించింది. ప్రాణాంతక వైరస్ కారణంగానే ఈ ఏడాది నవంబర్ 2 నుంచి 21 వరకు జరగాల్సిన ప్రపంచకప్ టోర్నీని నిలిపివేస్తున్నామని ‘ఫిఫా కాన్ఫెడరేషన్స్ వర్కింగ్ గ్రూప్’ వెల్లడించింది. కొత్త తేదీలను తర్వాత ప్రకటిస్తామని తెలిపింది. కాగా ‘ఫిఫా’ నిర్ణయాన్ని అఖిల భారత ఫుట్‌బాల్ సమాఖ్య (ఏఐఎఫ్ఎఫ్) స్వాగతించింది. ఈ నిర్ణయం తాము ముందుగా ఊహించిందేనని సమాఖ్య కార్యదర్శి కుశాల్ దాస్ పేర్కొన్నారు. ‘కరోనా కారణంగా మిగతా టోర్నీల్లాగే ఇది కూడా వాయిదా పడుతుందని ముందే ఊహించాం. ఫిఫా నిర్ణయాన్ని మేం కచ్చితంగా ఆమోదించాల్సిందే. ప్రజారోగ్యం, ఆటగాళ్ల భద్రత, అభిమానుల క్షేమం కోరి ఫిఫా ఈ నిర్ణయం తీసుకొని ఉంటుంది. ఈ టోర్నీకి సంబంధించిన క్వాలిఫయింగ్ ఈవెంట్లు కూడా ఇంకా జరగాల్సి ఉన్నాయి. దీన్ని బట్టి ఈ టోర్నీ వచ్చే ఏడాది ఉంటుందని అనుకుంటున్నా’ అని ఆయన అన్నారు. షెడ్యూల్ ప్రకారం ప్రపంచకప్ మ్యాచ్‌లకు కోల్‌కతా, గువాహటి, భువనేశ్వర్, అహ్మదాబాద్, నవీ ముంబై నగరాలు ఆతిథ్యమివ్సాల్సింది. మొత్తం 16 జట్లు తలపడే టోర్నీలో... ఆతిథ్య జట్టు హోదాలో భారత్ నేరుగా అర్హత పొందింది. అండర్–17 మహిళల ప్రపంచకప్‌లో పాల్గొనడం భారత్‌కిదే తొలిసారి కావడం విశేషం. మరోవైపు అండర్–17 వరల్డ్‌కప్‌తో పాటు, ఆగస్టు–సెప్టెంబర్‌లో కోస్టారికా వేదికగా జరగాల్సిన అండర్–20 మహిళల ప్రపంచకప్‌నూ వాయిదావేయాలని వర్కింగ్ కమిటీ సూచించింది. -
చివరి మ్యాచ్‌లోనూ భారత్ పరాజయం
జొహన్నెస్‌బర్గ్ (దక్షిణాఫ్రికా): బ్రిక్స్ ఫుట్‌బాల్ టోర్నమెంట్ చివరి లీగ్ మ్యాచ్‌లోనూ భారత అండర్–17 మహిళల ఫుట్‌బాల్ జట్టు పరాజయం పాలైంది. ఇప్పటికే మూడు మ్యాచ్‌ల్లో ఓడిన భారత్... ఆదివారం ఇక్కడ జరిగిన చివరిదైన నాలుగో మ్యాచ్‌లో 1–2తో చైనా చేతిలో ఓటమి పాలైంది. మన జట్టు తరఫున నమోదైన ఏకైక గోల్ మనీషా (25వ ని.లో) చేసింది. మ్యాచ్ ప్రారంభం నుంచి సాధికారికంగా ఆడిన భారత జట్టు తొలి అర్ధభాగాన్ని 1–0 ఆధిక్యంతో ముగించినా... రెండో సగంలో రెండు గోల్స్ సమర్పించుకొని ఓటమి పాలైంది. -
విశ్వ విజేత ఇంగ్లండ్
-
విశ్వ విజేత ఇంగ్లండ్
ప్రపంచ కప్ ఫుట్‌బాల్ ఫైనల్ మ్యాచ్... 31 నిమిషాలు ముగిసేసరికి 0–2తో వెనుకంజ... ఇలాంటి స్థితిలో ఏ జట్టయినా గెలుపుపై ఆశలు వదిలేసుకుంటుంది... కానీ ఇంగ్లండ్ పోరాటం ఆపలేదు. అద్భుతమైన ఆటతీరుతో కోలుకొని స్పెయిన్‌పై ఎదురుదాడికి దిగింది. వరుస గోల్స్‌తో ఉక్కిరిబిక్కిరి చేసింది. 46 నిమిషాల వ్యవధిలో ఏకంగా ఐదు గోల్స్ నమోదు చేసి అండర్–17 ఫుట్‌బాల్ ప్రపంచకప్‌లో తొలిసారి విజేతగా నిలిచింది. 66,684 మంది ప్రేక్షకుల సమక్షంలో కొత్త చరిత్రను సృష్టించింది. కోల్‌కతా: భారతగడ్డపై తొలిసారి అట్టహాసంగా నిర్వహించిన ‘ఫిఫా’ అండర్–17 ప్రపంచకప్‌లో ఇంగ్లండ్ ‘కిక్’ అదిరింది. ‘లయన్స్‘ విజృంభణతో ఆ జట్టు తొలిసారి జగజ్జేతగా నిలిచింది. శనివారం ఇక్కడి సాల్ట్‌లేక్ స్టేడియంలో భారీ సంఖ్యలో హాజరైన అభిమానులను అలరించిన ఫైనల్లో ఇంగ్లండ్ 5–2 తేడాతో స్పెయిన్‌ను చిత్తుగా ఓడించింది. ఇంగ్లండ్ తరఫున బ్రూస్టర్ (44వ నిమిషం), గిబ్స్ (58వ ని.లో), ఫిల్ ఫాడెన్ (69వ, 88వ ని.లో), మార్క్ గుహి (84వ ని.లో) గోల్స్ సాధించగా... స్పెయిన్ తరఫున సెర్గియో గోమెజ్ (10వ, 31వ ని.లో) రెండు గోల్స్ చేశాడు. ఇదే ఏడాది అండర్–20 ప్రపంచకప్‌ను కూడా గెలుచుకున్న ఇంగ్లండ్‌కు ఇది మరో చిరస్మరణీయ విజయం కావడం విశేషం. ఈ మెగా టోర్నీలో నాలుగోసారి ఫైనల్‌కు చేరిన స్పెయిన్ మళ్లీ రన్నరప్ టైటిల్‌తో సంతృప్తి చెందాల్సి వచ్చింది. మరోవైపు అటు ఆటగాళ్ల అద్భుత ప్రదర్శన, ఇటు ప్రేక్షకుల అమితాభిమానం కలగలిసి ఈ వరల్డ్ కప్ భారత్‌లో ఆదరణ పరంగా సూపర్‌హిట్‌గా నిలవడం ఏఐఎఫ్ఎఫ్ సాధించిన అతి పెద్ద విజయం. వెనుకంజ నుంచి విజయం వైపు... మ్యాచ్ మొదలైన 47 సెకన్లలోనే ఇంగ్లండ్ ద్వయం బ్రూస్టర్–గిబ్స్ గోల్ అవకాశం సృష్టించినా అది సఫలం కాలేదు. అయితే 10వ నిమిషంలోనే గోమెజ్ చేసిన గోల్‌తో స్పెయిన్‌కు ఆధిక్యం దక్కింది. ఆ తర్వాత కూడా దాడులు కొనసాగించిన స్పెయిన్ 31వ నిమిషంలో మళ్లీ ఫలితం సాధించింది. ఇంగ్లండ్ రక్షణశ్రేణిని మరోసారి ఛేదించి గోమెజ్ మళ్లీ గోల్ నమోదు చేయడంతో ఇంగ్లండ్ విస్తుపోయింది. అయితే తొలి అర్ధభాగం ముగియడానికి కొద్దిసేపు ముందు హెడర్ ద్వారా బ్రూస్టర్ గోల్ సాధించడంతో ఇంగ్లండ్ కోలుకుంది. బ్రూస్టర్కు టోర్నీలో ఇది ఎనిమిదో గోల్ కావడం విశేషం. రెండో అర్ధ భాగంలో ఇంగ్లండ్ చెలరేగిపోయింది. 58వ నిమిషంలో ఫాడెన్ ఇచ్చిన పాస్‌ను సెసెగ్నాన్ అందుకోవడంలో విఫలమైనా... మరోవైపు నుంచి దూసుకొచ్చిన గిబ్స్ ఆరు అడుగుల దూరం నుంచి గోల్ కొట్టి స్కోర్ సమం చేశాడు. 69వ నిమిషంలో ఫాడెన్ చేసిన సునాయాస గోల్‌తో ఇంగ్లండ్‌కు ఆధిక్యం దక్కింది. ఆ తర్వాత గుహి 84వ నిమిషంలో చేసిన గోల్‌తో ఇంగ్లండ్‌ను విజయం దిశగా వెళ్లగా... మ్యాచ్ రెండు నిమిషాల్లో ముగుస్తుందనగా ‘ప్లేయర్ ఆఫ్ టోర్నమెంట్’ ఫాడెన్ మరో గోల్‌తో ఇంగ్లండ్‌ను ఆనం దంలో ముంచాడు. అంతకుముందు బ్రెజిల్ 2–0తో మాలిపై విజయం సాధించి టోర్నీలో మూడో స్థానంలో నిలిచింది. -
కుర్రాళ్లూ...ఫిదా చేయండి!
-
కుర్రాళ్లూ...ఫిదా చేయండి!
భారత ఫుట్‌బాల్ చరిత్రలో కీలక అధ్యాయానికి నేడు తెర లేవనుంది. క్రికెట్టే ప్రాణంగా భావించే ఈ గడ్డపై ప్రపంచ దేశాల్లో అత్యధికంగా ఆదరణ పొందిన ఫిఫా ఈవెంట్ జరగబోతోంది. అండర్–17 ప్రపంచకప్‌లో భాగంగా తొలి మ్యాచ్‌లో భారత జట్టు పటిష్ట అమెరికాను ఢీకొంటుంది. అయితే సీనియర్ జట్టే ప్రపంచ ఫుట్‌బాల్‌లో ఎక్కడో ఉన్న తరుణంలో భారత కుర్రాళ్లు ఈ టోర్నీలో మెరుపులు మెరిపిస్తారా? అంటే సందేహమే. అత్యుత్తమ స్థాయి ప్రొఫెషనల్ శిక్షణతో రాటుదేలిన ప్రత్యర్థి జట్లపై రాణించగలరనే అంచనాలు ఎవరికీ లేకపోయినా... ఇలాంటి అద్భుత అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలనే ఆలోచనతో భారత కుర్రాళ్లు ఉన్నారు. 23 రోజుల పాటు జరిగే ఈ టోర్నీతో తమ ప్రతిభకు మెరుగులు దిద్దుకుని విలువైన అనుభవం సంపాదించుకోవాలనుకుంటున్నారు. అటు ఈ టోర్నీని విజయవంతం చేసి దేశంలో ఫుట్‌బాల్‌కు ఆదరణ పెంచాలని భారత ఫుట్‌బాల్ సమాఖ్య కోరుకుంటోంది. న్యూఢిల్లీ: తొలిసారిగా ఫిఫా అండర్–17 ఫుట్‌బాల్ ప్రపంచకప్‌కు ఆతిథ్యమిస్తున్న భారత్ నేటి నుంచి అసలు పోరులో బరిలోకి దిగనుంది. గ్రూప్ ‘ఎ’లో భాగంగా స్థానిక జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో జరిగే ప్రారంభ మ్యాచ్‌లో భారత కుర్రాళ్లు అత్యంత పటిష్టంగా కనిపిస్తున్న అమెరికా జట్టును ఎదుర్కోబోతున్నారు. ఆతిథ్య జట్టు హోదాలో ఈ మెగా ఈవెంట్‌కు భారత్ నేరుగా అర్హత సాధించిన విషయం తెలిసిందే. అండర్‌డాగ్స్‌గా బరిలోకి దిగబోతున్న భారత ఆటగాళ్లు ఈ టోర్నీ కోసం కాస్త మెరుగ్గానే శిక్షణ తీసుకున్నారు. అఖిల భారత ఫుట్‌బాల్ సమాఖ్య తమ ఆటగాళ్ల శిక్షణ కోసం యూరోప్, మెక్సికోలలో టోర్నీలను ఆడించింది. అయితే ఎలాంటి శిక్షణ తీసుకున్నా అమెరికాతో పోలిస్తే మన ఆటగాళ్లు చాలా వెనకబడే ఉన్నారనడంలో సందేహం లేదు. ఎందుకంటే ఈ జట్టులో చాలామందికి మేజర్ లీగ్ సాకర్ యూత్ టీమ్స్‌లో సభ్యులుగా ఉన్న అనుభవం ఉంది. కొందరైతే టాప్ యూరోపియన్ క్లబ్బుల్లో కూడా ఆడారు. పెద్దగా అంచనాలు కూడా లేకపోవడంతో పాటు స్వదేశీ అనుకూలతను సొమ్ము చేసుకుని అమెరికాపై సంచలన ప్రదర్శన కనబరచాలనే భావనలో భారత్ ఉంది. భారత్, అమెరికా జట్ల మధ్య తొలి మ్యాచ్‌ను వీక్షించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ హాజరవుతారు. అనుభవలేమితో భారత్... ఈ మెగా ఈవెంట్ ఆతిథ్య హక్కులను దక్కించుకున్న అనంతరం ఆటగాళ్ల ఎంపిక కోసం భారత ఫుట్‌బాల్ సమాఖ్య పెద్ద కసరత్తే చేసింది. 2015లో అండర్–17 కోచ్‌గా ఎంపికైన ఆడమ్ దేశవ్యాప్తంగా ట్రయల్స్, టోర్నీలను నిర్వహించి అత్యుత్తమంగా కనిపించిన కుర్రాళ్లతో జట్టును తయారుచేశారు. అయితే రెండేళ్ల అనంతరం ఆటగాళ్లను దూషించారనే కారణంతో ఆయన పదవి నుంచి వైదొలగాల్సి వచ్చింది. తాజా కోచ్ అయిన పోర్చుగల్‌కు చెందిన డి మటోస్ జట్టులో చాలా మార్పులు చేశారు. మరోవైపు అంతర్జాతీయ వేదికలపై పెద్దగా ఆడిన అనుభవం లేకపోవడం జట్టుకు భారీ లోటు. వీరందరికీ ఇదే తొలి ప్రపంచకప్. అమెరికా ఆటగాళ్లలాగా ప్రొఫెషనల్ అకాడమీలకు హాజరైన అనుభవం ఎవరికీ లేదు. అందుకే జట్టు నుంచి ఎలాంటి అద్భుతాలు ఆశించకూడదని కోచ్ ముందే ప్రకటించారు. స్వదేశీ ఆటగాళ్లకు విదేశీ జట్ల ఆటగాళ్లకు మధ్య భారీ వ్యత్యాసమే ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. అటాకింగ్‌లో గట్టిగా ఉన్న అమెరికాను తమ పటిష్ట డిఫెన్స్ విభాగంతో అడ్డుకుంటామని కోచ్ చెప్పారు. ఆరు అడుగుల రెండు అంగుళాల ఎత్తున్న మిడ్‌ఫీల్డర్ జీక్సన్ సింగ్‌పై కోచ్ భారీ ఆశలే పెట్టుకున్నారు. అతడికి మిడ్‌ఫీల్డ్‌లో సహకరించేందుకు కెప్టెన్ అమర్జిత్, సురేశ్ సిద్ధంగా ఉంటారు. అన్వర్ అలీ, జితేందర్ సెంటర్బ్యాక్స్లో సంజీవ్ ఫుల్ బ్యాక్... ఆంటోనీ రైట్ బ్యాక్‌లో కీలకం కానున్నారు. దూకుడుగా అమెరికా... అన్ని విభాగాల్లో అమెరికానే భారత్‌కన్నా పటిష్టంగా కనిపిస్తోంది. ఈ జట్టులో ఉన్న 17 మంది ఆటగాళ్లు ఏప్రిల్‌లో జరిగిన కాన్కాకాఫ్ అండర్–17 చాంపియన్‌షిప్ ఆడిన జట్టులోనూ సభ్యులుగా ఉన్నారు. ఫైనల్‌దాకా వెళ్లిన ఈ జట్టు మెక్సికో చేతిలో ఓడింది. ఇక కెప్టెన్, స్ట్రయికర్ అయిన జోష్ సార్జెంట్ వచ్చే ఫిబ్రవరిలో బుండెస్లిగా క్లబ్ వెర్డర్ బ్రెమెన్‌తో ఒప్పందం కుదుర్చుకోబోతున్నాడంటే అతడి ఆట స్థాయి అర్థం చేసుకోవచ్చు. ఈ ఏడాది ఆరంభంలో తను అండర్–20 ప్రపంచకప్‌లోనూ ఆడటం విశేషం. జట్లు: భారత్: అమర్జిత్ సింగ్ (కెప్టెన్), అన్వర్, ధీరజ్ సింగ్, ప్రభ్షుకన్, సన్నీ ధలివాల్, జితేంద్ర సింగ్, సంజీవ్ స్టాలిన్, ఆంటోనీ, నమిత్ దేశ్‌పాండే, సురేశ్ సింగ్, మీటేయి, అభిజిత్ సర్కార్, కోమల్ తటాల్, లాలెంగ్మవాయి, జీక్సన్ సింగ్, నవోరెమ్, రాహుల్, షాజహాన్, రహీమ్ అలీ, అనికేత్. అమెరికా: సార్జెంట్ (కెప్టెన్), కార్లోస్, అలెక్స్, గార్సెస్, సెర్గీనో, గ్లోస్టర్, లిండ్సే, సాండ్స్, షావెర్, వాట్స్, అకోస్టా, బూత్, డుర్కిన్, ఫెర్రీ, గోస్లిన్, వాసిలేవ్, అకినోలా, కార్ల్టన్, వియా, రేయేస్, రేనాల్డ్స్, జోషువా. అండర్–17 ప్రపంచకప్‌లో నేడు లంబియా * ఘనా సా.గం. 5.00 నుంచి భారత్* అమెరికా రా.గం. 8.00 నుంచి వేదిక: న్యూఢిల్లీ న్యూజిలాండ్ * టర్కీ సా.గం. 5.00 నుంచి పరాగ్వే* మాలి రా.గం. 8.00 నుంచి వేదిక: ముంబై -
అవకాశం వదలొద్దు!
ఒకప్పుడు అంతర్జాతీయ స్థాయిలో భారత ఫుట్‌బాల్ జట్టు తమ అద్వితీయ ప్రదర్శనతో మెరుపులు మెరిపించింది. అయితే కాలానుగుణంగా ఆటలో వచ్చిన మార్పులకు తగ్గట్టు భారత ఫుట్‌బాల్ రూపాంతరం చెందలేకపోయింది. ఫలితమే నేడు తమ ఉనికి కోసం పోరాడాల్సి వస్తోంది. చిన్నాచితక దేశాలు కూడా పురుషుల ప్రపంచకప్‌కు అర్హత సాధిస్తుండగా... భారత్ మాత్రం ఆమడదూరంలో నిలుస్తోంది. అయితే అండర్–17 ప్రపంచకప్ ఆతిథ్యం ద్వారా ఈ ఆటకు పునరుజ్జీవం కలిగించే సదవకాశం అఖిల భారత ఫుట్‌బాల్ సమాఖ్య (ఏఐఎఫ్ఎఫ్)కు లభించింది. అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఇటు భారత కుర్రాళ్లు భవిష్యత్‌కు భరోసా కల్పించాలి. ఆతిథ్యంతోనే మురిసిపోకుండా ఈ మెగా ఈవెంట్ తర్వాత కూడా ఆటను పట్టించుకొని దేశంలో ఈ క్రీడకు పూర్వ వైభవం తెచ్చేందుకు అటు సమాఖ్య నిరంతర చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. సాక్షి క్రీడా విభాగం : మెల్బోర్న్ (1956) ఒలింపిక్స్‌లో నాలుగో స్థానం... 1951 న్యూఢిల్లీ, 1962 జకార్తా ఆసియా క్రీడల్లో స్వర్ణాలు... 1964 ఆసియా కప్‌లో రన్నరప్...కానీ ఈ ఫలితాలన్నీ గత వైభవమే. ఏనాడూ భారత్‌కు ప్రపంచకప్‌లో తమ సత్తా చాటుకునేందుకు అవకాశం రాలేదు. 87 ఏళ్ల చరిత్ర ఉన్న సీనియర్ ప్రపంచకప్‌లో ఇప్పటివరకు భారత్ అర్హత సాధించలేదు. వివిధ వయో విభాగాల్లో (అండర్–17, అండర్–20) జరిగే ఇతర ప్రపంచకప్‌లలోనూ భారత్ ఏనాడూ బరిలోకి దిగలేదు. కానీ నాలుగేళ్ల క్రితం భారత్‌కు అండర్–17 వయో విభాగం రూపంలో తొలిసారి ప్రపంచకప్‌ను నిర్వహించే ఆతిథ్య హక్కులు లభించాయి. అనంతరం అఖిల భారత ఫుట్‌బాల్ సమాఖ్య (ఏఐఎఫ్ఎఫ్) భారత జట్టు ఎంపిక కోసం ప్రతిభాన్వేషణ చేపట్టడం... ఆటగాళ్లను ఎంపిక చేయడం... వారికి నిలకడగా శిబిరాలు ఏర్పాటు చేయడం... విదేశీ జట్లతో 50 కంటే ఎక్కువగా ఫ్రెండ్లీ మ్యాచ్‌లను నిర్వహించడం... మొత్తానికి సొంతగడ్డపై జరగనున్న ఈ మెగా ఈవెంట్ ద్వారా అత్యుత్తమ ప్రదర్శనతో భారత్ అందరి దృష్టిని ఆకట్టుకోవాలనే పట్టుదలతో ఉంది. గత రెండేళ్లలో భారత యువ జట్టుపై ఏఐఎఫ్ఎఫ్ రూ. 10 కోట్లు వెచ్చించింది. ఇటీవలే ఏఐఎఫ్ఎఫ్ 2019లో జరిగే అండర్–20 ప్రపంచకప్ ఆతిథ్యం కోసం బిడ్ కూడా దాఖలు చేసింది. ఒకవేళ అండర్–17 ప్రపంచకప్ సక్సెస్ అయితే భారత్‌కు మరో వరల్డ్ కప్ నిర్వహించే భాగ్యం దక్కినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఒకప్పుడు అంతర్జాతీయస్థాయిలో తమకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించిన భారత ఫుట్‌బాల్‌కు పూర్వ వైభవం లభించే అవకాశం అండర్–17 ప్రపంచ కప్ ద్వారా లభించింది. అయితే ఏ క్రీడలోనూ రాత్రికి రాత్రే గొప్ప ఫలితాలు రావు. ఈ మెగా ఈవెంట్ ద్వారా భారత్ త్వరలోనే ఫుట్‌బాల్‌లో మేటి జట్టుగా మారుతుందని కూడా ఆశించలేం. అయితే ఈ ప్రపంచకప్ భారత ఫుట్‌బాల్ భవిష్యత్‌కు సరైన దిశానిర్దేశనం చేయగలదని భావించవచ్చు. -
కుర్రాళ్ల ‘కిక్’
ప్రపంచ వ్యాప్తంగా ఫుట్‌బాల్ అంటే ఒక వ్యసనం... పెద్ద సంఖ్యలో దేశాలు, కోట్లాది అభిమానులు ఈ ఆటంటే పడి చచ్చిపోతారు. కానీ భారత్‌కు వచ్చే సరికి క్రికెట్ మాత్రమే దైవం. ఎక్కడో కేరళ, గోవా, బెంగాల్లో కొంత వరకు తప్ప మన దేశంలో ఫుట్‌బాల్ దాదాపుగా చచ్చిపోయింది! నాలుగేళ్లకు ఒకసారి వరల్డ్ కప్ వచ్చినప్పుడు మాత్రం మనలో కాస్త ఉత్సాహం మెస్సీ, రొనాల్డో జెర్సీలు ధరించ డంలో కనిపిస్తుంది. విశ్వ వేదికపై ఆటపరంగా అథమంగా ఉన్న భారత్... ఆతిథ్యం పేరుతోనైనా ఫుట్‌బాల్‌కు కొత్త జీవాన్ని అందించేందుకు సిద్ధమైంది. తొలిసారి ప్రపంచ కప్ నిర్వహణతో పాటు, మొదటిసారి ఏ స్థాయిలోనైనా ప్రపంచకప్‌లో పాల్గొంటూ భారత్ ఉనికిని చాటుకునే ప్రయత్నం చేస్తోంది. ఈ నెల 6 నుంచి 28 వరకు ఆరు వేదికల్లో జరిగే అండర్–17 వరల్డ్‌కప్‌తో దేశంలో 23 రోజుల పాటు ఫుట్‌బాల్ ‘కిక్’ పెరగడం మాత్రం ఖాయం. ఈ కుర్రాళ్ల టోర్నీ సంబరంలో మీరు కూడా భాగం కండి! సాక్షి క్రీడా విభాగం : సీనియర్ ఫుట్‌బాల్‌లో 1930లో తొలి వరల్డ్ కప్ జరిగింది. ఐదున్నర దశాబ్దాల తర్వాత సీనియర్ స్థాయికి ముందు టీనేజీ కుర్రాళ్లు తమ సత్తాను చాటేందుకు ఒక వేదిక అవసరమని భావించి ‘ఫిఫా’ 1985లో ఈ టోర్నమెంట్‌ను ప్రారంభించింది. ఇప్పటి వరకు 16 సార్లు ఈ టోర్నీ జరిగింది. సరిగ్గా నాలుగేళ్ల క్రితం 2013లోనే భారత్‌కు ఆతిథ్య హక్కులు లభించాయి. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ టోర్నీని విజయవంతంగా నిర్వహించేందుకు అఖిల భారత ఫుట్‌బాల్ సమాఖ్య (ఏఐఎఫ్ఎఫ్) తీవ్రంగా శ్రమించింది. ‘ఫిఫా’లో భాగమైన ఆరు ఖండాల్లో క్వాలిఫయింగ్ టోర్నీ ద్వారా ఇందులో పాల్గొనే మిగతా 23 జట్లను ఎంపిక చేశారు. 2017లో భారత జట్టు తమ తొలి అధికారిక అంతర్జాతీయ స్థాయి మ్యాచ్‌ను ఈ టోర్నీలోనే ఆడనుండటం విశేషం. భారత్‌తో పాటు నైజర్, న్యూ కలిడొనియా తొలిసారి ప్రపంచకప్‌లో పాల్గొంటున్నాయి. అండర్–17 టోర్నీ ప్రారంభమైన నాటి నుంచి ఆఫ్రికా జట్టు నైజీరియా ఆధిపత్యం కొనసాగింది. ఐదు సార్లు విజేతగా నిలిచిన ఆ జట్టు, వేర్వేరు విభాగాల్లో రికార్డులు నెలకొల్పింది. మరో నాలుగు సార్లు ఈ టీమ్ నాలుగు సార్లు ‘ఫిఫా’ ఫెయిర్ ప్లే అవార్డు కూడా గెలుచుకుంది. ఫార్మాట్ మొత్తం 24 జట్లను ఆరు గ్రూప్‌లుగా విభజించారు. ప్రతీ జట్టు తమ గ్రూప్‌లోని ఇతర మూడు జట్లతో తలపడుతుంది. లీగ్ దశ ముగిశాక 16 జట్లు నాకౌట్ దశకు అర్హత సాధిస్తాయి. పాయింట్ల ప్రకారం ప్రతీ గ్రూప్ నుంచి టాప్–2 టీమ్‌లతో పాటు... అన్ని గ్రూప్‌లలో మూడో స్థానంలో నిలిచిన జట్లలో కలిపి అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చిన మరో నాలుగు టీమ్‌లు ముందంజ వేస్తాయి. ఇక్కడి నుంచి నాకౌట్ దశ మొదలవుతుంది. అనంతరం క్వార్టర్ ఫైనల్, సెమీస్, ఫైనల్ నిర్వహిస్తారు. అక్టోబర్ 28న కోల్‌కతాలోని సాల్ట్‌లేక్ స్టేడియం (సామర్థ్యం 66, 600)లో ఫైనల్ జరుగుతుంది. గ్రూప్‌ల వివరాలు ఎ: భారత్, అమెరికా, కొలంబియా, ఘనా బి: పరాగ్వే, మాలి, న్యూజిలాండ్, టర్కీ సి: ఇరాన్, గినియా, జర్మనీ, కోస్టారికా డి: కొరియా, నైజర్, బ్రెజిల్, స్పెయిన్ ఇ: హోండూరస్, జపాన్, న్యూ కెలడోనియా, ఫ్రాన్స్ ఎఫ్: ఇరాక్, మెక్సికో, చిలీ, ఇంగ్లండ్ భారత్ లీగ్ మ్యాచ్‌ల షెడ్యూల్ అక్టోబర్ 6: భారత్ గీ అమెరికా (న్యూఢిల్లీ) అక్టోబర్ 9: భారత్ గీ కొలంబియా (న్యూఢిల్లీ) అక్టోబర్ 12: భారత్ గీ ఘనా (న్యూఢిల్లీ) భారత్ స్థాయి ఏమిటి? మన దేశంలో ఫుట్‌బాల్‌కు ఉన్న ఆదరణతో పోలిస్తే వరల్డ్ కప్‌లాంటి మెగా ఈవెంట్ నిర్వహించే అవకాశం రావడమే ఏఐఎఫ్ఎఫ్ పెద్ద ఘనతగా భావించింది. ఆతిథ్య జట్టు కావడం వల్ల టోర్నీ ఎక్కువ మందికి చేరే అవకాశం ఉంటుందని కూడా సమాఖ్య భావిస్తోంది. అయితే మైదానంలో కూడా మన జట్టు ఆ ముద్ర వేయగలిగితే ఇంకా బాగుంటుందని అభిమానులు కోరుకుంటున్నారు. ఆతిథ్య జట్టు కాబట్టే అవకాశం దక్కించుకోగలిగామే తప్ప భారత్ క్వాలిఫై కాకపోయేదని నిస్సందేహంగా చెప్పవచ్చు. మన కుర్రాళ్లు టోర్నీ కోసం చాలా కాలంగా ప్రత్యేక క్యాంప్‌లతో కఠోర సాధన చేశారు. కానీ మన ప్రమాణాల ప్రకారం చూస్తే ఫలితం అంత గొప్పగా ఉంటుందని చెప్పలేం. తమ గ్రూప్‌లో ఉన్న జట్లలో మొదటి మ్యాచ్‌లో అమెరికాతో భారత్ తలపడుతోంది. 16వ సారి ఈ టోర్నీలో బరిలోకి దిగుతున్న అమెరికాను ఓడించడం అంత సులువు కాదు. ఆపై ఫుట్‌బాల్‌కు అడ్డాల్లాంటి కొలంబియా, ఘనా జట్లకు కూడా మన టీమ్ ఏమాత్రం పోటీనిస్తుందనేది చెప్పలేం. మొత్తంగా మన జట్టు చిత్తుగా ఓడి చెత్త రికార్డులు నెలకొల్పకుండా పరువు నిలబెట్టుకుంటే అందరూ కోరుకున్నట్లుగా వరల్డ్ కప్ నిర్వహణ వల్ల కాస్తంతయినా మన దేశంలో ఫుట్‌బాల్‌కు గౌరవం, ఆదరణ పెరుగుతాయి. ►మొత్తం జట్లు 24 ►మొత్తం మ్యాచ్‌లు 52 మొత్తం వేదికలు 6 కోల్‌కతా, న్యూఢిల్లీ, గోవా, కొచ్చి, గువాహటి, నవీ ముంబై. ►ఈ సారి జరిగిన అర్హత టోర్నీలో ఐదు ఖండాలు అండర్–17 స్థాయిలోనే పోటీలు నిర్వహించగా... ఒక్క ఆసియా క్వాలిఫికేషన్ టోర్నీ మాత్రం అండర్–16 స్థాయిలో జరిగింది. మరికొన్ని... ► డిఫెండింగ్ చాంపియన్, ఐదు సార్లు విజేతగా నిలిచిన నైజీరియా (2015) ఈ సారి వరల్డ్ కప్‌కు అర్హత సాధించకపోవడం విశేషం. నైజీరియాను చిత్తు చేసి నైజర్ క్వాలిఫై అయ్యింది. ►‘ఫిఫా’ ఫైనల్స్‌లో భారత్ 57 సంవత్సరాల తర్వాత అడుగు పెట్టగలిగింది. 1948, 1952, 1956, 1960లలో భారత జట్టు వరుసగా నాలుగు ఒలింపిక్స్‌లలో పాల్గొంది. ►టోర్నీ నిబంధనలు అన్ని ‘ఫిఫా’ సీనియర్ మ్యాచ్‌లలాగే ఉంటాయి. అయితే 90 నిమిషాల తర్వాత అదనపు సమయం మాత్రం లేదు. నాకౌట్ దశలో స్కోర్లు సమమైతే నేరుగా పెనాల్టీ షూటౌట్‌కు వెళ్లిపోతారు. ఇదీ మన యువ సైన్యం ధీరజ్ మొయిరంగ్తెమ్, ప్రభ్‌సుఖన్ గిల్, సన్నీ ధలివాల్ (గోల్‌కీపర్లు), అనికేత్ జాదవ్, రహీమ్ అలీ (ఫార్వర్డ్లు), నిన్తోఇన్గన్బా మీటీ, అభిజిత్ సర్కార్, లాలెంగ్మావియా, నోంగ్డంబా నావోరెమ్, మొహమ్మద్ షాజహాన్, అమర్జిత్ కియామ్ (కెప్టెన్), కోమల్ తతల్, రాహుల్ కనోలీ, సురేశ్ వాంగ్జమ్, జేక్సన్ తోనైజమ్ (మిడ్‌ఫీల్డర్లు), అన్వర్ అలీ, బోరిస్ తంగ్జమ్, సంజీవ్ స్టాలిన్, జితేంద్ర సింగ్, హెండ్రీ ఆంటోనీ, నమిత్ దేశ్‌పాండే (డిఫెండర్లు). -
ఇది కోల్‌కతా అభిమానం!
కోల్‌కతా: దేశంలో ఫుట్‌బాల్‌ను పిచ్చిగా ప్రేమించేవారిలో బెంగాలీలు ముందుం టారు. క్రికెట్ క్రేజ్ ఉన్న సమయంలో కూడా కోల్‌కతాలో ఫుట్‌బాల్ వినోదానికి కొదవుండదు. అది అండర్–17 స్థాయిదే అయి నా ఆటపై వారి అభిమానంలో తేడా ఉండదు. మన దేశంలో అక్టోబర్‌లో నిర్వహించే అండర్–17 ఫుట్‌బాల్ ప్రపంచకప్‌కు టికెట్లు ఇలా ఆన్లైన్లో పెట్టారో లేదో.. అలా 12 గంటలు గడిచేలోపు ‘సోల్డ్ అవుట్’ బోర్డ్‌లు వేలాడుతున్నాయి. కోల్‌కతాలో జరిగే 10 మ్యాచ్‌లకు (ఫైనల్‌తో కలిపి) టికెట్లను అందుబాటులో ఉంచగా, వాటన్నిం టినీ ఒక్కపూటలోనే కొనేయడం విశేషం. -
రష్యా 8... భారత్ 0
న్యూఢిల్లీ: భారత్‌లో ఈ ఏడాది జరుగనున్న అండర్–17 ‘ఫిఫా’ ఫుట్‌బాల్ వరల్డ్ కప్‌కు సిద్ధమవుతున్న భారత యువ జట్టుకు ఘోర పరాజయం ఎదురైంది. రష్యాలోని సెయింట్ పీటర్స్‌బర్గ్‌లో జరుగుతున్న వాలెంటిన్ గ్రనాట్కిన్ స్మారక కప్‌లో భాగంగా రష్యా అండర్–18 జట్టుతో జరిగిన మ్యాచ్‌లో భారత అండర్–17 జట్టు 0–8 గోల్స్ తేడాతో ఓడిపోయింది. తొలి అర్ధభాగంలో రష్యా 5–0తో ఆధిక్యంలో నిలిచింది. ఆట రెండో నిమిషంలోనే గ్లష్కోవ్ చేసిన గోల్‌తో రష్యా ఖాతా తెరిచింది. ఆ తర్వాత కూడా రష్యా ఇదే జోరు కొనసాగించింది. ఇదే టోర్నీలో భాగంగా మంగళవారం బెలారస్‌తో భారత్ తలపడుతుంది.