ప్రపంచ కప్ ఫుట్‌బాల్ ఫైనల్ మ్యాచ్... 31 నిమిషాలు ముగిసేసరికి 0–2తో వెనుకంజ... ఇలాంటి స్థితిలో ఏ జట్టయినా గెలుపుపై ఆశలు వదిలేసుకుంటుంది... కానీ ఇంగ్లండ్ పోరాటం ఆపలేదు. అద్భుతమైన ఆటతీరుతో కోలుకొని స్పెయిన్‌పై ఎదురుదాడికి దిగింది. వరుస గోల్స్‌తో ఉక్కిరిబిక్కిరి చేసింది. 46 నిమిషాల వ్యవధిలో ఏకంగా ఐదు గోల్స్ నమోదు చేసి అండర్–17 ఫుట్‌బాల్ ప్రపంచకప్‌లో తొలిసారి విజేతగా నిలిచింది. 66,684 మంది ప్రేక్షకుల సమక్షంలో కొత్త చరిత్రను సృష్టించింది.
కోల్‌కతా: భారతగడ్డపై తొలిసారి అట్టహాసంగా నిర్వహించిన ‘ఫిఫా’ అండర్–17 ప్రపంచకప్‌లో ఇంగ్లండ్ ‘కిక్’ అదిరింది. ‘లయన్స్‘ విజృంభణతో ఆ జట్టు తొలిసారి జగజ్జేతగా నిలిచింది. శనివారం ఇక్కడి సాల్ట్‌లేక్ స్టేడియంలో భారీ సంఖ్యలో హాజరైన అభిమానులను అలరించిన ఫైనల్లో ఇంగ్లండ్ 5–2 తేడాతో స్పెయిన్‌ను చిత్తుగా ఓడించింది. ఇంగ్లండ్ తరఫున బ్రూస్టర్ (44వ నిమిషం), గిబ్స్ (58వ ని.లో), ఫిల్ ఫాడెన్ (69వ, 88వ ని.లో), మార్క్ గుహి (84వ ని.లో) గోల్స్ సాధించగా... స్పెయిన్ తరఫున సెర్గియో గోమెజ్ (10వ, 31వ ని.లో) రెండు గోల్స్ చేశాడు. ఇదే ఏడాది అండర్–20 ప్రపంచకప్‌ను కూడా గెలుచుకున్న ఇంగ్లండ్‌కు ఇది మరో చిరస్మరణీయ విజయం కావడం విశేషం. ఈ మెగా టోర్నీలో నాలుగోసారి ఫైనల్‌కు చేరిన స్పెయిన్ మళ్లీ రన్నరప్ టైటిల్‌తో సంతృప్తి చెందాల్సి వచ్చింది. మరోవైపు అటు ఆటగాళ్ల అద్భుత ప్రదర్శన, ఇటు ప్రేక్షకుల అమితాభిమానం కలగలిసి ఈ వరల్డ్ కప్ భారత్‌లో ఆదరణ పరంగా సూపర్‌హిట్‌గా నిలవడం ఏఐఎఫ్‌ఎఫ్ సాధించిన అతి పెద్ద విజయం.
వెనుకంజ నుంచి విజయం వైపు...
మ్యాచ్ మొదలైన 47 సెకన్లలోనే ఇంగ్లండ్ ద్వయం బ్రూస్టర్–గిబ్స్ గోల్ అవకాశం సృష్టించినా అది సఫలం కాలేదు. అయితే 10వ నిమిషంలోనే గోమెజ్ చేసిన గోల్‌తో స్పెయిన్‌కు ఆధిక్యం దక్కింది. ఆ తర్వాత కూడా దాడులు కొనసాగించిన స్పెయిన్ 31వ నిమిషంలో మళ్లీ ఫలితం సాధించింది. ఇంగ్లండ్ రక్షణశ్రేణిని మరోసారి ఛేదించి గోమెజ్ మళ్లీ గోల్ నమోదు చేయడంతో ఇంగ్లండ్ విస్తుపోయింది. అయితే తొలి అర్ధభాగం ముగియడానికి కొద్దిసేపు ముందు హెడర్ ద్వారా బ్రూస్టర్ గోల్ సాధించడంతో ఇంగ్లండ్ కోలుకుంది. బ్రూస్టర్‌కు టోర్నీలో ఇది ఎనిమిదో గోల్ కావడం విశేషం. రెండో అర్ధ భాగంలో ఇంగ్లండ్ చెలరేగిపోయింది. 58వ నిమిషంలో ఫాడెన్ ఇచ్చిన పాస్‌ను సెసెగ్నాన్ అందుకోవడంలో విఫలమైనా... మరోవైపు నుంచి దూసుకొచ్చిన గిబ్స్ ఆరు అడుగుల దూరం నుంచి గోల్ కొట్టి స్కోర్ సమం చేశాడు. 69వ నిమిషంలో ఫాడెన్ చేసిన సునాయాస గోల్‌తో ఇంగ్లండ్‌కు ఆధిక్యం దక్కింది. ఆ తర్వాత గుహి 84వ నిమిషంలో చేసిన గోల్‌తో ఇంగ్లండ్‌ను విజయం దిశగా వెళ్లగా... మ్యాచ్ రెండు నిమిషాల్లో ముగుస్తుందనగా ‘ప్లేయర్ ఆఫ్ టోర్నమెంట్’ ఫాడెన్ మరో గోల్‌తో ఇంగ్లండ్‌ను ఆనం దంలో ముంచాడు. అంతకుముందు బ్రెజిల్ 2–0తో మాలిపై విజయం సాధించి టోర్నీలో మూడో స్థానంలో నిలిచింది.
Comments
Please login to add a commentAdd a comment