
ఒకప్పుడు అంతర్జాతీయ స్థాయిలో భారత ఫుట్‌బాల్ జట్టు తమ అద్వితీయ ప్రదర్శనతో మెరుపులు మెరిపించింది. అయితే కాలానుగుణంగా ఆటలో వచ్చిన మార్పులకు తగ్గట్టు భారత ఫుట్‌బాల్ రూపాంతరం చెందలేకపోయింది. ఫలితమే నేడు తమ ఉనికి కోసం పోరాడాల్సి వస్తోంది. చిన్నాచితక దేశాలు కూడా పురుషుల ప్రపంచకప్‌కు అర్హత సాధిస్తుండగా... భారత్ మాత్రం ఆమడదూరంలో నిలుస్తోంది. అయితే అండర్–17 ప్రపంచకప్ ఆతిథ్యం ద్వారా ఈ ఆటకు పునరుజ్జీవం కలిగించే సదవకాశం అఖిల భారత ఫుట్‌బాల్ సమాఖ్య (ఏఐఎఫ్‌ఎఫ్)కు లభించింది. అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఇటు భారత కుర్రాళ్లు భవిష్యత్‌కు భరోసా కల్పించాలి. ఆతిథ్యంతోనే మురిసిపోకుండా ఈ మెగా ఈవెంట్ తర్వాత కూడా ఆటను పట్టించుకొని దేశంలో ఈ క్రీడకు పూర్వ వైభవం తెచ్చేందుకు అటు సమాఖ్య నిరంతర చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.
సాక్షి క్రీడా విభాగం : మెల్‌బోర్న్ (1956) ఒలింపిక్స్‌లో నాలుగో స్థానం... 1951 న్యూఢిల్లీ, 1962 జకార్తా ఆసియా క్రీడల్లో స్వర్ణాలు... 1964 ఆసియా కప్‌లో రన్నరప్...కానీ ఈ ఫలితాలన్నీ గత వైభవమే. ఏనాడూ భారత్‌కు ప్రపంచకప్‌లో తమ సత్తా చాటుకునేందుకు అవకాశం రాలేదు. 87 ఏళ్ల చరిత్ర ఉన్న సీనియర్ ప్రపంచకప్‌లో ఇప్పటివరకు భారత్ అర్హత సాధించలేదు. వివిధ వయో విభాగాల్లో (అండర్–17, అండర్–20) జరిగే ఇతర ప్రపంచకప్‌లలోనూ భారత్ ఏనాడూ బరిలోకి దిగలేదు. కానీ నాలుగేళ్ల క్రితం భారత్‌కు అండర్–17 వయో విభాగం రూపంలో తొలిసారి ప్రపంచకప్‌ను నిర్వహించే ఆతిథ్య హక్కులు లభించాయి. అనంతరం అఖిల భారత ఫుట్‌బాల్ సమాఖ్య (ఏఐఎఫ్‌ఎఫ్) భారత జట్టు ఎంపిక కోసం ప్రతిభాన్వేషణ చేపట్టడం... ఆటగాళ్లను ఎంపిక చేయడం... వారికి నిలకడగా శిబిరాలు ఏర్పాటు చేయడం... విదేశీ జట్లతో 50 కంటే ఎక్కువగా ఫ్రెండ్లీ మ్యాచ్‌లను నిర్వహించడం... మొత్తానికి సొంతగడ్డపై జరగనున్న ఈ మెగా ఈవెంట్ ద్వారా అత్యుత్తమ ప్రదర్శనతో భారత్ అందరి దృష్టిని ఆకట్టుకోవాలనే పట్టుదలతో ఉంది.
గత రెండేళ్లలో భారత యువ జట్టుపై ఏఐఎఫ్‌ఎఫ్ రూ. 10 కోట్లు వెచ్చించింది. ఇటీవలే ఏఐఎఫ్‌ఎఫ్ 2019లో జరిగే అండర్–20 ప్రపంచకప్ ఆతిథ్యం కోసం బిడ్ కూడా దాఖలు చేసింది. ఒకవేళ అండర్–17 ప్రపంచకప్ సక్సెస్ అయితే భారత్‌కు మరో వరల్డ్ కప్ నిర్వహించే భాగ్యం దక్కినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఒకప్పుడు అంతర్జాతీయస్థాయిలో తమకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించిన భారత ఫుట్‌బాల్‌కు పూర్వ వైభవం లభించే అవకాశం అండర్–17 ప్రపంచ కప్ ద్వారా లభించింది. అయితే ఏ క్రీడలోనూ రాత్రికి రాత్రే గొప్ప ఫలితాలు రావు. ఈ మెగా ఈవెంట్ ద్వారా భారత్ త్వరలోనే ఫుట్‌బాల్‌లో మేటి జట్టుగా మారుతుందని కూడా ఆశించలేం. అయితే ఈ ప్రపంచకప్ భారత ఫుట్‌బాల్ భవిష్యత్‌కు సరైన దిశానిర్దేశనం చేయగలదని భావించవచ్చు.