కుర్రాళ్ల ‘కిక్‌’ | Under-17 Football World Cup started | Sakshi
Sakshi News home page

కుర్రాళ్ల ‘కిక్‌’

Published Wed, Oct 4 2017 12:50 AM | Last Updated on Wed, Oct 4 2017 2:50 AM

Under-17 Football World Cup started

ప్రపంచ వ్యాప్తంగా ఫుట్‌బాల్‌ అంటే ఒక వ్యసనం... పెద్ద సంఖ్యలో దేశాలు, కోట్లాది అభిమానులు ఈ ఆటంటే పడి చచ్చిపోతారు. కానీ భారత్‌కు వచ్చే సరికి క్రికెట్‌ మాత్రమే దైవం. ఎక్కడో కేరళ, గోవా, బెంగాల్‌లో కొంత వరకు తప్ప మన దేశంలో ఫుట్‌బాల్‌ దాదాపుగా చచ్చిపోయింది! నాలుగేళ్లకు ఒకసారి వరల్డ్‌ కప్‌ వచ్చినప్పుడు మాత్రం మనలో కాస్త ఉత్సాహం మెస్సీ, రొనాల్డో జెర్సీలు ధరించ డంలో కనిపిస్తుంది. విశ్వ వేదికపై ఆటపరంగా అథమంగా ఉన్న భారత్‌... ఆతిథ్యం పేరుతోనైనా ఫుట్‌బాల్‌కు కొత్త జీవాన్ని అందించేందుకు సిద్ధమైంది. తొలిసారి ప్రపంచ కప్‌ నిర్వహణతో పాటు, మొదటిసారి ఏ స్థాయిలోనైనా ప్రపంచకప్‌లో పాల్గొంటూ భారత్‌ ఉనికిని చాటుకునే ప్రయత్నం చేస్తోంది. ఈ నెల 6 నుంచి 28 వరకు ఆరు వేదికల్లో జరిగే అండర్‌–17 వరల్డ్‌కప్‌తో దేశంలో 23 రోజుల పాటు ఫుట్‌బాల్‌ ‘కిక్‌’ పెరగడం మాత్రం ఖాయం. ఈ కుర్రాళ్ల టోర్నీ సంబరంలో మీరు కూడా భాగం కండి!   

సాక్షి క్రీడా విభాగం : సీనియర్‌ ఫుట్‌బాల్‌లో 1930లో తొలి వరల్డ్‌ కప్‌ జరిగింది. ఐదున్నర దశాబ్దాల తర్వాత సీనియర్‌ స్థాయికి ముందు టీనేజీ కుర్రాళ్లు తమ సత్తాను చాటేందుకు ఒక వేదిక అవసరమని భావించి ‘ఫిఫా’ 1985లో ఈ టోర్నమెంట్‌ను ప్రారంభించింది. ఇప్పటి వరకు 16 సార్లు ఈ టోర్నీ జరిగింది. సరిగ్గా నాలుగేళ్ల క్రితం 2013లోనే భారత్‌కు ఆతిథ్య హక్కులు లభించాయి. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ టోర్నీని విజయవంతంగా నిర్వహించేందుకు అఖిల భారత ఫుట్‌బాల్‌ సమాఖ్య (ఏఐఎఫ్‌ఎఫ్‌) తీవ్రంగా శ్రమించింది. ‘ఫిఫా’లో భాగమైన ఆరు ఖండాల్లో క్వాలిఫయింగ్‌ టోర్నీ ద్వారా ఇందులో పాల్గొనే మిగతా 23 జట్లను ఎంపిక చేశారు. 2017లో భారత జట్టు తమ తొలి అధికారిక అంతర్జాతీయ స్థాయి మ్యాచ్‌ను ఈ టోర్నీలోనే ఆడనుండటం విశేషం. భారత్‌తో పాటు నైజర్, న్యూ కలిడొనియా తొలిసారి ప్రపంచకప్‌లో పాల్గొంటున్నాయి. అండర్‌–17 టోర్నీ ప్రారంభమైన నాటి నుంచి ఆఫ్రికా జట్టు నైజీరియా ఆధిపత్యం కొనసాగింది. ఐదు సార్లు విజేతగా నిలిచిన ఆ జట్టు, వేర్వేరు విభాగాల్లో రికార్డులు నెలకొల్పింది. మరో నాలుగు సార్లు ఈ టీమ్‌ నాలుగు సార్లు ‘ఫిఫా’ ఫెయిర్‌ ప్లే అవార్డు కూడా గెలుచుకుంది. 

ఫార్మాట్‌
మొత్తం 24 జట్లను ఆరు గ్రూప్‌లుగా విభజించారు. ప్రతీ జట్టు తమ గ్రూప్‌లోని ఇతర మూడు జట్లతో తలపడుతుంది. లీగ్‌ దశ ముగిశాక 16 జట్లు నాకౌట్‌ దశకు అర్హత సాధిస్తాయి. పాయింట్ల ప్రకారం ప్రతీ గ్రూప్‌ నుంచి టాప్‌–2 టీమ్‌లతో పాటు... అన్ని గ్రూప్‌లలో మూడో స్థానంలో నిలిచిన జట్లలో కలిపి అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చిన మరో నాలుగు టీమ్‌లు ముందంజ వేస్తాయి. ఇక్కడి నుంచి నాకౌట్‌ దశ మొదలవుతుంది. అనంతరం క్వార్టర్‌ ఫైనల్, సెమీస్, ఫైనల్‌ నిర్వహిస్తారు. అక్టోబర్‌ 28న కోల్‌కతాలోని సాల్ట్‌లేక్‌ స్టేడియం (సామర్థ్యం 66, 600)లో ఫైనల్‌ జరుగుతుంది.  

గ్రూప్‌ల వివరాలు
ఎ:    భారత్, అమెరికా, కొలంబియా, ఘనా
బి:    పరాగ్వే, మాలి, న్యూజిలాండ్, టర్కీ
సి:    ఇరాన్, గినియా, జర్మనీ, కోస్టారికా
డి:    కొరియా, నైజర్, బ్రెజిల్, స్పెయిన్‌
ఇ:    హోండూరస్, జపాన్, న్యూ కెలడోనియా, ఫ్రాన్స్‌
ఎఫ్‌:    ఇరాక్, మెక్సికో, చిలీ, ఇంగ్లండ్‌

భారత్‌ లీగ్‌ మ్యాచ్‌ల షెడ్యూల్‌
అక్టోబర్‌ 6:    భారత్‌ గీ అమెరికా (న్యూఢిల్లీ)
అక్టోబర్‌ 9:    భారత్‌ గీ కొలంబియా (న్యూఢిల్లీ)
అక్టోబర్‌ 12:    భారత్‌ గీ ఘనా (న్యూఢిల్లీ)  

భారత్‌ స్థాయి ఏమిటి?
మన దేశంలో ఫుట్‌బాల్‌కు ఉన్న ఆదరణతో పోలిస్తే వరల్డ్‌ కప్‌లాంటి మెగా ఈవెంట్‌ నిర్వహించే అవకాశం రావడమే ఏఐఎఫ్‌ఎఫ్‌ పెద్ద ఘనతగా భావించింది. ఆతిథ్య జట్టు కావడం వల్ల టోర్నీ ఎక్కువ మందికి చేరే అవకాశం ఉంటుందని కూడా సమాఖ్య భావిస్తోంది. అయితే మైదానంలో కూడా మన జట్టు ఆ ముద్ర వేయగలిగితే ఇంకా బాగుంటుందని అభిమానులు కోరుకుంటున్నారు. ఆతిథ్య జట్టు కాబట్టే అవకాశం దక్కించుకోగలిగామే తప్ప భారత్‌ క్వాలిఫై కాకపోయేదని నిస్సందేహంగా చెప్పవచ్చు. మన కుర్రాళ్లు టోర్నీ కోసం చాలా కాలంగా ప్రత్యేక క్యాంప్‌లతో కఠోర సాధన చేశారు. కానీ మన ప్రమాణాల ప్రకారం చూస్తే ఫలితం అంత గొప్పగా ఉంటుందని చెప్పలేం. తమ గ్రూప్‌లో ఉన్న జట్లలో మొదటి మ్యాచ్‌లో అమెరికాతో భారత్‌ తలపడుతోంది. 16వ సారి ఈ టోర్నీలో బరిలోకి దిగుతున్న అమెరికాను ఓడించడం అంత సులువు కాదు. ఆపై ఫుట్‌బాల్‌కు అడ్డాల్లాంటి కొలంబియా, ఘనా జట్లకు  కూడా మన టీమ్‌ ఏమాత్రం పోటీనిస్తుందనేది చెప్పలేం. మొత్తంగా మన జట్టు చిత్తుగా ఓడి చెత్త రికార్డులు నెలకొల్పకుండా పరువు నిలబెట్టుకుంటే అందరూ కోరుకున్నట్లుగా వరల్డ్‌ కప్‌ నిర్వహణ వల్ల కాస్తంతయినా మన దేశంలో ఫుట్‌బాల్‌కు గౌరవం, ఆదరణ పెరుగుతాయి.   

మొత్తం జట్లు    24
మొత్తం మ్యాచ్‌లు     52  

మొత్తం వేదికలు    6
కోల్‌కతా, న్యూఢిల్లీ, గోవా, కొచ్చి, గువాహటి, నవీ ముంబై.

ఈ సారి జరిగిన అర్హత టోర్నీలో ఐదు ఖండాలు అండర్‌–17 స్థాయిలోనే పోటీలు నిర్వహించగా... ఒక్క ఆసియా క్వాలిఫికేషన్‌ టోర్నీ మాత్రం అండర్‌–16 స్థాయిలో జరిగింది.  

మరికొన్ని...

 డిఫెండింగ్‌ చాంపియన్, ఐదు సార్లు విజేతగా నిలిచిన నైజీరియా (2015) ఈ సారి వరల్డ్‌ కప్‌కు అర్హత సాధించకపోవడం విశేషం. నైజీరియాను చిత్తు చేసి నైజర్‌ క్వాలిఫై అయ్యింది.  
‘ఫిఫా’ ఫైనల్స్‌లో భారత్‌ 57 సంవత్సరాల తర్వాత అడుగు పెట్టగలిగింది. 1948, 1952, 1956, 1960లలో భారత జట్టు వరుసగా నాలుగు ఒలింపిక్స్‌లలో పాల్గొంది.  
టోర్నీ నిబంధనలు అన్ని ‘ఫిఫా’ సీనియర్‌ మ్యాచ్‌లలాగే ఉంటాయి. అయితే 90 నిమిషాల తర్వాత అదనపు సమయం మాత్రం లేదు. నాకౌట్‌ దశలో స్కోర్లు సమమైతే నేరుగా పెనాల్టీ షూటౌట్‌కు వెళ్లిపోతారు.

ఇదీ మన యువ సైన్యం
ధీరజ్‌ మొయిరంగ్తెమ్, ప్రభ్‌సుఖన్‌ గిల్, సన్నీ ధలివాల్‌ (గోల్‌కీపర్లు), అనికేత్‌ జాదవ్, రహీమ్‌ అలీ (ఫార్వర్డ్‌లు), నిన్‌తోఇన్‌గన్‌బా మీటీ, అభిజిత్‌ సర్కార్, లాలెంగ్‌మావియా, నోంగ్‌డంబా నావోరెమ్, మొహమ్మద్‌ షాజహాన్, అమర్జిత్‌ కియామ్‌ (కెప్టెన్‌), కోమల్‌ తతల్, రాహుల్‌ కనోలీ, సురేశ్‌ వాంగ్‌జమ్, జేక్సన్‌ తోనైజమ్‌ (మిడ్‌ఫీల్డర్లు), అన్వర్‌ అలీ, బోరిస్‌ తంగ్‌జమ్, సంజీవ్‌ స్టాలిన్, జితేంద్ర సింగ్, హెండ్రీ ఆంటోనీ, నమిత్‌ దేశ్‌పాండే (డిఫెండర్లు).  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement