మన క్రికెటర్లకు ఢోకా లేదు | BCCI clears dues of contracted players | Sakshi
Sakshi News home page

మన క్రికెటర్లకు ఢోకా లేదు

Published Sat, Apr 11 2020 12:07 AM | Last Updated on Sat, Apr 11 2020 12:07 AM

BCCI clears dues of contracted players - Sakshi

ముంబై: కోవిడ్‌–19 కారణంగా ప్రపంచమంతా అతలాకుతలమవుతోంది. ఆర్థిక వ్యవస్థలు దెబ్బతినడంతో సహజంగానే ఆ ప్రభావం అన్ని రంగాలపై పడింది. దాదాపుగా అన్ని టోర్నీలు, సిరీస్‌లు రద్దు కావడం లేదంటే వాయిదా పడటంతో క్రికెట్‌ బోర్డుల ఆదాయం ఆగిపోయింది. కరోనా కారణంగా ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌ క్రికెటర్ల వేతనాల్లో కోత పడటం ఖాయమైంది. అయితే ఇలాంటి స్థితిలో కూడా భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఎక్కడా వెనక్కి తగ్గలేదు.

ఆర్థికపరంగా తమ బలమేమిటో చూపిస్తూ భారత కాంట్రాక్ట్‌ క్రికెటర్లకు ఒక్క రూపాయి కూడా తగ్గించకుండా వారి వేతనాలు ఇచ్చేందుకు సిద్ధమైంది. ఈ ఏడాది తొలి మూడు నెలల వరకు మన ఆటగాళ్లకు ఇవ్వాల్సిన బాకీలన్నీ చెల్లించినట్లు బీసీసీఐ ప్రకటించింది. ‘కష్టకాలంలో మన క్రికెటర్లు ఎవరూ సమస్యలు ఎదుర్కోరాదు. మార్చి 24 నుంచి ప్రభుత్వం లాక్‌డౌన్‌ ప్రకటించగానే జరగబోయే పరిణామాలను బీసీసీఐ అంచనా వేసి దానికి అనుగుణంగా సిద్ధమైంది. మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి ఒక్క రూపాయి బాకీ కూడా లేకుండా బోర్డు కాంట్రాక్ట్‌ ఉన్న ఆటగాళ్లకు చెల్లింపులు జరిపేశాం.

దీంతో పాటు ఈ మధ్య కాలంలో భారత్, భారత ‘ఎ’ జట్టు తరఫున ఆడిన ప్లేయర్లకు కూడా మ్యాచ్‌ ఫీజులు ఇచ్చేశాం’ అని బోర్డు ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. కరోనా నేపథ్యంలో ఆస్ట్రేలియా క్రికెట్‌ బోర్డు తన ఆటగాళ్ల చెల్లింపులను వాయిదా వేయగా, ఇంగ్లండ్‌ క్రికెటర్లు ప్రభుత్వం సహకారం అందించే పథకం (ఫర్లాఫ్‌ స్కీమ్‌)కు దరఖాస్తు చేసుకున్నారు. ‘ప్రపంచం మొత్తం జీతాల కోత గురించే వినిపిస్తోంది. అయితే ఇన్నేళ్లుగా చేస్తున్నట్లే ఇప్పుడు కూడా బీసీసీఐ తమ ఆటగాళ్ల బాగోగులు అందరికంటే ఎక్కువ చూసుకుంటుంది. మా పరిధిలోని ఒక్క అంతర్జాతీయ లేదా దేశవాళీ క్రికెటర్‌ కూడా బాధపడే పరిస్థితి రాకూడదు’ అని సదరు అధికారి వ్యాఖ్యానించారు.  

ఐపీఎల్‌ జరగాల్సిందే...
మరోవైపు ఐపీఎల్‌తో ముడిపడి ఉన్న డబ్బును బట్టి చూస్తే ఈ ఏడాది చివర్లోనైనా టోర్నీ జరగాలని కోరుకుంటున్నట్లు ఆయన అన్నారు. అయితే ఇప్పటికే నిర్ణయమైపోయిన ఇతర టోర్నీలు, దేశవాళీ క్రికెట్‌ షెడ్యూల్‌లను బట్టి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. ‘ప్రస్తుత పరిస్థితిలో ఏమీ చెప్పలేం. అసలు ప్రపంచం సాధారణస్థితికి ఎప్పుడో వస్తుందో ఎవరికీ తెలియనప్పుడు ఐపీఎల్‌ తేదీల గురించి ఎలా మాట్లాడగలం. అయితే సెప్టెంబర్‌లో ఆసియా కప్‌తో మొదలు పెడితే స్వదేశంలో ఇంగ్లండ్‌తో సిరీస్, ఆ తర్వాత టి20 ప్రపంచకప్‌ కూడా ఉన్నాయి. మన దేశవాళీ టోర్నీల సమయం కూడా అదే. కాబట్టి చాలా అంశాలు ఆలోచించాల్సి ఉంది’ అని బోర్డు అధికారి స్పష్టం చేశారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement