అందం
చిన్న వయసులోనే కొందరికి ముఖంపై చర్మం ముడతలు పడుతుంది. అవి పోవడానికి బోలెడన్ని చిట్కాలు ఉన్నాయి. మామిడి ఆకులను పొడి చేయాలి. ఇందులో మినప పొడి, ముల్తాన్ మిట్టీలను సమాన పాళ్లలో కలిపి, ఓ డబ్బాలో వేసి పెట్టుకోవాలి. ప్రతిరోజూ ఈ మిశ్రమాన్ని కొద్దిగా తీసుకుని, పాలతో కలిపి పేస్ట్‌లా చేసి, ముఖానికి ప్యాక్ వేసుకోవాలి. కొన్నాళ్లపాటు క్రమం తప్పకుండా ఇలా చేస్తే ముడతలు మాయమవుతాయి. అది మాత్రమే కాదు. బంగాళదుంప గుజ్జు, టొమాటో రసం, అరటిపండు గుజ్జు కూడా ముడతలు పోయేలా చేస్తాయి. క్యారెస్ రసంలో పాలు, బాదం పప్పు పేస్ట్ కలిపి ముఖానికి పట్టించి, ఆరిన తర్వాత చల్లని నీటితో కడిగేసుకోవాలి. కొన్నాళ్లపాటు వారానికి రెండు సార్లయినా ఇలా చేస్తే మంచి ఫలితముంటుంది. బాదం నూనెతో మర్దనా చేసినా కూడా ముడతలు పోతాయి.
ఆరోగ్యం
సర్వేంద్రియానాం నయనం ప్రధానం అన్నారు. కాబట్టే కళ్లను ఎంతో జాగ్రత్తగా కాపాడుకోవాలి. కళ్ల సంరక్షణ విషయంలో శ్రద్ధ వహించాలి. ఒక్కోసారి కళ్లలో చిన్న చిన్న కురుపులు వచ్చి విపరీతమైన నొప్పి కలుగుతుంది. అలాంటప్పుడు... జామ ఆకును వేడి చేసి, ఆ వేడి ఆకును ఓ గుడ్డలో చుట్టి, కురుపు ఉన్నచోట కాపడం పెట్టాలి. లేదంటే చెంచాడు ధనియాలను ఓ కప్పు నీటిలో వేసి మరిగించి, ఆ నీటిలో ముంచిన గుడ్డతో కాపడం పెట్టినా మంచిదే. ఖర్జూరపు గింజను పొడి చేసి, నీరు కలిపి పేస్టులా చేసి నొప్పి ఉన్న చోట రాసినా ఉపశమనం లభిస్తుంది. అలసట కారణంగా కళ్లు బరువుగా అనిపిస్తుంటే... ఓ గ్లాసు నీటిలో ఉసిరిక పొడి వేసి నానబెట్టి, ఆ మిశ్రమంతో కళ్లను కడుక్కుంటే హాయిగా ఉంటుంది. నిద్ర చాలకగానీ, ఏడవడం వల్ల కానీ కళ్లు ఉబ్బితే... గుడ్డులోని తెల్లసొనను కళ్లకింద రాసుకుని, ఆరిన తరువాత కడిగేసుకుంటే వాపు తగ్గుతుంది. అయితే సొన కంటికి తగలకుండా జాగ్రత్త పడాలి. కళ్లు అలసినట్లయితే... దోసకాయ రసంలో ముంచిన దూదిని కొంచెం సేపు కళ్లమీద పెడితే అలసట పోతుంది.
ఆనందం
అందుకే ఫ్రీ!
సేల్స్‌మేన్: సార్... ఈ ఫ్యాన్ కొనండి. దీనితోపాటు కుర్చీ ఫ్రీగా వస్తుంది.
కస్టమర్: విచిత్రంగా ఉందే... ఫ్యాన్ కొంటే కుర్చీ ఫ్రీగా ఇవ్వడమేంటి?
సేల్స్‌మేన్: ఒకవేళ ఫ్యాన్ తిరక్కపోతే అది వేసుకుని ఎక్కి తిప్పుకోవచ్చని!
........................................................
రెండూ ఒకటే!
తండ్రి: బబ్లూ... డెరైక్ట్ స్పీచ్‌కీ ఇన్‌డెరైక్ట్ స్పీచ్‌కీ తేడా ఏమిట్రా?
బబ్లూ: మొన్న కోపం వచ్చినప్పుడు నన్ను తిట్టావ్ చూడూ... అది డెరైక్ట్ స్పీచ్. నిన్న అమ్మమీద కోపం వచ్చినప్పుడు తననేమీ అనలేక నన్ను తిట్టావ్ కదా... అది ఇన్‌డెరైక్ట్ స్పీచ్.
.........................................................................
అదుంటే చాలు!
జిమ్‌లో చేరడానికి వెళ్లాడు సుందరం. ఇన్‌స్ట్రక్టర్‌ని ఇలా అడిగాడు
‘నేను సైట్ కొడుతున్న అమ్మాయి నన్ను చూసి ఫ్లాట్ అయిపోవాలి. నేను ఏ మెషీన్ ఉపయోగిస్తే మంచిది?’
దానికి ఇన్‌స్ట్రక్టర్ - ‘ఏటీఎం మెషీన్!’ అని జవాబిచ్చాడు.