సంతోషాన్ని కొలిచేందుకు రెడీ..
కోల్కతా: జనాభా లెక్కల సేకరణ చూశాం. బడ్జేట్ అంచనా వేయడం తెలుసు. కానీ మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఒక అడుగు ముందుకేసి ప్రజల సంతోషాన్ని, ఆరోగ్యాని కొలిచేందుకు సిద్ధమైంది. ఇందుకు ఖరగ్పూర్ రేఖీ సెంటర్తో ప్రభుత్వం ఒప్పందాన్ని కుదుర్చుకుంది. తమ రాష్ట్ర ప్రజలు ఎంత సంతోషంగా, ఆరోగ్యంగా ఉన్నారో కొలిచి, నివేదిక రూపంలో అందజేయడం కోసమే ఈ ఒప్పందం. దేశంలోనే తొలిసారిగా హ్యాపినెస్ డిపార్ట్మెంట్ను సర్కార్ ఇటీవల ప్రారంభించింది.
‘అయితే సంతోషాన్ని కొలవడం ఆషామాసీ వ్యవహారం కాదు. దీనికోసం ఎంతో కసరత్తు, పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. అందుకే ఈ బాధ్యతను ఐఐటీ ఖరగ్‌పూర్‌కు అప్పగించామని’ మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ విభాగమైన రాజ్య ఆనందం సంస్థాన్ ఓ ప్రకటనతో పేర్కొంది. ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్, ఐఐటీ ఖరగ్‌పూర్ ప్రొఫెసర్ పీపీ చక్రవర్తి మధ్య ఇందుకు సంబంధించిన ఒప్పందం కుదిరిందని వెల్లడించింది. గణాంకాలను అందజేయడం మాత్రమే కాకుండా హ్యాపీనెస్ ఇండెక్స్‌ను మరింతగా పెంచేందుకు ఐఐటీ బృందం సూచనలు, సలహాలు కూడా ఇస్తుంది.