
భోపాల్: ఈ ఏడాది చివర్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ మంత్రివర్గ విస్తరణను చేపట్టారు. రాజ్‌భవన్‌లో శనివారం ఉదయం జరిగిన ఈ కార్యక్రమంలో గవర్నర్ ఆనందీబెన్ పటేల్ బీజేపీ ఎమ్మెల్యేలు బాలకృష్ణ పాటీదార్, నారాయణ్ సింగ్ కుష్వాహా, జలమ్ సింగ్ పటేల్‌ల చేత ప్రమాణస్వీకారం చేయించారు. వీరిలో కుష్వాహాకు కేబినెట్ హోదా కల్పించగా, మిగతా ఇద్దరినీ సహాయ మంత్రులుగా నియమించారు. వీరందరికి త్వరలోనే మంత్రిత్వ శాఖల్ని కేటాయించనున్నారు.
అనంతరం సీఎం చౌహాన్ మీడియాతో మాట్లాడుతూ..‘మాతో కొత్త సహచరులు చేరారు. వీరి చేరికతో మా సామర్థ్యం మరింత మెరుగుకానుంది. రాష్ట్రాభివృద్ధిలో కొత్త మంత్రుల అనుభవాన్ని ఉపయోగించుకుంటాం. త్వరలోనే మరోసారి మంత్రివర్గాన్ని విస్తరిస్తాం’అని తెలిపారు. రాజ్యాంగం ప్రకారం మధ్యప్రదేశ్ అసెంబ్లీలో 35 మంది మంత్రులు ఉండే అవకాశముండగా.. తాజా పెంపుతో సీఎం సహా మొత్తం మంత్రుల సంఖ్య 20కి చేరుకుంది. మధ్యప్రదేశ్‌లో 2003 నుంచి బీజేపీ అధికారంలో కొనసాగుతున్న సంగతి తెలిసిందే.