యోగి బాటలో మరో సీఎం
భోపాల్: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తరహాలో మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ యాంటీ రోమియో స్క్వాడ్‌లు ఏర్పాటు చేసేందుకు సిద్ధమయ్యారు. అమ్మాయిల పట్ల అనుచితంగా ప్రవర్తించే ఆకతాయిలకు బుద్ధి చెప్పేందుకు ఉద్యమం చేపట్టాలని నిర్ణయించారు.
'ఆకతాయి కుర్రాళ్లకు అమ్మాయిలను ఎలా గౌరవించాలో తెలియదు. ఇలాంటి వాళ్లు పౌర సమాజానికి శ్రేయస్కరం కాదు. ఇలాంటి వ్యక్తులకు వ్యతిరేకంగా ఓ ఉద్యమాన్ని ప్రారంభిస్తాం' అని చౌహాన్ తెలిపారు. మహిళలు, అమ్మాయిల భద్రతకు భరోసా ఇవ్వడం, వారు సురక్షితంగా ఉండేలా పోలీసులు చర్యలు తీసుకోనున్నారు. ధైర్యసాహసాల్లో, విధులు నిర్వహించడంలో మహిళలు ఎవరికీ తక్కువ కాదని, వారు ఎలాంటి భయం లేకుండా స్వతంత్రంగా ఉండేలా పోలీసులు తగిన వాతావరణం కల్పించాలని, వారిని పీడించే నేరగాళ్లపై పోలీసులు చర్యలు తీసుకోవాలని చౌహాన్ అన్నారు.
ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో బీజేపీ ప్రభుత్వాలు ఉన్న సంగతి తెలిసిందే. యూపీ ఎన్నికలకు ముందు హామీ ఇచ్చినట్టుగానే బీజేపీ అధికారంలోకి వచ్చాక యాంటీ రోమియో స్క్వాడ్‌లను ఏర్పాటు చేసింది.