సంతోషం సగం బలం‘ అన్నది మనకు బాగా తెలిసిన మాటే. నిజానికి మనిషికి సంతోషం సమగ్ర బలం. అంతేకాదు మనిషికి సంతోషం సహజమైన బలం కూడా. ఎంత బలవంతుడికైనా సంతోషం లేనప్పుడు అతడు బలహీనుడిగా అయిపోతాడు. సంతోషం కరువైపోయిన మనుషులు మనోవ్యాధులతో శుష్కించిపోవడమూ, నశించిపోవడమూ మనకు తెలిసిన విషయమే. బావుండాలంటే మనిషికి సంతోషం ఎంతో ముఖ్యం. వర్తమానంలో మనం సంతోషంతో ఉంటే లేదా మనం వర్తమానాన్ని సంతోష భరితంగా చేసుకోగలిగితే మన భవిష్యత్తు సంతోషమయంగా ఉంటుంది.
‘సంతోషానికి మార్గం లేదు, సంతోషమే మార్గం‘ ఇది గౌతమ బుద్ధుడి ఉవాచ. సంతోషం అనేది సంపాదించుకోగలిగేదీ, సాధించుకోగలిగేదీ కాదు. సంతోషం మనలో ప్రవహించే రక్తంలాంటిది. బయటనుంచి వచ్చేది కాదు. మనలోంచి మన కోసం మనమై కలిగేది. ‘మనం మన ఆలోచనలవల్ల నిర్మితం అయ్యాం; మనం మన ఆలోచనలకు అనుగుణంగా రూపొందుతాం; మన మెదడు నిర్మలంగా ఉంటే సంతోషం వీడని నీడలా అనుసరిస్తుంది’ అని చెప్పాడు బుద్ధుడు. మనిషి సంతోషంగా ఉండడం అతడి ఆలోచనావిధానంపై ఆధారపడి ఉంటుంది. ఆలోచన ఆధారంగా కలిగే అనుభూతి సంతోషం. ఒకరికి సంతోషాన్ని ఇచ్చేది మరొకరికి సంతోషాన్ని ఇచ్చేది కాకపోవచ్చు.
‘సూర్యుడి కాంతి మనుషులకు వెలుగును ఇస్తూ ఉంటే గుడ్లగూబలకు చీకటి అవుతోంది. నీటిలో మునిగినప్పుడు మనుషులకు, పశువులకు ఆ నీరు శ్వాసకు ప్రతిబంధకం అవుతోంది. ఆ నీరే చేపల శ్వాసకు ఆటంకం అవడం లేదు. మనుషులు హాయిగా గాలి పీల్చుకునే తీరప్రదేశంలో చేపలు గాలి పీల్చుకోలేవు. అగ్ని అన్నిటినీ దహిస్తుంది. కానీ అత్తిరిపక్షులు అగ్నికణాల్ని తింటాయి.
నీళ్లవల్ల నిప్పు నశిస్తుంది. కానీ బడబాగ్ని సముద్రం మధ్యలో జ్వలిస్తూ ఉంటుంది. ఇట్లా జగత్తులో విషయాలన్నీ ద్వైరూప్యంతో ఉన్నాయి అని భారతీయ తత్త్వసాహిత్యంలో అత్యున్నతమైన త్రిపురారహస్యంలో చెప్పబడింది. విషయాలనుబట్టి కాదు మనల్ని బట్టి మనకు తృప్తి కలుగుతూ ఉంటుంది లేదా మన తనివి తీరుతూ ఉంటుంది. కాబట్టి మన సంతోషానికి మనమే మూలంగా ఉన్నాం, ఉంటాం.
‘శరీరాన్ని శుష్కింపజెయ్యడంలో చింత లేదా విచారానికి సమానమైంది లేదు’ అని హితోపదేశం ఎన్నో యేళ్ల క్రితమే మనకు చెప్పింది. ‘చితి, చింత ఈ రెండిటిలో చింత ఎక్కువ దారుణమైంది. చితి నిర్జీవమైన శరీరాన్నే దహిస్తుంది కానీ చింత సజీవంగా ఉన్న శరీరాన్ని దహిస్తూ ఉంటుంది’ అని ఒక సంస్కృత శ్లోకం తెలియజేస్తోంది. నిజానికి చింత అనేది శరీరాన్ని మాత్రమే కాదు ఆలోచనా విధానాన్ని, వ్యక్తిత్వాన్ని, ప్రగతిని, జీవితాన్ని కూడా శుష్కింపజేస్తుంది. కాబట్టి మనకు కలిగిన చింతను వీలైనంత త్వరగా వదిలించుకోవాలి. మనకు కలిగిన చింత నుంచి మనం వీలైనంత త్వరగా విముక్తం అవ్వాలి.
‘మానవజాతిలోని చింత అంతా మనసువల్ల వచ్చిన జబ్బు’ అని తమిళకవి కణ్ణదాసన్ చెప్పారు. ఈ స్థితికి అతీతంగా మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే అందుకు మనసే కీలకం. మనసువల్ల వచ్చిన చింతను ఆ మనసువల్లే తొలగించుకోవాలి.‘గాలి తనతో తీసుకు వచ్చిన మేఘాలను తానే చెదరగొడుతుంది.’ అని ఒక సంస్కృత శ్లోకం చెబుతోంది. ఆ విధంగా మనసువల్ల వచ్చిన చింతలను మనం మనసువల్లే పోగొట్టుకోవాలి.
సంతోషం మనిషిలోనే నిక్షిప్తం అయి ఉంది. దుఃఖాన్ని తొలగించుకునేందుకు తనను తాను చెక్కుకోవడం నేర్చుకుంటే మనిషి సంతోషశిల్పం అవుతాడు; మనిషి ‘సంతోషంగా’ ఉంటాడు.
– శ్రీకాంత్ జయంతి
Comments
Please login to add a commentAdd a comment