
వివేకం: జీవిత ప్రాథమిక సూత్రం సంతోషం
కేవలం జీవితంలో సాధించినవాటితోనే మనకు సంతోషం, సంతృప్తి రావు. మనం చిన్నపిల్లవాడిగా ఉన్నప్పుడు ఏమీ లేకుండానే మనం సంతోషంగా ఉండగలిగాం. సంతోషం మానవుని అసలు స్వభావం. మీరు మీ స్వభావానికి విరుద్ధంగా వెళుతూ సంతోషం పొందాలని ప్రయత్నిస్తే మాత్రం ఎప్పటికీ దాన్ని అందుకోలేరు. సంతోషంగా ఉండటమే జీవితంలోని గొప్ప విషయం కాదు. అసలు మన జీవన ప్రాథమిక మూలం సంతోషమే. మనం సంతోషంగానే లేమంటే, ఇక మన మిగతా జీవితంతో మనమేం చేయగలం?
సంతోషంగా ఉండటమే మానవుని ప్రప్రథమ, అతి ముఖ్యమైన ప్రాథమిక బాధ్యత. మీరు జీవితంలో ఏమి చేస్తున్నా, అది వ్యాపారం, ఉద్యోగం, సేవ ఏదైనా కానీ, మన మనసు లోతుల్లో ఎక్కడో దానివల్ల మనకు సంతోషం లభిస్తుందనే భావం నెలకొని ఉండటం వల్లే అది చేస్తున్నాం. ఈ ప్రపంచంలో మనం ఏ పని చేసినా, దానివల్ల మనకు సంతోషం కలుగుతుందనే ఆకాంక్షే మూలకారణం. ప్రస్తుత పరిస్థితుల్లో సంతోషం కోసం మనం ఎంత విపరీతంగా ప్రయత్నిస్తున్నామంటే, ఈ భూగోళం మీద జీవన మనుగడే ప్రమాదంలో ఉంది. సంతోషం పొందడం కోసం బాహ్య అంశాల మీద ఆధారపడేవారంతా వారి జీవితాల్లో నిజమైన సంతోషాన్నీ, ఆనందాన్నీ ఎప్పటికీ తెలుసుకోలేరు.
వాస్తవానికి ఆనంద మూలాలు మనలోనే ఉన్నాయి. వాటిని మన అజమాయిషీలోకి తెచ్చుకోవచ్చు. మనం ఆనందంగా ఉంటే, సంతోషంగా ఉండటానికి మనం చేయాల్సింది మరేదీ లేకపోతే, మన ఆలోచనా విధానం, మన స్పందన, ఈ ప్రపంచం మొత్తం మారిపోతాయి. అప్పుడిక స్వార్థ ప్రయోజనాలంటూ మనకేమీ ఉండవు. ఎందుకంటే... మనం ఏమి చేసినా, చేయకపోయినా, మనకు ఏది లభించినా, లభించకపోయినా... ఏదైనా సంభవించినా, సంభవించకపోయినా సరే మనం స్వభావ రీత్యా సంతోషంగానే ఉండిపోతాం. ఇలా స్వభావ రీత్యా సంతోషంగా ఉండిపోతే మనం చేసేవన్నీ పూర్తిగా వేరే స్థాయికి ఎదిగిపోతాయి.
మన సంక్షేమాన్ని సృజించుకోవలసిన సమయం ఇదే. మన అంతరంగం పరిణతి చెందితేనే నిజమైన సంక్షేమం మనకు వస్తుందనే వాస్తవం మన స్వానుభవం నుంచే మనం గమనించగలుగుతాము. మనం ధరించే బట్టల వల్లో, మన చదువు వల్లో, కుటుంబం గొప్పతనం వల్లో, ఇదీ అదీ కాకపోతే మనకున్న బ్యాంకు బ్యాలెన్స్ వల్లో మన జీవన ప్రమాణం నిర్ధారణ కాదు. కేవలం మన అంతరంగంలో ఎంత ప్రశాంతంగా, ఆనందంగా ఉన్నామనే దానిపైనే మన సంతోషం, ఆనందం ఆధారపడి ఉంటుంది.
నిజమైన పరిణతి మనలో చోటుచేసుకోకపోతే, ఈ ప్రపంచానికి విలువైనదేదీ మనం చేయలేం. ప్రపంచంలో మన అవలక్షణాలనే విస్తరింపగలుగుతాం. మనం ఇష్టపడినా పడకున్నా, ఇదే వాస్తవం. ఈ జీవితం గురించి మీకు శ్రద్ధ ఉంటే, మొట్టమొదట మనం చేయవలసింది అంతరంగాన్ని ప్రశాంతంగా, ఆనందంగా ఉంచుకుని మనం సంతోషమయులం, ఆనందమయులం కావడమే!
సమస్య - పరిష్కారం
నాయకత్వ లోపం సమాజంలో అన్నిచోట్లా కనిపిస్తోంది. అది ఎలా మారుతుంది? అసలు మంచి నాయకుని లక్షణాలేమిటో దయచేసి తెలుపుతారా?
- ఎస్.కె.గౌడ్, హైదరాబాద్
నాయకుడనేవాడు తను ఉన్న పరిస్థితులు, పరిసరాలను బాగా గమనించగలిగినవాడై ఉండాలి. ఇతరులు గమనించలేని వాటిని సునిశితంగా గమనించగల ప్రజ్ఞ అతనికి ఉండాలి. ఎవరైనా సరే చాలినంతగా శ్రద్ధ పెట్టినట్టయితే ఈ విశాల విశ్వంలో మనకు అర్థం కానిదీ, అవగతం కానిదీ ఏదీ ఉండదు. ఇంకా నాయకుడనేవాడు నీతి నిజాయితీలకు ప్రతీకగా ఉండాలి. ఇక స్ఫూర్తి మూడవ లక్షణం. తన చుట్టూ ఉన్నవారిని పూర్తిగా ప్రభావితం చేయగల, వారిలో స్ఫూర్తిని నింపగల సామర్థ్యం కలిగి ఉండాలి. ప్రభావితం చేయగలిగే, స్ఫూర్తిని నింపగల లక్షణం ఉంటే నాయకుడనేవాడు పైకి ఆకర్షణీయంగా, జనసమ్మోహనంగా ఉండాల్సిన అవసరం లేదు. తాము చేసే పనిపట్ల పూర్తి కార్యదీక్ష, అంకితభావంతో ఇతరులలో స్ఫూర్తిని నింపినవారెంతో మంది ఉన్నారు. కార్యదీక్ష అనే గొప్ప లక్షణంతో గాంధీ మహాత్ముడు కోట్లాది మంది ప్రజానీకంలో స్ఫూర్తిని నింపి వారిని జాగృతపరిచారు.