అది ‘కురువుల’ పట్టణం. దాని సమీపంలో యమునా నది. చల్లని నీడనిచ్చే మామిడి చెట్ల వనం. అందులో అగ్ని భరద్వాజుని ఆశ్రమం. ఆ సమయంలో బుద్ధుడు ఆ ఆశ్రమంలో ఉంటున్నాడు. అగ్ని భరద్వాజుడు బుద్ధునికి తగిన ఆశ్రమాన్ని ఏర్పాటు చేశాడు. ఒకరోజు బుద్ధుడు ఆ పట్టణంలోకి వెళ్ళి భిక్ష స్వీకరించి వచ్చి, ఈ వనంలో ఒక పెద్ద మామిడి చెట్టు కింద కూర్చొని ఉన్నాడు. సమయం మధ్యాహ్నం దాటింది. అగ్ని భరద్వాజుని దగ్గరకు మాగందియుడు అనే తాపసి వచ్చాడు. పరస్పర కుశల ప్రశ్నల తర్వాత వారిద్దరూ కలిసి మామిడి తోటలో బుద్ధుడున్న చోటుకు వెళ్లారు. అప్పటికీ మాగందియుని విషయం బుద్ధునికి తెలుసు. వారు వచ్చాక కొంత సంభాషణ కామసుఖాల మీద జరిగింది...
‘‘మాగందియా! కామసుఖాలకంటే సుఖాన్నిచ్చే గొప్పసుఖం వేరే ఉంది.’’ అన్నాడు బుద్ధుడు. వారిద్దరూ శ్రద్ధగా వినడం మొదలుపెట్టారు. ‘‘నేను యువరాజుగా ఉన్నప్పుడు నాకోసం మూడు ప్రత్యేక భవంతులు నిర్మించారు. వేసవిలో, వర్షాకాలంలో, హేమంత కాలాల్లో నివసించడానికి అనువైన భవనాలు అవి. ఆయా కాలాల్లో హాయిని చేకూర్చే భవనాలు. దివ్య సుఖాన్నిచ్చే భవనాలు నేను ఆ నాలుగు నెలూ ఆ భవనాలు దిగి వచ్చేవాడినే కాదు. చివరికి ఈ కామ సుఖాల బేలతనాన్ని తెలుసుకున్నాను. నాలో కామతృష్ణ తొలగిపోయింది. పిపాస నశించింది. రాగం వదిలిపోయింది. అప్పుడు కూడా ఆనందించాను. కామం, తృష్ణ, పిపాసలు ఇవ్వలేని ఆనందాన్ని కూడా పొందాను. ఆనందం, దుఃఖం భవనాల్లో లేవు. మన మనస్సులోనే ఉంటాయి.’’ అని వారివైపు చూశాడు బుద్ధుడు. శ్రద్ధగా వింటూ కనిపించారు.
‘‘మాగందియా! రాగం ద్వేషం, పిపాస ఉన్న మనస్సునే ప్రక్షాళన చేయాలి. కుష్ఠు వ్యాధి శరీరం, వేడి గ్రహించి హాయి పొందినట్లు రాగద్వేషాలతో ఉన్న మనస్సు కూడా వాటిని పొందినప్పుడు హాయి పొందుతుంది. రాజ భవనాల్లో నేను పొందిన హాయి అలాంటిదే! కుష్ఠువ్యాధి తగ్గిన శరీరం వేడికి హాయి పొందదు. దానికి వేడితో పనిలేదు. అలాగే రాగరహిత హృదయానికి భవనాలు సుఖాలు అవసరం లేదు. ఆరోగ్యమైన శరీరానికి మంటల వేడి అవసరం లేనట్లే... ఆరోగ్యమైన మనస్సుకి కోర్కెలు అవసరం లేదు. మాగందియా! ఈ కామభోగలాలసలు గతంలోనూ, భవిష్యత్‌లోనూ మనల్ని వెంటాడుతూనే ఉంటాయి. దుఃఖాన్ని కలిగిస్తూనే ఉంటాయి. ఇంద్రియాల్ని లోబరుచుకుంటూనే ఉంటాయి. వీటికి లోబడి పొందే సుఖం, కుష్ఠువారు వేడివల్ల పొందే సుఖం లాంటిది. ఆ సుఖం సుఖం కాదు. దుఃఖమే!’’ అన్నాడు.
‘‘భగవాన్! చల్లని మీ మాటల ద్వారా ఏది నిజమైన సుఖమో, ఏది సత్యమైన దుఃఖరహిత మార్గమో... తెలుసుకోగలిగాను. నన్ను కూడా ఇకనుంచి మీ అనుయాయిగా స్వీకరించండి’’ అంటూ ప్రణమిల్లాడు మాగందియుడు.
– డా. బొర్రా గోవర్ధన్
Comments
Please login to add a commentAdd a comment