సుప్రీంకోర్టు తీర్పుపై రైతుల హర్షం
సుప్రీంకోర్టు తీర్పుపై రైతుల హర్షం
Published Sun, Sep 4 2016 11:05 PM | Last Updated on Mon, Oct 1 2018 2:11 PM
తాడేపల్లి రూరల్: సింగూరు భూసేకరణ విషయంలో సుప్రీంకోర్టు రైతులకు అనుకూలంగా తీర్పు ఇవ్వడంతో రాజధాని రైతులు హర్షం వ్యక్తం చేశారు. ఆదివారం ఉండవల్లి సెంటర్ ప్రధాన కూడలిలో రైతులు స్వీట్లు, కూరగాయలు పంపిణీ చేసి తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ క్రమంలో సుప్రీంకోర్టు, న్యాయవాదులు న్యాయాన్ని పరిరక్షించే క్రమంలో రైతులకు ఎల్లవేళలా అండగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. మూడు పంటలు పండే రాజధాని భూములను సైతం చట్ట విరుద్ధంగా ప్రభుత్వం బలవంతంగా సేకరించడానికి చేస్తున్న ప్రయత్నాలను తాము ఖండిస్తున్నామన్నారు. అదే క్రమంలో తమకు న్యాయస్థానాలే శ్రీరామరక్షగా నిలవాలని రైతులు కోరారు. భూసేకరణ ద్వారా రాజధాని ప్రాంతంలో ప్రభుత్వం తీసుకోతలపెట్టిన భూములు తిరిగి సృష్టించడానికి అవకాశం లేదని, అటువంటి క్రమంలో ఆహార కొరతకు దారి తీసే రీతిలో భూములు ఏ విధంగా సేకరిస్తారని ప్రశ్నించారు. సింగూరు భూముల విషయంలో రైతులకు అనుకూలంగా తీర్పు రావడం, తమకు సంతోషదాయకంగా ఉందని, ఈ తీర్పు న్యాయవ్యవస్థపై ప్రజలకు మరింత నమ్మకాన్ని పెంచిందని పేర్కొన్నారు.
Advertisement