దేశ ప్రజలు ఆనందంగా ఉండాలన్నదే ఆయన లక్ష్యం. అంతేకాదు ఐదేళ్ళలో తమ దేశం ప్రపంచంలోనే అత్యుత్తమ దేశంగా మారాలన్నది ఆ దేశ ప్రధాని ఆకాంక్ష. అదే దిశగా అడుగులు వేయడం ప్రారంభించారు. అందులో భాగంగానే మొదటిగా తమ మంత్రివర్గంలో 'మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ హ్యాపీనెస్' అంటూ ఓ ప్రత్యేక మంత్రిత్వశాఖను ఏర్పాటు చేశారు. యుఏఈ (యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్) ప్రధాని కార్యాలయం డైరెక్టర్ జనరల్ గా ఉన్న ఓహూద్ అల్ రౌమికి హ్యాపీనెస్ మినిస్టర్ గా చోటు కల్పించారు.
1985 లో ఎమిరేట్స్ ఎయిర్ లైన్స్ ను స్థాపించిన బ్రిటిష్ విద్యావంతుడు, వ్యాపారవేత్త అయిన షేక్ మహమూద్ బిన్ రషీద్... ప్రపంచంలోనే ఆరో ధనికదేశమైన (2006 లో వరల్డ్ బ్యాంక్ ర్యాంక్ ప్రకారం) దుబాయ్ కి ప్రధాని అయ్యారు. అంతేకాదు ఆయన కొత్త కేబినెట్ లో ఐదుగురు మహిళలకు స్థానం కల్పించారు. వారిలో ఒకరైన ఓహూద్ అల్ రౌమి ప్రస్తుతం ప్రధాని కార్యాలయం డైరెక్టర్ జనరల్ గా పనిచేస్తున్నారు. మాజీ యుఏఈ ఎమిరేట్ ఆర్థిక విధాన మాజీ అధిపతిగా కూడా బాధ్యతలు నిర్వర్తించిన ఆమెకు కొత్త కేబినెట్ లో హ్యాపీనెస్ మినిస్టర్ పోస్ట్ ను ఇచ్చారు. అల్ రౌమిని గతేడాది యునైటెడ్ ఫౌండేషన్ తమ గ్లోబల్ ఎంట్రప్రెన్యూర్ షిప్ మండలి సభ్యురాలుగా ఎన్నుకుంది. ఆ బాడీలో ఆమె మొదటి అరబ్ సభ్యురాలు.
అరబ్ ప్రజలు ఆనందంగా ఉండాలన్న ఆశయంతోనే ఈ కొత్త ఆలోచనకు శ్రీకారం చుట్టామని ప్రధాని షేక్ మొహమూద్ అంటున్నారు. యుఏఈ ప్రజల జీవనశైలిలో ఆనందం ఒక భాగం కావాలన్నదే తన లక్ష్యమని ఆయన తెలిపారు. అంతేకాదు 'హ్యూమర'సాన్ని ఒలికించే ఎన్నో పద్యాలను ప్రచురించారు. దీనికితోడు ఇటీవల తమ దేశానికి హ్యాపీయెస్ట్ నేషన్ అన్న నామకరణం చేశారు. ప్రజలు సంతృప్తిగా, ఆనందంగా జీవించేందుకు ఈ కొత్త మంత్రి పదవిని సృష్టించినట్లు మహమూద్ ట్విట్టర్ లో పేర్కొన్నారు. తమ ప్రయోగాత్మక ఆలోచనకు ప్రజల సహకారంతోపాటు అల్లా అండగా ఉండాలని ఆయన ప్రార్థించారు. 2015 వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ లో స్విట్జర్లాండ్ ప్రపంచంలోనే ఆనందకరమైన దేశంగా గుర్తింపు పొందగా.. ఈ సంపన్నదేశం 20వ ర్యాంకును సాధించింది. మానవాభివృద్ధి సూచీలోనూ తమ దేశం ప్రపంచంలో అత్యుత్తమస్థానం సంపాదించాలన్నదే తమ ఆశయమని, అదే అజెండాతో ఈ కొత్త నిర్ణయం తీసుకున్నట్లు మహమూద్ చెప్తున్నారు.
Ohood Al Roumi as Minister of State for Happiness. She remains responsible as DG of the Prime Minister’s Office. pic.twitter.com/1Omrzc9b8F
— HH Sheikh Mohammed (@HHShkMohd) February 10, 2016