‘‘నేను చదువుకునే రోజుల్లో ఫ్రెండ్స్ అంతా విహార యాత్రకు వెళ్తే నేను ఇంట్లో డబ్బులు అడిగి ఇబ్బందిపెట్టడం ఇష్టం లేక అలాగే ఉండిపొయేవాడిని. ఆ విహార యాత్రలో నా స్నేహితులు ఎలా ఎంజాయ్ చేస్తున్నారో అని ఆలోచిస్తూ ఉండేవాడిని. తమ్ముడి (ఆనంద్ దేవరకొండ) ఇంజినీరింగ్ ఫీజు కోసం ఇబ్బంది పడుతున్నప్పుడు ఎవరైనా కొంత సహాయం చేస్తే బాగుండును అనిపించేది.
కానీ ఎవర్నీ అడగడానికి ఇష్టం ఉండేది కాదు. అవన్నీ దాటుకుని ఈ స్థాయికి చేరుకున్నాను. ఇవాళ మీకు (అభిమానులు) హెల్ప్ చేయగలుగుతున్నాను అంటే అది నా వ్యక్తిగత ఆకాంక్ష. నేను అందించే ఈ లక్ష రూపాయలతో మీకు ఒత్తిడి తగ్గి ఆనందం కలిగితే అది నాకు సంతృప్తిగా ఉంటుంది’’ అన్నారు విజయ్ దేవరకొండ. శివ నిర్వాణ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ, సమంత జంటగా నటించిన చిత్రం ‘ఖుషి’. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్‌లు నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 1న విడుదలైంది.
‘ఖుషి’ సినిమా హ్యాపీనెస్‌ను షేర్ చేసేందుకు ఎంపిక చేసిన 100 లక్కీ ఫ్యామిలీస్‌కు రూ. లక్ష చొప్పున చెక్స్ అందించారు విజయ్ దేవరకొండ. హైదరాబాద్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ– ‘‘ఈ ప్రోగ్రామ్‌ను అనౌన్స్ చేసినప్పటి నుంచి మాకు ఇప్పటివరకూ 50 వేలకు పైగా దరఖాస్తులు వచ్చాయి. అయితే ఈ ఏడాది వంద మందికి మాత్రమే సహాయం చేయగలుగుతున్నాం. ప్రతి ఏడాది కొంతమందికి సహాయం చేస్తూనే ఉంటాను. నేను స్ట్రాంగ్‌గా ఉన్నంతవరకూ, సినిమాలు చేస్తున్నంతవరకూ నేను సహాయం చేస్తూనే ఉంటాను.
మీరు నాపై చూపిస్తున్న ప్రేమకు థ్యాంక్స్’’ అన్నారు. ‘‘కేవలం తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా తమిళనాడు, కర్ణాటక, సౌత్ స్టేట్స్ నుంచి సెలెక్ట్ చేశారు. సౌత్‌లో అన్ని ప్లేసెస్ నుంచి మా సినిమాకు మంచి స్పందన లభించింది’’ అన్నారు శివ నిర్వాణ. ‘‘వంద మందికి సహాయం చేయాలనే ప్రయత్నం మా మూవీతో విజయ్ మొదలుపెట్టినందుకు సంతోషంగా ఉంది’’ అన్నారు నవీన్, రవిశంకర్.
Comments
Please login to add a commentAdd a comment