మంచి మాట
‘అందమె ఆనందం’ అని ఒక సినిమా కవి అందాన్ని నిర్వచించాడు, ఆనందానికి నిర్వచనం ఇవ్వ బోతూ. ఆనందాన్ని కలిగించ కలిగింది మాత్రమే అందమని కవిహృదయం. ఎవరికి దేని వల్ల ఆనందం కలుగుతుందో చెప్పలేము. అందుకని అందం చూసే వాళ్ళ కళ్లలో ఉంటుందే కానీ వస్తువులో కాదు అనే ఆంగ్ల సామెత వచ్చింది. పైగా అందం వ్యక్తిగతం.‘
‘లోకో భిన్న రుచిః’’ అన్నట్టు ఒక్కొక్కరి కళ్ళకి అందంగా కనిపించింది వేరొకరికి అందంగా కనిపించక పోవచ్చు. అందం విషయంలో చాలామంది దృష్టి చర్మం దగ్గర ఆగిపోతుంది. కానీ,‘‘నిజమైన అందం శాశ్వతమైన ఆనందాన్ని కలిగిస్తుంది’’ అంటాడు ఆంగ్లకవి జాన్ కీట్స్.అందం అన్నది వస్తుగతం కాదు అనే విషయం పాశ్చాత్యులు కూడా బాగా అర్థం చేసుకున్నారు అని అర్థమయింది కదా!
అందానికి సంబంధించి ఒక్కొక్క దేశంలో ప్రమాణాలు ఒక్కొక్క రకంగా ఉంటాయి. చైనా దేశంలో స్త్రీల పాదాలు ఎంత చిన్నవిగా ఉంటే అంతటి అందగత్తెలుగా పరిగణిస్తారు. ముక్కు కొస పైకి ఉండి, ముక్కు రంధ్రాలు కనపడేట్టు ఉండటం అందంగా కొన్ని పాశ్చాత్య దేశాలలో పరిగణించబడుతుంది. భారతీయులు అందంగా పరిగణించే పొడవుగా, కోటేరు వేసినట్టు ముక్కు ఉంటే ఏనుగు ముక్కు అని వేళాకోళం చేస్తారట కూడా. ఆఫ్రికా దేశంలో పెదవులు ఎంత పెద్దగా ఉంటే అంత అందంగా ఉన్నట్టు. అందుకోసం చిన్నతనంలో పెదవులకి చిన్న చిన్న చిడతల వంటి వాటిని తగిలిస్తారట!
భారతీయుల సౌందర్య దృష్టిలో కూడా పారమార్థికత ఉంది. సౌందర్యం పరమాత్ముడి లక్షణాలు, లేక తత్వాలలో ఒకటి. సచ్చిదానంద స్వరూపుడైన పరమాత్మ తత్త్వం ‘‘సత్యం, శివం, సుందరం’’.సృష్టిలోని అందమంతా మూర్తీభవించిన పురుషరూపం శివుడు.ఆయనే చొక్కనాథుడు, సుందరేశ్వరుడు. అదే స్త్రీ రూపమైతే లలితా త్రిపురసుందరి.
భౌతికమైన అందం శాశ్వతం కాదు. ముద్దుముద్దుగా చూడగానే ముచ్చట గొలిపే పాలబుగ్గల పసివాడు చూస్తూ ఉండగానే పెద్దవాడు అవుతాడు. అప్పుడు పాలబుగ్గలు అందానికి హేతువు కాదు అని అర్థమవుతుంది.ఈ భౌతికరూపాన్ని అధిగమించిన అందాన్ని గురించి మాత్రమే భారతీయ ఋషులు, దార్శనికులు ప్రస్తావించారు. ఆ ప్రమాణాలని అనుసరించే ్రపాచీన కవులు సౌందర్య వర్ణన చేశారు.
చేతులని, పాదాలని, ముఖాన్ని, కన్నులని కూడా పద్మాలతో పోల్చుతారు. కారణం వాటి ఆకారం అట్లా ఉందని కాదు. పద్మం అందమైనది.ఆహ్లాదకరమైనది, మృదువైనది, శుభప్రదమైనది, పవిత్రమైనది. కనుక ఆ అవయవాలు అంతటి పవిత్రమైనవి అని సూచించటం.ఇతరమైన ఉపమానాలు కూడా అటువంటివే. పైకి భౌతికరూప వర్ణనలాగా అనిపించినా అంతరార్థం వేరు. బాహ్యసౌందర్యం ఆత్మసౌందర్య వ్యక్తీకరణ మాత్రమే.
భారతీయులకి అందం వస్తువు లేక మనిషికి సంబంధించింది కాదు. మనస్సుకి ఆత్మకి సంబంధించింది. ఆత్మసౌందర్యం మొదలైన పదబంధాలని వింటూనే ఉన్నాము. అంటే అందం వస్తువు లేక మనిషి మూలతత్త్వానికి సంబంధించింది. ఉదాహరణకి బెల్లం చూడటానికి అందంగా కనిపించదు. దాని అందం అంతా దాని రుచిలో ఉంటుంది. మనిషి మనసు స్వచ్ఛంగా ఉంటే అందంగా ఉన్నట్టు అనిపిస్తారు.
నిజానికి వారి అవయవాల్లో ఒక్కటి కూడా అందాల పోటీల వాళ్ళ కొలతలకి సరిపోవు. అవయవాల పొందిక వల్ల అందంగా ఉన్నట్టు కనిపిస్తారు. పొందికకి తోడు వారి ప్రేమపూరితమైన మనస్సు. దయ, సుహృద్భావం వంటి సద్భావనలతో మనస్సు నిండి ఉంటే ఆ సానుకూల భావతరంగాలు మనసు నుండి కనుల ద్వారా వెలువడి ముఖాన్ని కాంతిమంతంగా చేస్తాయి. అప్పుడు అందంగా కనిపించదా? దీన్ని వర్చస్సు అని కూడా చెప్పవచ్చు.
– డా.ఎన్.అనంతలక్ష్మి
Comments
Please login to add a commentAdd a comment