సాక్షి, హైదరాబాద్: ‘హ్యాపీనెస్’కూ ఒక లెక్కుందట. వినడానికి విచిత్రంగానే ఉన్నా నిజమేనని పరిశోధకులు చెబుతున్నారు. మనుషులుగా సంతోషంగా ఉండడం కంటే జీవిత పరమార్థం మరొకటి ఉండదనేది నిర్వివాదాంశమే. కరోనా కల్లోలంలోనూ సంతోషం తమ కంట్రోల్‌లోనే ఉందని అత్యధికులు అంటున్నారు. చాలామంది హ్యాపీగా, జాలీగా ఉన్నామంటున్నారు. కరోనా వైరస్ వ్యాప్తి, కోవిడ్ ఉధృతి నేపథ్యంలో అధిక డబ్బు సంపాదన, దానితో ముడిపడిన భౌతికసుఖాలు, విలాసవంతమైన జీవితం, అతి విలువైన వస్తువులు కలిగి ఉండడమే అంతిమ, జీవిత లక్ష్యం కాదనేది అందరికీ తెలిసొచ్చింది.
‘ట్రాకింగ్ హ్యాపీనెస్’
జీవితంలో ఏమి కావాలని కోరుకుంటున్నారని ఎవరినైనా అడిగితే ‘సంతోషం’అని సమాధానం వచ్చే అవకాశాలే ఎక్కువుంటాయి. అయితే సంతోషం కలగడానికి ఒక్కొక్కరిపై రకరకాల అంశాలు, పరిస్థితులు, మానసికస్థితి, అవగాహన వంటివి ప్రభావితం చేస్తుంటాయి. తాజాగా ‘ట్రాకింగ్ హ్యాపీనెస్’అనే ఆన్‌లైన్ సంస్థ నిర్వహించిన సర్వేలో అనేక ఆసక్తికరమైన అంశాలు వెల్లడయ్యాయి. తాము ఊహించిన దాని కంటే కూడా ఆనందం, సంతోషం వంటివి సంబంధిత వ్యక్తుల నియంత్రణలోనే ఉన్నట్టుగా తేలిందని ఆ సంస్థ తెలిపింది. సంతోషమన్న దాన్ని మీరు కంట్రోల్ చేయగలరా ? మీ గతేడాది జీవితాన్ని ఒకసారి వెనక్కు తిరిగి చూసుకుంటే 1 నుంచి 10 పాయిం ట్లకుగాను ఎన్ని పాయింట్ల మేర సంతో షంగా ఉన్నారని అనుకుంటున్నారు ? అన్న ప్రశ్నలపై ఈ సంస్థ అధ్యయనం నిర్వహించింది. సంతోషాన్ని, ఆనందాన్ని తమ నియంత్రణలోనే ఉంచుకోవచ్చనే భావనను, అభిప్రాయాన్ని 89 శాతం మంది వెలిబుచ్చారు. సంతోషాన్ని కంట్రో ల్ చేయలేమని భావిస్తున్నవారి కంటే కూడా తాము మరింత ఆనందంగా ఉన్నామని 32 శాతం మంది వెల్లడించారు. సంతోషంగా ఉన్నామని, ఆనందాన్ని కంట్రోల్ చేయొచ్చునని చెబుతున్నవారు హ్యాపీనెస్ రేటింగ్‌లో 10 మార్కులకుగాను సగటును 7.39 రేటింగ్‌తో నిలవగా, సంతోషాన్ని నియంత్రించలేమని చెప్పిన వారు సగటున 5.61 రేటింగ్‌ను సాధించారు.
జెండర్‌కు అతీతంగా..
ఆనందం/సంతోషానికి ఎలాంటి లింగ భేదాలు లేవు. జెండర్ అనేది సంతోషాన్ని నియంత్రించలేదు. పురుషులా, స్త్రీలా అన్న దానితో సంబంధం లేకుండా సంతోషం అనేది వారి వారి నియంత్రణలోనే ఉన్నట్టుగా ఈ పరిశీలనలో వెల్లడైంది. మగవారు, ఆడవారు ఇద్దరూ కూడా ఈ విషయంలో ఒకే విధంగా సమాధానాలిచ్చారు.
వయసుకూ, విద్యకూ పాత్ర
వయసు కూడా హ్యాపీనెస్ కంట్రోల్‌లో పాత్ర పోషిస్తున్నట్టు తేలింది. మధ్య వయసుకు వచ్చేసరికి సంతోషంపై నియంత్రణ తగ్గి, ఆ తర్వాత వయసు పెరిగినకొద్దీ ఇది పెరుగుతోందని ఈ సర్వేలో పలువురు సమాధానాలిచ్చా రు. సర్వే చేసిన వారిలో 16–30 ఏళ్ల మధ్య వయసున్నవారు 91 శాతం మంది, 31–45 ఏళ్ల మధ్యలోనివారు 85 శాతం, 45–60 ఏళ్ల లోనివారు 86 శాతం, 60 ఏళ్లు పైబడిన వారు 89% తాము సంతోషాన్ని కంట్రోల్ చేయగలమని అనుకుంటున్నారు. అయితే డిగ్రీలు, పీజీలు చేసి న వారి కంటే తక్కు వ చదువుకున్న వారు తాము తక్కువగా సంతోషాన్ని కంట్రోల్ చేయగలుగుతున్నట్టుగా అభిప్రాయపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment